iDreamPost

వాట్సప్ నుంచి మరో పెద్ద అప్‌డేట్.. ఇక గ్రూప్స్ అన్నీ ఒకే చోటికి మార్చేయొచ్చు..

వాట్సప్ నుంచి మరో పెద్ద అప్‌డేట్.. ఇక గ్రూప్స్ అన్నీ ఒకే చోటికి మార్చేయొచ్చు..

WhatsApp Big Update | వాట్సప్ నుంచి మరో పెద్ద అప్‌డేట్ వచ్చేసింది. వాట్సప్ కమ్యూనిటీస్ (WhatsApp Communities) ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది. ఇక గ్రూప్స్ అన్నీ ఒకే చోటికి మార్చేయొచ్చు.

వాట్సప్ నుంచి కమ్యూనిటీస్ (WhatsApp Communities) ఫీచర్ వచ్చేసింది. వాట్సప్యూజర్లు ఎప్పటి నుంచో ఈ ఫీచర్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కమ్యూనిటీస్ లాంఛ్ చేస్తున్నట్టు వాట్సప్ మాతృసంస్థ అయిన మెటా(Meta) ప్రకటించింది. దీంతో పాటు ఇన్ ఛాట్ పోల్స్, 32 పర్సన్ వీడియో కాలింగ్, 1024 యూజర్లతో గ్రూప్స్… ఇలా మరిన్ని ఫీచర్స్‌ని కూడా రిలీజ్ చేసింది వాట్సప్. వీటితో పాటు ఎమోజి రియాక్షన్స్, పెద్ద ఫైళ్ల షేరింగ్, అడ్మిన్ డిలిట్ కంట్రోల్ లాంటి ఫీచర్స్‌ని ఏ గ్రూప్‌లో అయినా ఉపయోగించుకోవచ్చు. కమ్యూనిటీస్‌కి కూడా ఈ ఫీచర్స్ ఉపయోగకరంగా ఉంటాయంటోంది వాట్సప్.

WhatsApp spotted developing a new Community feature: Details here

వాట్సప్ కమ్యూనిటీస్ ఫీచర్ ఈరోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు అందరికీ రోల్ అవుట్ చేస్తామని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. కొన్ని నెలల్లో యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. వాట్సాప్ అందిస్తున్న అతిపెద్ద అప్‌డేట్స్‌లో కమ్యూనిటీస్ ఫీచర్ ఒకటి. యూజర్లు వేర్వేరు గ్రూప్స్‌ని వాట్సప్‌లో ఒకేచోట కనెక్ట్ అవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. కాలనీవాసులు, స్కూల్స్‌లో పేరెంట్స్, ఉద్యోగులకు ఉండే వేర్వేరు గ్రూప్స్‌ని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు కమ్యూనిటీస్ ఫీచర్ ఉపయోగపడుతుంది.

వాట్సప్ కమ్యూనిటీస్ ఇలా పనిచేస్తుంది..

ఉదాహరణకు ఓ కాలేజీలో విద్యార్థులకు ఒక వాట్సప్ గ్రూప్, అధ్యాపకులకు ఒక వాట్సప్ గ్రూప్, విద్యార్థులు, అధ్యాపకులతో మరో వాట్సప్ గ్రూప్, అడ్మిన్ స్టాఫ్‌కు ఇంకో వాట్సప్ గ్రూప్ ఉన్నాయనుకుందాం. అయితే ఆ కళాశాలకు సంబంధించి ఏదైనా ముఖ్యమైన సమాచారం అందరికీ షేర్ చేయాలనుకుంటే, ఆ మెసేజ్‌ను అన్ని గ్రూప్స్‌లోకి వేర్వేరుగా పంపాల్సి ఉంటుంది. కమ్యూనిటీస్ ఫీచర్‌తో కళాశాలకు సంబంధించి ఉన్న వాట్సప్ గ్రూప్స్ అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావొచ్చు. అప్పుడు కమ్యూనిటీస్‌లో ఒక మెసేజ్ చేస్తే చాలు. ఆ గ్రూప్‌లో ఉన్నవారందరికీ ఆ మెసేజ్ వెళ్తుంది.

WhatsApp confirms some users have access to its new group discussions feature, WhatsApp Communities | TechCrunch

ఇలా కాలనీలో ఉన్న వేర్వేరు గ్రూప్స్‌ని, ఆఫీసులో ఉన్న వేర్వేరు వాట్సప్ గ్రూప్స్‌ని కమ్యూనిటీస్‌ ఫీచర్ ద్వారా ఒకే సెక్షన్‌లోకి తీసుకురావొచ్చు. కమ్యూనిటీస్‌లో ఓ 10 గ్రూప్స్‌ని చేర్చారనుకుందాం. అందులో ఒక గ్రూప్ సభ్యులకు మాత్రమే ఏదైనా మెసేజ్ చేయాలంటే ఆ ఒక్క గ్రూప్ సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అడ్మిన్స్ మాత్రమే కమ్యూనిటీస్ క్రియేట్ చేయొచ్చు. మేనేజ్ చేయొచ్చు. కొత్త గ్రూప్‌లను ఏర్పాటు చేయడం ద్వారా లేదా ముందుగా ఉన్న గ్రూపులను లింక్ చేయడం ద్వారా అడ్మిన్‌లు తమ కమ్యూనిటీలో భాగమయ్యే గ్రూప్స్‌ని సెలెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఒక గ్రూప్‌లో కొత్త మెంబర్‌ను ఎవరు యాడ్ చేయాలని అడ్మిన్ నిర్ణయించినట్టుగా, కమ్యూనిటీస్ ఫీచర్‌కి కూడా ఇవే సెట్టింగ్స్ ఉంటాయి.

WhatsApp to introduce Communities feature for organising groups. Full details - Hindustan Times

వాట్సప్ కమ్యూనిటీస్‌తో పాటు మరిన్ని ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. వాట్సప్ యూజర్లు ఛాట్‌లో పోల్స్ క్రియేట్ చేయొచ్చు. 32 మంది ఒకేసారి వీడియో కాల్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక వాట్సప్ గ్రూప్‌లో ఏకంగా 1024 మంది సభ్యుల్ని చేర్చొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి