iDreamPost

ఒంగోలు కాబోయే మేయర్‌ ఆ మహిళా నేతేనా ..?

ఒంగోలు కాబోయే మేయర్‌ ఆ మహిళా నేతేనా ..?

పెద్ద పల్లెటూరుగా పేరుగాంచిన ఒంగోలు మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారిన తర్వాత తొలి సారి ఎన్నికలు జరగుతున్నాయి. దాదాపు వందేళ్ల పాటు మున్సిపాలిటీగా ఉన్న ఒంగోలు 2012లో నగరపాలక సంస్థగా మారింది. నగరానికి చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీలను విలీనం చేసిన కార్పొరేషన్‌గా మార్చారు. అదే ఒంగోలు కార్పొరేషన్‌కు దాదాపు 9 ఏళ్లపాటు ఎన్నికలు జరగకుండా ఉండేందుకు కారణమైంది. పంచాయతీల విలీనంపై కోర్టు వివాదాలు నెలకొనడంతో 9 ఏళ్లుగా ఒంగోలు నరగపాలక సంస్థ ప్రత్యేక అధికారుల పాలనలోనే సాగింది. ఎట్టకేలకు కోర్టు వివాదాలు సమసిపోవడంతో తొలిసారి ఒంగోలు ప్రజలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు.

ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉన్నాయి. మేయర్‌ స్థానాన్ని ఎస్సీ మహిళకు రిజర్వ్‌ అయింది. ఒక డివిజన్‌ ఏకగ్రీవంగా కాగా మిగతా 49 డివిజన్లలో పోటీ నెలకొంది. అధికార పార్టీ వైసీపీతోపాటు టీడీపీ, జనసేన, సీపీఎం, సీపీఐలు తమకు బలం ఉన్న చోట బరిలో నిలుస్తున్నాయి. రాజకీయ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాదాపు 20 డివిజన్లలో బహుముఖ పోరు నెలకొంది. గెలుపుపై అధికార వైసీపీ ధీమాగా ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా సత్తా చాటాలని ప్రత్నిస్తోంది. వైసీపీ తరఫున మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ తరపు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు.

టీడీపీ మేయర్‌ అభ్యర్థి ఎవరన్నది ఇంకా స్పష్టత రాలేదు. అధికార పార్టీ మాత్రం ఈ విషయంలో ముందుంది. గత ఏడాది మార్చిలో మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే మేయర్‌ అభ్యర్థిని ప్రకటించింది. వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాడ సుజాతను మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించారు. గంగాడ సుజాత వైసీపీ ఆవిర్భాం నుంచి వైఎస్‌ జగన్‌ వెంట నడిచారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన గంగాడ సుజాతకు రాజకీయాలపై మక్కువ ఎక్కువ. ఈ కారణంతోనే ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2009లో పీఆర్‌పీ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఎస్సీ రిజర్డ్వ్‌ అయిన కొండపి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 9,196 ఓట్లు సాధించిన సుజాత.. మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2011లో వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలుకు పక్కనే ఉన్న కొండపి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవి కోసం పోటీ చేసి పరాజయం పాలైన సుజాత.. ఈ సారి ఒంగోలు కార్పొరేషన్‌ మేయర్‌ పీఠంపై కూర్చోవాలని ఆశిస్తున్నారు. 18వ డివిజన్‌ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు.

కార్పొరేషన్‌లోని 50 డివిజన్లకు గాను 49 డివిజన్లలో పోటీ అనివార్యమైనా.. గెలుపుపై అధికార పార్టీ ధీమాగా ఉంది. బాలినేని నాయకత్వం, ఒంగోలు పురపోరులో గత చరిత్ర, వైఎస్‌ జగన్‌ పరిపాలన, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. మున్సిపల్‌ ఎన్నికల కోసం వైసీపీ విడుదల చేసిన నాలుగు పేజీ కరపత్రంతో డివిజన్లలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అటు టీడీపీ కూడా తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒంగోలులో పర్యటించేందుకు సిద్దమయ్యారు. జనసేన, సీపీఎం, సీపీఐలు ఉనికి చాటుకోవాలని భావిస్తున్నాయి. ఈ నెల 10వ తేదీన పోలింగ్‌ జరగబోతోంది. 14వ తేదీన జరిగే కౌంటింగ్‌లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి