iDreamPost

రూ.2.40ల‌క్ష‌ల‌ కోట్లు. దేశంలో ఎగ్గొట్టిన బ్యాంక్ లోన్ల మొత్తం 87 దేశాల జీడీపీక‌న్నా ఎక్కువే

రూ.2.40ల‌క్ష‌ల‌ కోట్లు. దేశంలో ఎగ్గొట్టిన బ్యాంక్ లోన్ల మొత్తం 87 దేశాల జీడీపీక‌న్నా ఎక్కువే

దేశంలోని వివిధ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన మొత్తం అక్షరాలా 2 లక్షలా 40 వేల కోట్ల రూపాయలు! 87 దేశాల GDPని ఇది మించిపోయింది. కేంద్ర ఆరోగ్య శాఖ కేటాయింపుల కంటే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ. ఉపాధి హామీ పథకానికి మంజూరు చేసే నిధులకు రెట్టింపు. గత దశాబ్ద కాలంలో డిఫాల్టర్లు ఎగ్గొట్టిన రుణ మొత్తం పదింతలు పెరిగింది. 2012 మార్చి 31న 23 వేల కోట్లు ఉన్న డీఫాల్ట్ అమౌంట్ 2022 మార్చి 31 నాటికి 2.4 లక్షల కోట్లకు పెరిగినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చెబుతోంది.

RBI ప్రకారం, తీర్చే శక్తి ఉండి కూడా రుణాలు తీర్చనివాళ్ళు, లోను తీసుకున్న పనికి కాక మరో పనికి దాన్ని ఉపయోగించేవాళ్ళు ఉద్దేశపూర్వక డిఫాల్టర్లు. ఇలాంటి వాళ్ళు 12 వేల మంది ఉన్నట్లు ToI రిపోర్ట్ చెబుతోంది. విచిత్రంగా విజయ్ మాల్యా, నీరవ్ మోడి ఈ లిస్టులో మొదటి స్థానాల్లో లేరు. అంటే అంత కంటే ఘనులున్నారన్నమాట! ABG గ్రూప్ ని ప్రమోట్ చేసే రిషి అగర్వాల్ (Rishi Agarwal) ఆ ఘనుల్లో మొదటివాడు. ABGకి చెందిన ఏడు అకౌంట్ల ద్వారా వివిధ బ్యాంకుల నుంచి తీసుకుని ఎగ్గొట్టిన మొత్తం 6 వేల 382 కోట్ల రూపాయలు! ఇక అరవింద్ ధామ్ (Arvind Dham) ది రెండో స్థానం. ఈయనగారి యామ్ టెక్ ఆటో (Amtek Auto), దాని సంబంధిత కంపెనీలు 5 వేల 885 కోట్ల రూపాయలు రుణంగా తీసుకుని ఎగ్గొట్టాయి. పరారీలో ఉన్న నితిన్ & చేతన్ సందేశారా బ్రదర్స్ ది మూడో స్థానం. శక్తి భోగ్ ఫుడ్స్ (ShaktiBhog Foods), సింటెక్స్ ఇండస్ట్రీస్ (Sintex Industries), రోటోమాక్ గ్లోబల్ (Rotomac Global), డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (Deccan Chronicle Holdings), ఎస్. కుమార్స్ (S. Kumars) కంపెనీలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి.

ఇక బాధిత బ్యాంకుల జాబితాలో 95 శాతం పబ్లిక్ సెక్టార్ కి చెందినవే! ఎగ్గొట్టిన రుణాల్లో 30 శాతం ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India, SBI) మంజూరు చేసినవే! ఆ తర్వాతి స్థానాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank, PNB), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda, BoB) ఉన్నాయి. ఈ బ్యాంకుల రికార్డుల్లో 10 శాతం చొప్పన డీఫాల్ట్ రుణాలు నమోదై ఉన్నాయి. ఇక రాష్ట్రాల విషయానికొస్తే మహారాష్ట్రలో అత్యధిక డీఫాల్ రుణాలు నమోదయ్యాయి. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి