iDreamPost

Home Loan Vs Rent: హోం లోన్, అద్దె ఇల్లు-రెండింటిలో ఏది మేలు?

Home Loan Vs Rent: హోం లోన్, అద్దె ఇల్లు-రెండింటిలో ఏది మేలు?

మీకు మంచి శాలరీ వస్తోంది. లైఫ్ లో సెటిల్ అయ్యారు. ఇక ఇల్లు కొనడమే తరువాయి. ఇంకేముంది హోం లోన్ కి అప్లై చేసెయ్ అని చుట్టుపక్కల వాళ్ళు సలహాలు ఇచ్చేస్తుంటారు. కానీ ఇల్లు కొనడం మంచిదా లేక అద్దె ఇల్లే మేలా అనే విషయమై బాగా ఆలోచించాకే ఒక నిర్ణయం తీసుకోండి. సొంతిల్లు కొనడమే ఉత్తమం కదా, ఇందులో ఆలోచించడానికేముంది అనేగా మీ డౌటు. ఆలోచించాల్సింది చాలానే ఉంది. ఈ రెంటిలో ఇదే బెస్ట్ అని కచ్చితంగా చెప్పలేకపోయినా సరైన నిర్ణయం తీసుకోవడానికి ఎన్నో ఆర్థికపరమైన, వ్యక్తిగతమైన అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అవేంటో ఓసారి చూద్దాం.
ఆర్థిక క్రమశిక్షణ (Financial Planning & Discipline)
• ముందుగా మీ ఆర్థిక పరిస్థితిని ఆకళింపు చేసుకోవాలి. మీరు కూడబెట్టిన డబ్బుతో ఇల్లు కొనడం ఒక మార్గమైతే హోమ్ లోన్ ద్వారా డబ్బు సర్దుబాటు చేసుకోవడం మరో మార్గం. ఎంతగా డబ్బు కూడబెట్టినా హోమ్ లోన్ ద్వారా 40-50 శాతం వరకు అదనపు వనరులు సమకూర్చుకోవాల్సి వస్తుంది.
• హోమ్ లోన్ తీర్చడానికి సరైన ఆదాయ వనరు ఉందో లేదో చూసుకోవాలి. నెలసరి వాయిదాలు మీ జీతంలో ఎక్కువ భాగాన్ని మింగేస్తాయేమో లెక్కేసుకోండి. అదే నిజమైతే రెంటు ఇంట్లో ఉంటూనే క్రెడిట్ స్కోరు పెంచుకునే ప్రయత్నాలు చేయండి. అలాగే పొదుపు మార్గాలపైనా ఫోకస్ చేయండి.
• హోమ్ లోన్ తీసుకోవడం వల్ల మీ పిల్లల చదువు లాంటి మిగతా లక్ష్యాలపై ప్రభావం పడుతుందేమో చూసుకోండి. దానికి వేరే ఆదాయ వనరు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి.
• చాలా మంది ఇల్లు కొనడాన్ని ఇన్వెస్ట్ మెంట్ గా భావిస్తారు. కానీ మీరు వేరే మార్గాల్లో మదుపు చేస్తుంటే కనక హోమ్ లోన్ కి వెళ్ళకపోవడమే మంచిది. ఖరీదైన EMIలు కట్టే కంటే ఆ డబ్బును మెరుగైన రిటర్న్స్ వచ్చే మరో చోట పెట్టడమే తెలివైన పనవుతుంది. అయితే హోం లోన్ తో తీసుకున్న ఇంటిని భవిష్యత్తులో మంచి రేటుకు అమ్మగలమన్న నమ్మకముంటే రిస్క్ చేయవచ్చేమో!
జీవితం స్థిరపడుతుంది
• అద్దె ఇంట్లో ఉంటే తరచుగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మారాల్సి వస్తుంది. అదే సొంత ఇల్లు అయితే ఒకే చోట స్థిరంగా ఉండొచ్చు.
• ప్రతి ఏడూ రెంటు పెరుగుతూ పోవడం వల్ల ఇల్లు కొనుక్కునే ఖర్చు కంటే అద్దింట్లో ఉండడమే మరింత ఖరీదుగా మారే ప్రమాదముంది. హోమ్ లోన్ తీసుకుంటే EMIలు రెంటు కంటే ఎక్కువే ఉండొచ్చు. కానీ ప్రతి ఏడూ పెరిగే ప్రమాదమైతే ఉండదు.
• ఒక ప్రాంతంలో మీరు ఎంతకాలం పాటు ఉంటారన్నది కూడా ఆలోచించుకోవాలి. ఎక్కువ కాలం ఒకే చోట ఉంటే ఇల్లు కొనుక్కోవడమే నయం. అలా కాకుండా కొంత కాలమే ఉంటున్నప్పుడు ఇల్లు రెంటుకి తీసుకోవచ్చు.
మార్కెటింగ్ డైనమిక్స్
• ఇల్లు కొనేటప్పుడు వ్యక్తిగత అంశాలతో పాటు మార్కెట్, ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే పరిస్థితులను కూడా అంచనా వేసుకోవాలి.
• హోమ్ లోన్ తీసుకునే ముందు హౌజింగ్ మార్కెటింగ్ డైనమిక్స్ (housing marketing dynamics) గురించి తెలుసుకోవాలి. హౌజింగ్ మార్కెట్ అనేది ప్రాంతాలను బట్టి మారుతుంటుంది. ఉదాహరణకు ఢిల్లీలో ఒక ఇంటిని సొంతం చేసుకోవాలంటే కనీసం 65 నెలలు పడుతుంది. అదే పూణె, చెన్నై లాంటి చోట్ల అయితే 30 నెలలు పడుతుంది.
• హోమ్ లోన్ తీసుకునేటప్పుడు పరిగణించాల్సిన మరో ప్రధాన అంశం వడ్డీ రేటు. ఇంట్రెస్ట్ పెరిగితే హోమ్ లోన్ భారమైపోయి ఇల్లు కొనడమే ఖరీదైన వ్యవహారమైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు అద్దెకు తీసుకోవడమే ఉత్తమం.
మధ్య తరగతి వారికి సొంత ఇల్లు అనేది ఒక కల, ఒక భరోసా, జీవితాశయం కూడా. హోమ్ లోనా రెంటిల్లా అనే విషయం నిర్ణయించుకునే ముందు మీకు ఇలాంటి కలలు, ఆశయాలు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. అప్పటికీ డైలమా తీరకపోతే నిపుణుల సలహా తీసుకోండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి