iDreamPost

ఆచితూచి అడుగులు వేస్తున్న జూపూడి ప్రభాకర్‌

ఆచితూచి అడుగులు వేస్తున్న జూపూడి ప్రభాకర్‌

ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకు పక్కనే ఉన్న నియోజకవర్గం కొండపి. గతంలో జనరల్‌లో ఉన్న ఈ నియోజకవర్గం.. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ రిజర్డ్వ్‌ అయింది. అంతకు ముందు టీడీపీ తరఫున దామచర్ల ఆంజనేయులు, కాంగ్రెస్‌ తరఫున పోతుల రామారావులు ఈ నియోజకవర్గం నుంచి తలపడ్డారు. ఎస్పీ రిజర్డ్వ్‌ అయిన తర్వాత ఇక్కడ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున గుర్రాల వెంకట శేషు.. టీడీపీ అభ్యర్థి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిపై గెలిచారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా కూడా పని చేశారు.

2014లో వైసీపీ, టీడీపీలు తలపడ్డాయి. వైసీపీ తరఫున జూపూడి ప్రభాకర్, టీడీపీ తరఫున బాల వీరాంజనేయ స్వామిలు పోటీ చేయగా.. టీడీపీ అభ్యర్థి 5,440 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా ఉన్న జూపూyì Sఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ గా పని చేశారు. అంతకు ముందు నుంచి ఆయన మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు. వైఎస్‌పై ఉన్న అభిమానంతో ఆయన వైఎస్‌ జగన్‌ వెంట ఆది నుంచి నడిచారు. వైఎస్‌ జగన్‌కు బలమైన మద్ధతుదారుడుగా ఉన్నారు. వైఎస్‌ మరణంపై అనేక సందేహాలను జూపూడి వ్యక్తం చేశారు. ఎరోనాటికల్‌ ఇంజనీర్‌ అయిన జూపూడి హెలికాప్టర్‌ ప్రమాదంపై లేవనెత్తిన అనేక ప్రశ్నలు ప్రజల్లో విస్తృత చర్చకు దారితీశాయి. ఓదార్పు యాత్రలో వైఎస్‌ జగన్‌ వెన్నంటి జూపూడి ఉన్నారు.

కొండపి నుంచి ఎమ్మెల్యేగా గెలవాలనే ఆశతో ఉన్న జూపూడికి 2014లో ఓటమి తీవ్ర నిరాశను కలిగించింది. తన ఓటమికి వైసీపీ జిల్లా పెద్దలే కారణమనే భావనలో ఆయనలో అనువణువునా నిండిపోయింది. ఈ క్రమంలో తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లగక్కిన జూపూడి వైసీపీని వీడారు. టీడీపీలో చేరారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పదవి దక్కించుకున్నారు. టీడీపీ నేత, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా.. ఉంటూ వైసీపీపై, వైఎస్‌ జగన్‌పై తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేశారు. ఒకప్పుడు వైఎస్‌జగన్‌కు బలమైన మద్ధతుదారుడుగా ఉన్న జూపూడి.. ఆ తర్వాత తీవ్ర స్థాయిలో విభేదిస్తూ.. విమర్శలు చేయడంపై వైసీపీ క్యాడర్‌ కూడా ఆశ్చర్యపోయింది.

2019లో జూపూడికి పోటీ చేసే అవకాశం రాలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత జూపూడి వైసీపీ పంచన చేశారు. ఆయన చేరిక కూడా వైసీపీ అభిమానులకు ఆశ్చర్యపరిచింది. పార్టీని, వైఎస్‌ జగన్‌ను దుర్భాషలాడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన జూపూడి చేరికను మెజారిటీ వైసీపీ మద్ధతుదారులు వ్యతిరేకించారు. జూపూడి చేరిక సమయంలో వైఎస్‌ జగన్‌.. ఆయన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం విశేషం. ఈ పరిణామాలు.. జూపూడి వైసీపీకి కోవర్ట్‌గా పని చేశారా..? అనే ప్రశ్నలు మీడియా నుంచి జూపూడికి ఎదురయ్యాయి.

Also Read : ఎమ్మెల్యే బుర్రా.. మాజీ ఎమ్మెల్యే ఉగ్ర – ఇద్దరూ ఇద్దరే

అవకాశం ఉంటే.. మళ్లీ కొండపి నుంచి పోటీ చేసేందుకు జూపూడి ఆశక్తి చూపుతున్నారు. అయితే వైసీపీలో చేరిన తర్వాత ఆయన కొండపికి ఒకేఒక్కసారి వచ్చారు. స్థానిక నేత, మాజీ జడ్పీటీసీ రావూరి అయ్యవారయ్య బైపాస్‌ సర్జరీ చేయించుకోగా.. ఆయన్ను పరామర్శించేందుకు జూపడి వచ్చారు. ఆ సమయంలో స్థానిక నేతలతో ముచ్చటించారు. అది మినహా.. కొండపికి వచ్చి దాఖలాలు లేవు. ఒంగోలుకే పరిమతం అయ్యారు.

ప్రస్తుతం కొండపి కో ఆర్డినేటర్‌గా మాదాసి వెంకయ్య ఉన్నారు. ఎన్నికలకు ముందు వరకు అశోక్‌బాబు వైసీపీ కో ఆర్డినేటర్‌గా ఉండగా.. అనూహ్యంగా మాదాసి వెంకయ్య వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలుచుకున్నారు. వరుసగా రెండోసారి టీడీపీ తరఫున బాల వీరాంజనేయ స్వామి విజయం సాధించారు. మాదాసి వెంకయ్యకు వైసీపీ అధిష్టానం.. పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ పదవిని కట్టబెట్టింది.

వైసీపీలో చేరినప్పుటి నుంచీ జూపూడి జాడ పెద్దగా కనిపించడం లేదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద నాయకుల దూరంగా ఉంటున్నారు. కింది స్థాయి నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ.. వారి సలహాల మేరకు నడుచుకుంటున్నారు. రీస్టార్ట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. క్యాడర్‌ లేమితో ఎటూ అడుగువేయలేని స్థితిలో జూపూడి ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితులను బట్టీ నడుచుకుంటున్నారు. ఇటీవల పార్టీ తాడేపల్లి కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ పెట్టడడమే.. ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి జరిగిన పెద్ద పరిణామం.

దూకుడుగా ఉండే జూపూడి ప్రస్తుతం తన సహజశైలికి భిన్నంగా వ్యవహరించాల్సిన పరిస్థితి. దూకుడుగా ఉండాలనుకుంటున్నా.. టీడీపీలో ఉండగా పార్టీ పట్ల వ్యవహరించిన తీరుతో పార్టీ క్యాడర్‌ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాబోవు మూడేళ్లలో తన పయనం ఎలా సాగుతుందనే అంశంపై కూడా జూపూడికి క్లారిటీ లేదంటే ఆయన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత అనుభవాల దృష్ట్యా స్తబ్ధుగా ఉంటూ.. చాపకింద నీరులా తన పని తాను చేసుకుపోవాలనే ఆలోచనలో జూపూడి ఉన్నారు. ఎన్నికల సమయం నాటికి అప్పటి పరిస్థితులను బట్టి కొండపి టిక్కెట్‌ అడగడం లేదా ఎమ్మెల్సీ, మరేదైనా పదవి కోసం ప్రయత్నాలు చేసే ఆలోచనలో జూపూడి ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : కందుకూరు మాజీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి