iDreamPost

రాజ్ థాక‌రే పార్టీలో ఏకనాథ్ షిండే వ‌ర్గం విలీనం? మ‌హారాజ‌కీయాల్లో కొత్త ట్విస్ట్

రాజ్ థాక‌రే పార్టీలో ఏకనాథ్ షిండే వ‌ర్గం విలీనం? మ‌హారాజ‌కీయాల్లో కొత్త ట్విస్ట్

తిరుగుబాటు చేసినంత హుషారుగా ఇప్పుడు, తదుప‌రి కార్య‌చ‌ర‌ణ గురించి శివ‌సేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆలోచించ‌లేక‌పోతున్నారు. కాని మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులపై స్పందించేందుకు, సుప్రీంకోర్టు జూలై 12 వరకు గడువు ఇవ్వడంతో, ఏక్‌నాథ్ షిండే వర్గానికి రెండువారాలు ఊపిరి పీల్చుకోవ‌చ్చు. కాస్తంత వెసులుబాటైతే దొరికిందికాని, ఏం చేయాల‌న్న‌ది దానిమీద క్లారిటీ లేదు. ఇదో పెద్ద వ్యూహాత్మ‌క గంద‌ర‌గోళం. ఇంత‌కీ వేరే పార్టీలో విలీనం కావాలా లేదంటే తమదే నిజమైన శివసేన అని నిరూపించుకోవాలా?

రెండోది చాలా క‌ష్టం. ఫిరాయింపుల నిరోధక చట్టం వ‌ల్ల‌, మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న‌ షిండే లక్ష్యం అంత సులభం కాదు. ఈ ప్ర‌భుత్వంలో శివసేన, ఎన్సీపీ , కాంగ్రెస్ పార్టీలున్నాయి. వాళ్ల బ‌లం, వాళ్ల వ్యూహాలు వాళ్ల‌కున్నాయి. ఒక‌వేళ వేరుప‌డినా, అసెంబ్లీలో తాము ప్రత్యేక గ్రూపుగా చెప్పుకోలేరు. చ‌ట్టం అందుకు ఒప్పుకోదు. మరో పార్టీలో విలీనం చేస్తేనే ఆ అవ‌కాశ‌ముంది.

ప్ర‌భుత్వాన్ని ముఖాముఖి ప‌డ‌గొట్ట‌క‌పోతే, ఇక మిగిలింది విలీన‌మే. మ‌రి ఏ పార్టీలో విలీనం కావాలి? తిరుగుబాటుకు సూత్ర‌ధారిగా శివ‌సేన ఆరోపిస్తున్న బీజేపీ చాలా మంచి ఎంపికే. కాని తిరుగుబాటుదారులు కోరుకొంటున్న‌ట్లు వాళ్ల‌కు సీఎం ప‌ద‌వి, మంత్రిప‌ద‌వులు అంత‌సులువుగా ద‌క్క‌వు. ఒక‌సారిగా బీజేపీలో క‌ల‌సిపోతే, వాళ్ల‌కంటూ వ్య‌క్తిత్వం మిగ‌ల‌దు. అస‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంత‌మందికి టిక్కెట్లు వ‌స్తాయోకూడా అనుమాన‌మే.

అందుకే, మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక వాద‌న వినిపిస్తోంది. రాజ్ థాకరే పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) లో విలీన‌మైతే ఎలాగ ఉంటుంది? ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు రాజ్ థాక‌రే ద‌గ్గ‌రి బంధువు. శివ‌సేన మీద క‌త్తిక‌ట్టిన‌వాడు.

ఏక్‌నాథ్ షిండే కొన్నిరోజులుగా రాజ్ థాకరేతో మాట్లాతున్నారు. ఆయ‌న వ‌ర్గం మాత్రం ఆయన ఆరోగ్యం గురించి వాక‌బు చేశార‌ని అంటున్నారు. కాని రాజకీయాలపై చర్చ జ‌రిగింద‌ని MNS నాయకులు చెబుతున్నారు. ఇంత‌కీ ఇద్ద‌రూ ఏం మాట్లాడుకున్నారు?

పార్టీలో విలీనం గురించి షిండే వ‌ర్గం నుంచి అధికారిక ప్రతిపాదన ఏదీ రాలేదు. ఒక‌వేళ, అది వస్తే MNS సానుల‌కూల‌మే.

పైకి మాత్రం షిండే వ‌ర్గం, మాదే “నిజమైన” శివసేన అని, ఏ పార్టీలోనూ విలీనం కావాల్సిన అవ‌స‌రంలేదని ప్ర‌క‌టిస్తోంది.

ఇది జ‌ర‌గాలంటే పార్టీ నుంచి సభ్యుల మద్దతు పొందాలి. పార్టీయే ఏకంగా షిండే వైపు మొగ్గాలి. ఇది క‌నుక జ‌ర‌గ‌క‌పోతే, ఆఖ‌రి అవకాశం బిజెపి లేదంటే ఎంఎన్ఎస్‌లో విలీనం కావ‌డం.

రాజ్యాంగం పదో షెడ్యూల్‌కు 2003లో చేసిన‌ సవరణను, సాధారణంగా ఫిరాయింపుల నిరోధక చట్టంగా చెబుతారు. దీని ప్ర‌కారం ఒక పార్టీ నుంచి వర్గం అసెంబ్లీలో వేరే వ‌ర్గం కొన‌సాగ‌లేదు. అనర్హత వేటును త‌ప్పించుకోవాలంటే ఆ వ‌ర్గం మ‌రో పార్టీలో విలీనం కావాలి.

మొద‌టి ఆప్ష‌న్
ఏకనాథ్ షిండే ఏం చేయ‌బోతున్నాడు? ఆయ‌న ముందు మూడు అప్ష‌న్లున్నాయి. ఒక‌టి బీజేపీలో చేర‌డం. కాని ఎక్కువ‌మంది తిరుగుబాటుదారుల‌కు ఈ ఆప్ష‌న్ న‌చ్చ‌డంలేదు. బీజేపీలాంటి జాతీయ పార్టీ అధిప‌త్యంలోకి వెళ్తే రాజ‌కీయంగా దెబ్బ‌తింటామ‌న్న భావ‌న గ‌ట్టిగా ఉంది. వాళ్లు విలీనానికి వ్య‌తిరేకం.

రెండో ఆప్షన్
ప్రహార్ జనశక్తి పార్టీ (పీజేపీ)తో కలిసి పోవ‌డం. మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో ఈ పార్టీకి పెద్ద‌గా ప్రాధాన్య‌త లేదు. భవిష్య‌త్తూ లేదు. అసెంబ్లీలో ఈ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీకి అధినేత‌ ఎమ్మెల్యే ఓంప్రకాష్ బాబారావు. ఇప్పటికే షిండేకు మద్దతు ప్ర‌క‌టించాడు. అత‌ని వ‌ర్గంతోనే తిరుగుతున్నాడు. స‌మ‌స్య ఏంటంటే PJP రైతుల హ‌క్కుల కోసం పోరాడే పార్టీ. రాష్ట్రం మొత్తానికి తెలిసిన పేరుకాదు. ఇక మిగిలింది మూడో ఆప్ష‌న్

మూడో ఆప్ష‌న్
MNSలో చేర‌డం. బాల్ థాకరేకి బంధువు, ఆయ‌న శిష్యుడు రాజ్ థాక‌రే పార్టీ కాబ‌ట్టి, హిందుత్వ మూలాలు, శివ‌సేన భావాలు దండిగానే ఉన్నాయి. రాజ్ థాక‌రేని క‌నుక స‌ర్కస్ లో పులిలా ఆటాడించ‌గ‌లిగితే షండేకి పెద్ద అవ‌కాశం, ఎంఎన్ఎస్ లో విలీన‌మే కావ‌చ్చు.

శివ‌సేన తిరుగుబాటు వ‌ర్గం, MNSతో క‌లిస్తే అటు హిందుత్వ వాదాన్ని నిల‌బెట్టుకున్న‌ట్లు ఉంటుంది, ఇటు మరాఠీ గౌర‌వాన్ని కాపాడిన‌ట్లు ఉంటుంది. ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకుంటే, ఈ రెండు ప‌క్షాలు క‌ల‌వడం లాజిక‌ల్ గానే క‌నిపిస్తున్నాయి. రాజ్ థాక‌రేకు మ‌హారాష్ట్ర‌లో ఎలాంటి ప్రాధాన్య‌త‌లేదు. ఇప్పుడు తిరుగుబాటుదారులందరూ ఆయ‌న పార్టీలో విలీన‌మైతే, ఒక్క‌సారిగా రాజ్ థాక‌రే సూప‌ర్ హీరో అయిపోతారు. అప్పుడు ఆయ‌న్ను త‌ట్టుకోవ‌డం అంత‌సులువుకాదన్న‌ది తిరుగుబాటుదారుల్లో అనుమానం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి