iDreamPost

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు- ఏపీ రాజకీయాలపై ప్రభావం

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు- ఏపీ రాజకీయాలపై ప్రభావం

అంతా ఆసక్తిగా చూసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల పలితాలు వచ్చేశాయి. బీజేపీ తిరుగులేని విజయాలు దక్కించుకుంది. యూపీలో గెలుపు ఆపార్టీ ప్రస్థానంలో మరోసారి కీలక మలుపు కాబోతోందనడంలో సందేహం లేదు. ఉత్తరాఖండ్, మణిపూర్ నిలుపుకోవడం, గోవాలో పీఠం ఎక్కేందుకు చేరువ కావడంతో కమలం శ్రేణులను ఖుషీ చేసింది. అదే సమయంలో పంజాబ్ లో ఆప్ తుడిచిపెట్టేయడం కూడా బీజేపీకి ఆనందాన్నిచ్చింది. కాంగ్రెస్ ముక్తి భారత్ నినాదానికి మరింత చేరువ కాబోతున్నామనే సంతోషాన్ని మిగిల్చింది. దాంతో బీజేపీ క్యాడర్ లో తాజా ఫలితాలు రెట్టించిన ఉత్సాహాన్నిస్తాయనడంలో సందేహం లేదు.

ఈ ఎన్నికల ఫలితాలు ఏపీ మీద ప్రభావం చూపుతాయని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. ఇప్పటికే సుజనా చౌదరి వంటి నాయకులు అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సోము వీర్రాజు వంటి వారు తమకిక తిరుగులేదని, తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకున్నారు. ఇప్పటికే జనసేనతో కలిసి ఉన్న ఆపార్టీకి ఏపీలో కూడా తాజా ఫలితాలు ఊరటిస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జనసేన తమను వీడి టీడీపీ వైపు వెళుతుందనే అనుమానం బీజేపీలో తొలగిపోతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఏపీలో కూడా ప్రత్యామ్నాయంగా తామే నిలుస్తామని భావిస్తున్న బీజేపీ దానికి అనుగుణంగా జనసేనని కాపాడుకుంటూ మూడో కూటమిగా రంగంలో దిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

అదే సమయంలో యూపీలో బీజేపీ ఓడితే ఆపార్టీ మళ్లీ తమతో స్నేహానికి సిద్ధమవుతుందని చంద్రబాబు ఆశించారు.. మరోసారి 2014 నాటి కూటమికి ఆయన పగటి కలలు కన్నారు. కానీ ప్రస్తుతం బీజేపీకి దక్కిన విజయాలు తర్వాతే టీడీపీని తోసిపుచ్చి తామే ఎదగాలనే తాపత్రయం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తద్వారా టీడీపీతో కలిసి కూటమి కట్టడం కన్నా జనసేనతో కలిసి బరిలో దిగడం ద్వారా ఏదో మేరకు ప్రభావితం చేయడమే కాకుండా, టీడీపీని ఒంటరి చేసే అవకాశం కోసం కూడా బీజేపీ ఎదురుచూడడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే బీజేపీ తమతో చేతులు కలపకపోగా, జనసేనను కూడా దూరం చేస్తుందనే భయం టీడీపీలో మొదలయ్యింది. తద్వారా మరోసారి టీడీపీ ఒంటరిగా మారే ప్రమాదం దాపురించేందుకు తాజా ఫలితాలు దోహదం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరోవైపు వైసీపీ కూడా ఈ ఫలితాలను ఆచితూచి అంచనా వేస్తోంది.ఈ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదనే అంచనాలు కేసీఆర్ వంటి సాటి సీఎంలలో వ్యక్తమయినా జగన్ మాత్రం మౌనంగా ఎదురుచూశారు. దేశంలో పలువురు సీఎంలు మోదీ ప్రత్యామ్నాయ కూటమి దిశలో అడుగులు వేసినా జగన్ అందరికీ సమదూరం పాటించారు. ఈ తరుణంలో బీజేపీకి ఓటమి ఎదురయితే తద్వారా ఏపీ ప్రయోజనాలకు కొంత సానుకూలత దక్కుతుందని కొందరు ఆశించారు. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఇతర పార్టీల అవసరం పెరిగితే తద్వారా ఏపీకి సంబంధించిన పలు డిమాండ్ల మీద కేంద్ర స్పందించాల్సిన స్థితి వచ్చేదని భావించారు. కానీ తీరా ఉత్తరాదిన బీజేపీ విజయం వైసీపీ నాయకులు కొందరు ఆశించినట్టుగా లేకపోవడం వారిని కూడా నిరాశపరుస్తుందనే చెప్పవచ్చు.

ఏపీలో బీజేపీ ఎదుగుదలకు టీడీపీ అడ్డంకి అనే అంచనాలు చాలామందిలో ఉండడంతో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ఎంచుకునే వ్యూహాల మీద ఈ ఫలితాల ప్రభావం ఉంటుందని చెప్పవచ్చు. తెలంగాణాలో ఒంటరిగా బలపడుతున్న సమయంలో ఏపీలో సైతం అలాంటి యత్నాలకు సిద్ధమయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఏపీ రాజకీయాల్లో పలుమార్పులకు దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు. మొత్తంగా యూపీ వంటి రాష్ట్రాల్లో బీజేపీ జెండా మళ్లీ ఎగురవేసిన తరుణంలో ఏపీలో చంద్రబాబు వంటి వారి ఆశలు నీరుగారిపోయే అవకాశాలు బలంగా ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి