iDreamPost

ఎవ‌రు నేర‌స్తులు?

ఎవ‌రు నేర‌స్తులు?

ప్ర‌ముఖ క‌వి, మిత్రుడు మోహ‌న్‌రుషి ఒక వాట్స‌ప్ క‌థ పంపాడు.

1935 ఆర్థిక మాంద్యం రోజు. న్యూయార్క్‌లో ఒక ముస‌ల‌మ్మ బ్రెడ్ దొంగ‌త‌నం చేసింది. కేసు కోర్టుకెళ్లింది.

“దొంగిలించావా?” అని అడిగాడు జ‌డ్జి.
“నా మ‌నుమ‌రాలు ఆక‌లికి ఏడుస్తూ ఉంటే చేశాను” అని సిగ్గుతో, దిగులుగా, దుక్కంతో చెప్పింది.
“ప‌ది డాల‌ర్లు జ‌రిమానా. లేదంటే నెల‌రోజులు జైలు”
“ప‌ది డాల‌ర్లే ఉంటే దొంగ‌త‌నం చేస్తానా? నెల రోజులు జైలుకి వెళితే నా మ‌నుమ‌రాలు ఆక‌లికి చ‌చ్చిపోతుంది”
జ‌డ్జి మౌనంగా త‌న జేబులోని ప‌ది డాల‌ర్లు తీసి ముస‌ల‌మ్మ త‌ర‌పున క‌ట్టేశాడు. కోర్టు రూంలో ఉన్న‌వాళ్లంద‌రికీ 40 సెంట్లు ఫైన్ వేసి , ఆ డ‌బ్బుని ముస‌ల‌మ్మ‌కి ఇచ్చాడు.
“ఆక‌లికి త‌ట్టుకోలేక ఎవ‌రైనా దొంగ‌త‌నం చేస్తే, ఆ నేరం మ‌నంద‌రిదీ కూడా” అని చెప్పాడు జ‌డ్జి.

ల‌క్ష‌ల మంది న‌డిరోడ్డు మీద ఎండ‌ల‌కి న‌డుస్తూ వెళ్లారు. ఎండిపోయిన చెట్ల స‌మూహంలా క‌నిపించారు వాళ్లు. డ‌బ్బుల్లేవు, తిండికి గ్యారెంటీ లేదు. భుజానికి బ్యాగులు. చంక‌లో పిల్ల‌లు. వాహ‌నాలు లేవ‌ని తెలుసు. ఆదుకునే వాళ్లు లేర‌ని తెలుసు. తెలిసింద‌ల్లా ఒక‌టే న‌డ‌వ‌డానికి కాళ్లున్నాయి. ఎదురుగా దారి ఉంది.

స్వాతంత్ర్యం వ‌చ్చినా 73 ఏళ్ల త‌ర్వాత దేశ ప్ర‌జ‌లు త‌మ కాళ్ల మీద తాము న‌డుస్తున్నారు. కాక‌పోతే ఆ పాదాలు బొబ్బ‌లెక్కి ఉన్నాయి. ప‌గిలిపోయి ఉన్నాయి. గ‌మ్యాన్ని చేరుస్తాయో లేదో తెలియ‌దు.

నిజానికి వంద‌ల కిలోమీట‌ర్లు న‌డిచి వెళ్లినా , ఆ ఊళ్ల‌లో ఏమీ లేదు. ఉంటే ఇంత దూరం బ‌త‌క‌డానికి ఎందుకొస్తారు? ఎందుకు వెళ్ల‌డం?
అనాథ‌ల్లా బ‌త‌కొచ్చు. అనాథ‌ల్లా చ‌నిపోకూడ‌దు. సొంత ఊళ్ల‌లో చ‌నిపోతే మ‌ర‌ణమైనా గౌర‌వంగా ఉంటుంది. జీవిక‌లో గౌర‌వం లేన‌ప్పుడు చావులోనైనా గౌర‌వం వెతుక్కుంటున్నారు. లాక్‌డౌన్ మ‌ర‌ణాన్ని ఆపిందో లేదో తెలియ‌దు కానీ, చాలా మంది జీవితాల్ని చంపేసింది. స‌మాధుల్ని దున్ని బ‌తుకు గింజ‌లు పండించుకోవాలి.

ఈ యాత్ర‌లో నేర‌స్తులు ఎవ‌రు? శిక్ష ఎవ‌రికి?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి