iDreamPost

లాక్ డౌన్ ప్రకటనలు.. అంత రహస్యమెందుకు..?

లాక్ డౌన్ ప్రకటనలు.. అంత రహస్యమెందుకు..?

‘‘లాక్ డౌన్ ప్రకటన గురించి ముందే తెలిస్తే.. కరోనా అలర్ట్ అయిపోతుంది. లాక్ డౌన్ కు చిక్కకుండా దాక్కుంటుంది. అందుకే ఈ విషయాన్ని ముఖ్యమంత్రులు చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు. ఉన్నట్టుండి లాక్ డౌన్ ప్రకటిస్తున్నారు. కరోనాపై సర్జికల్ స్ర్టైక్స్ చేస్తున్నారు. దెబ్బ అదుర్స్ కదూ’’.. ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాష్ట్రాలు సడెన్ గా లాక్ డౌన్లు ప్రకటించడంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెటైర్ ఇది.

ప్రజలు ఆంక్షలు, కర్ఫ్యూలు, లాక్ డౌన్లకు అలవాటు పడినా.. సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వాల తీరు మాత్రం మారడం లేదు. ఇలాంటి సడన్ లాక్ డౌన్ ప్రకటనల వల్ల లాభమేంటో తెలియదు కానీ.. జనాలకు జరిగే నష్టమే ఎక్కువ. ముందు కొంచెం టైం ఇచ్చి ఆంక్షలు విధిస్తే.. అందుకు ప్రజలు కూడా సన్నద్ధమవుతారు. కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటారు. కష్టమో నష్టమో భరించేందుకు మనసు దిటవు చేసుకుంటారు. కానీ అటు కేంద్రం.. ఇటు రాష్ట్రాలు మారవుగా..!!

కరోనా కల్లోలంతో దేశం మళ్లీ లాక్ డౌన్ వైపు అడుగులు వేస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్లు, ఇతర ఆంక్షలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఒక్కో రాష్ట్రం వరుసగా లాక్ డౌన్ ప్రకటనలు చేస్తున్నాయి. తాజాగా గోవా కూడా ఆ జాబితాలోకి చేరిపోయింది. మే 3వ తేదీ ఉదయం దాకా కఠిన ఆంక్షలు ఉంటాయని ప్రకటించింది. ఇక్కటి దాకా అంతా బాగానే ఉంది. కానీ లాక్ డౌన్ ప్రకటన విషయంలో అంత రహస్యమెందుకు? ప్రజలకు కాస్త సమయం ఇచ్చి ప్రకటిస్తే వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి.

కాస్త ముందుగా చెప్పలేరా?

కరోనా రాక ముందు వరకు మన దేశంలో లాక్ డౌన్ అంటే ఏంటో కూడా ఎవరికీ తెలియదు. అప్పుడెప్పుడో ఎమర్జెన్సీ విధించినట్లు తెలుసు. కానీ కరోనా వచ్చిన తర్వాత లాక్ డౌన్, కర్ఫ్యూలు, ఆంక్షలు జనాలకు అలావాటు అయ్యాయి. మరి అలాంటప్పుడు లాక్ డౌన్ విధించే ముందు ప్రజలకు కొంచెం టైం ఇస్తే ఏం పోయింది? వచ్చే నష్టం ఏముంది? సడెన్ గా లాక్ డౌన్ ప్రకటన చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి? ఎన్ని జీవితాలు ప్రభావితమవుతాయి. చిరు వ్యాపారులు, వలస కూలీలు.. ఇంకా ఎంతో మంది ఇక్కట్లు పడతారు. కానీ ఏడాదిగా పాఠాలు నేర్వని ప్రభుత్వాలు.. అదే మూస ధోరణిలో ముందుకుపోతున్నాయి. ఒక ప్రణాళిక అనేది లేకుండా గుడ్డిగా ప్రవర్తిస్తున్నాయి. నిజానికి కరోనా సెకండ్ వేవ్ కు కూడా ఇదే ప్రధాన కారణం.

Also Read : ఢిల్లీ, కర్ణాటక సరసన మరో రాష్ట్రం

అన్ని రాష్ట్రాలదీ అదే తీరు…

దేశంలో కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. రోజూ నమోదయ్యే కేసుల్లో 30 నుంచి 40 శాతం ఇక్కడే వస్తున్నాయి. మరణాల విషయంలోనూ ఇదే పరిస్థితి. చాలా రోజులుగా డైలీ 500 మందికి పైగా చనిపోతున్నారు. దీంతో రెండు వారాల కిందట అక్కడ జనతా కర్ఫ్యూ పెట్టారు. దాదాపు లాక్ డౌన్ లాంటిదే. అయితే ముందుగా ప్రజలకు చెప్పి, వాళ్లకు కాస్త సమయం ఇచ్చి ప్రకటన చేసి ఉంటే.. బాగుండేది. కానీ అలా చేయలేదు. ఉన్నట్టుండి కఠిన ఆంక్షలు అన్నారు. దీంతో మహారాష్ట్రలో అలజడి రేగింది. వలస కూలీలందరూ సొంతూళ్ల బాట పట్టారు. వేలాది మంది రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లకు చేరుకున్నారు. ఈ పరిస్థితి వల్ల కరోనా కట్టడి కంటే.. వ్యాప్తి ఎక్కువగా జరిగింది. లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. తర్వాత ఢిల్లీలో, కర్ణాటకలో, జార్ఖండ్ లో, ఇప్పుడు గోవాలో అన్ని చోట్ల ఇదే తీరు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. సడెన్ గా ప్రకటన చేయడమే. ఇలాంటి అకాస్మాత్తు ప్రకటనల వల్ల ఒరిగే లాభమేంటో, ఇందులో ఉన్న మర్మమేంటో కనీసం పాలకులకైనా తెలుసా?

పొడిగింపు లాక్ డౌన్లు..

ఢిల్లీ సర్కారు ఈ పొడిగింపు లాక్ డౌన్లకు శ్రీకారం చుట్టింది. ముందు ఆరు రోజులు లాక్ డౌన్ ఉంటుందని ప్రకటన చేసింది. కానీ తర్వాత మాత్రం మరో వారం పొడిగించింది. ఆరు రోజుల్లో కరోనా కట్టడి అవుతుందని భావించామని, హెల్త్ సిస్టమ్ ను మెరుగుపరచాలని అనుకున్నామని, కానీ కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ పొడిగించాల్సి వచ్చిందని ఢిల్లీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే అసలు కారణం ఇది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకేసారి 15 రోజులు లాక్ డౌన్ అంటే జనాలు పానిక్ అయిపోయే ప్రమాదం ఉందని, వలస కూలీలు నగరం విడిచి వెళ్లిపోతారని కేజ్రీవాల్ ప్రభుత్వం భావించింది. అందుకే ఆరు రోజుల లాక్ డౌన్ ప్రకటన చేసి.. కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోవద్దంటూ సీఎం కేజ్రీవాల్ కోరారు. కానీ చాలా మంది వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను మళ్లీ పొడిగించారు.

Also Read : జాతీయ వాదం కాదు.. జాతీయ విధానం కావాలిప్పుడు

నిజానికి గతేడాది లాక్ డౌన్ ప్రకటించడానికి ముందే ప్రధాని మోడీ ఈ టెక్నిక్ ఫాలో అయ్యారు. ముందు జనతా కర్ఫ్యూ అన్నారు. జనాలెవరూ ఇళ్లు దాటి బయటికి రాలేదు. అది పూర్తికాకముందే.. దేశమంతా లాక్ డౌన్ అన్నారు. దెబ్బకు బిత్తరపోయారు జనం. ఇప్పుడు రాష్ట్రాలు ఇదే ఫార్ములా పాటిస్తున్నాయి.

కర్ణాటక సర్కారు కూడా 14 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఒకవేళ వ్యాప్తి తగ్గక పోతే.. లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు లేకపోలేదు. అక్కడ పని చేసే వలస కూలీల్లో తెలుగు వాళ్లు చాలా ఎక్కువ. అనంతపురంతో పాటు పలు జిల్లాలకు చెందిన చాలా మంది అక్కడ పనులు చేసుకుంటూ ఉంటున్నారు. కానీ సడెన్ లాక్ డౌన్ వల్ల వాళ్లు ఇక్కట్లు పడుతున్నారు. సొంతూళ్లకు ఎలా వెళ్లాలో తెలియక అవస్థలు పడుతున్నారు.

ఇప్పుడు లాక్ డౌన్ ప్రకటించిన గోవాలో కూడా ఇంతే. చాలా తక్కువ రోజులు క్లోజ్ డౌన్ పెట్టారు. వలస కూలీలు రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లవద్దని గోవా సీఎం ప్రమోద్ సావంత్ కోరారు. వలస కూలీలు వెళ్లిపోతారన్న భయం తప్పితే.. వాళ్లకు ముందుగా సాయం అందించి, అవసరాలు తీర్చాలనే యోచన మాత్రం రాష్ట్రాల ప్రభుత్వాలకు లేకపోవడం శోచనీయం.

కేంద్రమూ షాక్ ఇస్తుందా?

ఏప్రిల్ నెల ముగిశాక కేంద్ర ప్రభుత్వం కూడా లాక్ డౌన్ పెట్టే అవకాశాలు ఉన్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మే 2 వ తేదీ నుంచి లాక్ డౌన్ పెడుతుందని ఇప్పటికే గ్రామాల్లో జనం అనుకుంటున్నారు. నిజంగా కేంద్రం లాక్ డౌన్ పెట్టాలనుకుంటే.. ఇప్పుడే ముందస్తు సమచారం ఇవ్వడం చాలా ముఖ్యం. ప్రజలు అందుకు మానసికంగా సిద్ధమవుతారు. లేదు.. గతేడాది మాదిరే సడెన్ గా లాక్ డౌన్ ప్రకటిస్తే… కరోనా కట్టడి సంగతి దేవుడెరుగు.. జనం ఇక్కట్లు పడుతారు. మే 1 నుంచి ప్రారంభించాల్సిన మూడో దశ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పై ఎఫెక్ట్ పడుతుంది. సారూ.. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

Also Read : మే 2 తర్వాత ఏం జ‌ర‌గ‌బోతోంది..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి