iDreamPost

వ్యాక్సిన్ పై ఊగిసలాట ఎందుకు?

వ్యాక్సిన్ పై ఊగిసలాట ఎందుకు?

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి బారి నుంచి కాపాడేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఉపశమనం కలిగించే అంశమే. అందులోనూ ప్రపంచంలో అత్యధికంగా వాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మన దేశంలో అది పంపిణీ ప్రారంభం కావడం మరింత ఊరట. ఇప్పటికే రష్యా. యూకే, యూఎస్ సహా పలు దేశాలు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల కన్నా అత్యధికంగా ఇండియాలోనే పంపిణీ కావడం విశేషం.

అయితే ఇండియాలో ప్రస్తుతం కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ అందిస్తున్నారు. అందులో సీరమ్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన కోవీషీల్డ్ పట్ల కొందరు మొగ్గు చూపుతున్నారు. ప్రఖ్యాత ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి చెందిన వైద్యులు తమకు కోవాగ్జిన్ వద్దని చెప్పడం, కోవీషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే ఇవ్వాలని సూపరింటెండెంట్‌కు లేఖ రాయడం దానికి ఓ సంకేతం. వైద్య రంగ నిపుణులు, అందులోనూ ఉన్నత సంస్థకు చెందిన వారు తమకు ఫలానా వ్యాక్సిన్ మాత్రమే కావాలని కోరడం చర్చనీయాంశమయ్యింది.

హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ ఇవ్వొద్దని ఢిల్లీ వైద్యులు రాసిన లేఖ ఆసక్తిగా మారింది. అయితే కోవాగ్జిన్ పట్ల వైద్యుల్లో కూడా సందేహాలు వ్యక్తం కావడానికి ప్రధాన కారణం కోవాగ్జిన్ ట్రయల్స్ ఇంకా పూర్తి కాకపోవడమేనని చెప్పవచ్చు. కేంద్రం కూడా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కానందున కోవాగ్జిన్ ని కేవలం ప్రయోగాత్మకంగా అందించడానికి అంగీకిరంచింది. అయితే దానికి భిన్నంగా ఆచరణలో అది కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి పంపిణీ జరుగుతోంది. దాంతో వైద్యులు కొందరు అభ్యంతరాలు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి, ఫలితాల సారాంశాన్ని వెల్లడించిన తర్వాత మాత్రమే వ్యాక్సిన్ అందించడానికి అర్హత ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దానికి భిన్నంగా సాగుతున్న తీరు సందేహాలకు తావిస్తోంది.

ఇప్పటికే కరోనా కారణంగా కలత చెందిన సెక్షన్లలో కూడా వ్యాక్సిన్ వచ్చిందనే ఉత్సాహం కనిపించడం లేదు. పైగా కేంద్రంలోని కీలక నేతలు వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనుకాడిన తీరు కూడా సామాన్యుల్లో చర్చకు ఆస్కారం కల్పించింది. కొద్ది రోజుల క్రితం హర్యానా మంత్రి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అస్వస్థతకు గురికావడం, తాజాగా నార్వేలో ఫైజర్ వ్యాక్సిన్ వికటించి ఏకంగా 26 మంది మృత్యువాత పడడం వంటి ఘటనలు కొంత అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే మన దేశంలో తొలి రెండు రోజుల వ్యాక్సిన్ అందుకున్న వారిలో కేవలం 500 మంది లోపు మాత్రమే స్వల్ప అస్వస్థతకు గురికావడం, కేవలం ఒక్కరికి మాత్రమే పరిస్థితి విషమించినట్టు కేంద్రం అధికారికంగా ప్రకటించడం మరింత ఊరటనిచ్చే అంశంగా చెబుతున్నారు.

అయినప్పటికీ పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకోవడానికి మరిన్ని పరిశీలన, మరింత మంది అనుభవాలు వెలుగులోకి రావాల్సి ఉందని నిపుణులు సైతం భావిస్తున్నారు. భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ తుది ఫలితాలు ఎలా ఉంటాయన్నది నిర్ధారణకు రావడానికి మరింత సమయం పడుతుందని చెబుతున్నారు. పూర్తి ఫలితాలు వచ్చి, వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా భరోసా లభిస్తే ప్రజల్లో ఉత్సాహం పెరిగే అవకాశం ఉంది. అంతవరకూ వ్యాక్సిన్ ద్వారా లభించే సానుకూలత స్వల్పంగానే ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ఆశాజనకంగా ఉండడంతో కొద్ది రోజుల్లోనే మెరుగైన ఫలితాలు ఆశించవచ్చని భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి