iDreamPost

విజయనగరం జడ్పీ చైర్మన్ రిజర్వేషన్ మార్పు ఎవరికోసం?

విజయనగరం జడ్పీ చైర్మన్ రిజర్వేషన్ మార్పు ఎవరికోసం?

విజయనగరం జిల్లాపరిషత్ చైర్మన్ పదవి రిజర్వేషన్ మార్పు జరిగింది. వాస్తవానికి అన్నీజిల్లాల జడ్పి చైర్మన్ పదవులకు రోష్టర్ ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసి జనవరి 3న గెజిట్ విడుదల అయింది. అంటే అది ఫైనల్ అన్నమాట సూర్యుడు పడమర ఉదయించినా గానీ గెజిట్లో వచ్చింది మారదు.. కానీ విజయనగరం లో మాత్రం ఒక వ్యక్తికి పదవి అప్పగించే. నిమిత్తం ఈ మార్పు చేస్తూ మళ్ళీ గెజిట్ విడుదల చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. వాస్తవానికి ముందు విడుదల చేసిన గెజిట్లో విజయనగరం జడ్పి చైర్మన్ పోస్ట్ ఎస్సి మహిళకు, శ్రీకాకుళం పదవి జనరల్ కు కేటాయించారు. అయితే తాజా ఉత్తర్వుల్లో శ్రీకా కుళం పదవి ఎస్సి మహిళలకు,విజయనగరం పదవి జనరల్ కు మారుస్తూ ఉత్తర్వులు వచ్చాయి.

చిన్న శ్రీను కోసమేనా !!

ఈ మార్పు కేవలం సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, జిల్లాలో చక్రం తిప్పే చిన్న శ్రీను కోసమేనని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి విజయనగరం జిల్లాలో బొత్స తరఫున అధికారం చేలాయించేది, పెత్తనం సాగించేది చిన్న శ్రీను మాత్రమే. కాంగ్రెస్ హయాంలో అయితే జిల్లా స్థాయి అధికారులు సైతం చిన్న శ్రీను కనుసన్నల్లోనే ఉండేవాళ్ళు. దాదాపు అన్ని మండలాల్లోనూ చిన్న శ్రీను కు నెట్ వర్క్ ఉంది. 920 గ్రామ పంచాయతీల్లో చిన్న శ్రీనుకు అనుచరగణం ఉంది.

జగన్ దృష్టిలో పడ్డారు!!

జిల్లా మొత్తం పరిచయాలున్న చిన్నశ్రీను జిల్లాలో జరిగిన జగన్ పాదయాత్ర ఘన విజయం అయ్యేందుకు తీవ్రంగా కృషి చేసారు. జిల్లాలో జగన్ యాత్ర ఉన్నన్ని రోజులూ శ్రీను జగన్ వెంట ఉన్నారు. ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తూ భారీగా జనం ఆ యాత్రలో పాల్గొనేలా చేశారు.

యాత్ర అనంతరం

మొన్నటి జనరల్ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన చిన్న శ్రీను వైఎస్సార్ కాంగ్రెస్ కు అఖండ మెజారిటీ తేవడంలో కీలకపాత్ర పోషించారు. విజయనగరం జిల్లా చరిత్రలో 1994 ఎన్నికల్లో మొత్తం సీట్లు టీడీపీ గెలిచింది,అంతకు ముందు ఆ తరువాత టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ జిల్లాను క్లీన్ స్వీప్ చెయ్యలేదు.. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ జిల్లాలోని మొత్తం తొమ్మిదికి తొమ్మిది సీట్లు గెలవటంలో బొత్స వ్యూహ రచనకు తోడు చిన్న శ్రీను కృషి కీలకం. 

వైసీపీ తరుపున విజయనగరం ఎంపీ టికెట్ బొత్స ఝాన్సీ కి కాకుండా 2014 ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ మీద వైసీపీ తరుపున పోటీచేసిన బెల్లాన చంద్రశేఖర్ కు జగన్ కేటాయించినా, వ్యక్తిగతంగా బలమైన అశోక్ గజపతిరాజును ఓడించి చంద్రశేఖర్ విజయానికి కూడా చిన్న శ్రీను కీలకంగా పని చేసారు. వైసిపి తరఫున 2014 లో బొబ్బిలి నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయిన సుజాయ్ కృష్ణ రంగారావు ను ఓడించడానికి కూడా చిన్న శ్రీను అవిశ్రాంతంగా పని చేసి విజయం సాధించారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ అఖండ విజయం సాధించడంలో చిన్న శ్రీను అత్యంత ప్రముఖ పాత్ర పోషించారు..

శృంగవరపు కోట  లో గట్టి పట్టుండి, 1967 నుంచి పాత ఉత్తరాపల్లి , శృంగవరపు కోట  నియోజకవర్గాల నుంచి ఎనిమిది శాసనసభకు ఎన్నికైన కోళ్ల అప్పలనాయుడు కుటుంబానికి చెందిన,శృంగవరపు కోట నుంచి స్వయంగా గత రెండు ఎన్నికల్లో  గెలిచిన కోళ్ల లాలితకుమారిని ఓడించి, అక్కడ వైసిపి అభ్యర్థి కడుబండి శ్రీనివాస్ ను గెలిపించడంలో కూడా చిన్న శ్రీను గట్టిగానే పని చేసారని రాజకీయవర్గాల అభిప్రాయం.

ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకుని ఆయనకు ఎలాగైనా మంచి స్థానం కల్పించాలని భావిస్తున్నట్లు తెలిసింది…ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్ ను మార్చి చిన్న శ్రీనుకు అనుకూలంగా కొత్త ఉత్తర్వులు విడుదల చేయించినట్లు తెలుస్తోంది..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి