iDreamPost

Padma Awards: ‘పద్మశ్రీ’ షావుకారు జానకి – మరి మిగిలినవాళ్లకు ఎప్పుడో

Padma Awards: ‘పద్మశ్రీ’ షావుకారు జానకి – మరి మిగిలినవాళ్లకు ఎప్పుడో

నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో టాలీవుడ్ నుంచి ఒక్క షావుకారు జానకి గారు మాత్రమే ఎంపిక కావడం సినిమా వర్గాలను ఒకింత నిరాశకు గురి చేసింది. ఆవిడకైనా చాలా ఆలస్యంగా 90 ఏళ్ళ వయసులో ఇచ్చారు. సరే కనీసం ప్రధానం చేశారు కదా అని సంతోషించాలి తప్పదు. అయితే అర్హత ఉండి సినిమా స్థాయిని ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్లిన మహానుభావులు ఎందరికో ఇంకా పద్మ గుర్తింపు రాకపోవడం నిజంగా శోచనీయం. ఒకప్పుడు దీనికి రాజకీయాలు కారణంగా మారితే ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దల నిర్లిప్తత, డిమాండ్ చేసే తెగువ లేకపోవడం లాంటి అంశాలు కనిపిస్తాయి. కనీసం ఫలానా వాళ్లకు ఎందుకివ్వలేదన్న ప్రశ్న కూడా లేదు.

నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారికి ఇప్పటిదాకా పద్మశ్రీ దక్కపోవడం విస్మయం కలిగించే విషయం. తొమ్మిది వందల చిత్రాలకు పైగా విలక్షణ పాత్రలు ఎన్నో ధరించి అలనాటి ఎన్టీఆర్ తో మొదలుపెట్టి ఇప్పటి మహేష్ బాబు దాకా ఎందరితోనో అత్యద్భుతమైన ఆణిముత్యాల్లో భాగం పంచుకున్న ఈ నట దిగ్గజానికి ఎప్పుడో ఇవ్వాల్సింది కానీ జరగలేదు. నటభూషణ శోభన్ బాబు సైతం కేంద్ర పెద్దల కంటికి కనిపించలేదు. దివంగతులైన వాళ్ళు, బ్రతికున్న వాళ్ళు ఇలా ఎందరో అన్నీ ఉండి ఈ ఒక్క పురస్కారానికి నోచుకోని వాళ్ళు ఉన్నారు. కానీ ఏ గళం ఇది అన్యాయం కదాని ప్రశ్నించిన దాఖలాలు లేవు.

సమయం సందర్భం రాలేదని ఒకవేళ పెద్దలు చెప్పుకుంటే అది ఎంత మాత్రం క్షమార్హం కాదు. మనిషి ఉన్నప్పుడే ఇలాంటి అవార్డులు ఇస్తే వాళ్లకు, అభిమానులకు కలిగే ఆనందం మాటల్లో చెప్పేది కాదు. ,కాలం చేసి దశాబ్దాలు దాటుతున్నా ఎన్టీఆర్ కు సైతం పద్మభూషణ్ ఇవ్వకపోవడంతో ఈ వివక్ష తప్పలేదని ఆవేదన చెందే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు. నటులే కాదు సంగీత దర్శకులు, నటీమణులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు ఇలా అన్ని విభాగాల్లోనూ ఎనలేని సేవలు అందించిన వాళ్ళు కోకొల్లలు. మరి ఈ చిన్న చూపు తగ్గేదెన్నడో. మోహన్ బాబు, చిరంజీవి, కృష్ణ, గుమ్మడి, అల్లు రామలింగయ్యలకు దక్కినప్పటికీ ఇంకా ఎందరో తెలుగు సినీ మార్గనిర్దేశకులు పద్మం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అవి దక్కితేనే వాళ్ళ ప్రతిభకు కొలమానం కాదు కానీ కనీస గౌరవం కదా

Also Read : Bro Daddy Report : బ్రో డాడీ రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి