iDreamPost

25% ఫార్ములా అందరూ వాడగలరా

25% ఫార్ములా అందరూ వాడగలరా

కరోనా వల్ల షూటింగులు లేక విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఆగిపోయి నిర్మాతలు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. రానున్న రోజుల్లో కాస్ట్ కటింగ్ తప్పదని రాజమౌళి, సురేష్ బాబు లాంటి దిగ్గజాలు ఇప్పటికే రాబోయే రోజులను ఊహించి చెబుతున్నారు. ఒకవేళ ఈ విషయంలో రాజీ పడకపోతే భవిష్యత్ పరిణామాలు కష్టంగా మారే అవకాశం ఉందని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. ఎప్పటిలాగే పరిస్థితి పూర్తిగా కంట్రోల్ లోకి రావడానికి ఎంత లేదన్నా ఏడాదిపైనే పడుతుంది.

అందులోనూ థియేటర్లు, షూటింగుల అనుమతి కోసం ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెడుతుందో తెలియదు. వాటిలో ఎన్ని చిక్కుముడులు ఉంటాయో ఊహించలేం. ఈ నేపథ్యంలో నిర్మాతల క్షేమం కోరడం అన్ని వర్గాలకు ఇప్పుడున్న ప్రధాన అవసరం. తమిళనాడులో ఈ ట్రెండ్ మొదలైపోయింది. బిచ్చగాడుతో తెలుగులోనూ పాపులారిటీ తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ ఇప్పటి నుంచి తన పారితోషికంలో 25 శాతం తగ్గించుకుని తీసుకుంటానని చెప్పడం అందరితోనూ మెప్పు పొందింది. తాజాగా సూర్య సింగం సిరీస్ దర్శకుడు హరి కూడా తన కొత్త ప్రాజెక్ట్ కు ఇస్తానన్న పారితోషికంలో 25 శాతం తగ్గించుకుంటానని ఇప్పటికే ప్రొడక్షన్ హౌస్ కు లెటర్ పంపాడు. నిజానికి ఇలా చేయకపోయినా ముందు ఒప్పుకున్న మొత్తాన్ని సదరు సంస్థ ఇవ్వాల్సిందే. అయినా హరి అలా ఆలోచించకుండ లేఖ రాయడం మంచి నిర్ణయం.

కానీ ఇలాంటి డెసిషన్లు స్టార్ హీరోల నుంచి వస్తే తప్ప మిగిలినవాళ్లు స్ఫూర్తి పొందరు. రొటీన్ కమర్షియల్ సబ్జెక్టులకు సైతం బడ్జెట్లు వందల కోట్లకు చేరడానికి కారణం హీరో హీరోయిన్ల భారీ రెమ్యునరేషన్లే. కొంత కాలం పాటు వీటిని తగ్గించుకుంటే కరోనా వల్ల ఎదురుకున్న నష్టాలను నిర్మాతలు కొంతైనా తగ్గించుకోగలుగుతారు. భవిష్యత్తులో అంతా నార్మల్ అయ్యాక అప్పుడు పూర్వ స్థితికి వెళ్లొచ్చు. ఒక్కసారి తగ్గించుకుంటే ముందుముందు కూడా అదే అలవాటుగా చేస్తారనే అనుమానం స్టార్లకు కలగొచ్చు. అసలు ఇలాంటిదేదైనా జరగాలంటే ముందుగా చర్చించుకోవాల్సింది నిర్మాతలు. ఈ విషయంలో ఏదైనా ముందడుగు పడాలంటే అది వాళ్ళ చేతుల్లోనే ఉంది. మరి ఈ 25% కట్ ఫార్ములా కోలీవుడ్ నుంచి మనవాళ్ళు ఎవరైనా అందిపుచ్చుకుంటారేమో వేచి చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి