iDreamPost

జ‌న‌సేనాని అంతిమ ల‌క్ష్యం అదేనా

జ‌న‌సేనాని అంతిమ ల‌క్ష్యం అదేనా

ప‌ద‌వుల కోసం కాదు..ప్ర‌శ్నించ‌డం కోస‌మే పార్టీ అన్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలో పాల‌క‌ప‌క్షం పంచ‌న చేరిపోయారు. పాతికేళ్ల భ‌విష్య‌త్ కోస‌మే పార్టీ పెట్టిన‌ట్టు ప్ర‌క‌టించారు..కానీ ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో పూర్తిగా ఆరు నెల‌లు నిండ‌కుండానే పొత్తులు పెట్టుకున్నారు. ప్ర‌జాసేవ కోసం సినిమాల‌ను సైతం వ‌దులుకున్న‌ట్టు చెప్పుకున్నారు..కానీ ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో సాగిపోతున్నారు. ఇలా చెప్పిన మాట‌ల‌కు, చేస్తున్న ప‌నుల‌కు పొంత‌న లేకుండా ఒక‌నాటి త‌న మిత్రుడు చంద్ర‌బాబుని త‌ల‌పిస్తున్నార‌నే అబిప్రాయం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద కూడా పెరుగుతోంది. స‌న్నిహితులు సైతం అదే భావిస్తున్నారు. చివ‌ర‌కు ఆయ‌న వెంట న‌డ‌వ‌డానికి అన్నీ వ‌దులుకుని వ‌చ్చిన వారు కూడా ఒక్కొక్క‌రుగా జారిపోతున్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ పార్టీ ప్రారంభించిన త‌ర్వాత ప‌లు విలువ‌ల గురించి ప్ర‌స్తావించారు. ముఖ్యంగా ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారిని జ‌న‌సేన‌లో చేర్చుకోబోమ‌ని, వారికి అవ‌కాశం ఇవ్వ‌బోమ‌ని ప్ర‌క‌టించారు. కానీ మొన్న‌టి ఎన్నిక‌ల్లో 43 శాతం టికెట్లు జంపింగుల‌కు క‌ట్ట‌బెట్టారు. కులాల ప్ర‌స‌క్తే ఉండ‌ద‌ని ఆయ‌న పార్టీ మౌలిక సూత్రాల్లో రాసుకున్నారు. కానీ శ్రీకాకుళం నుంచి విజ‌య‌వాడ వ‌ర‌కూ ఎంపీ టికెట్ల‌ను ప‌రిశీలిస్తే రిజ‌ర్వుడు స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలు త‌ప్ప మిగిలిన అన్ని సీట్లు కాపుల‌నే నిల‌బెట్టారు. స్వ‌యంగా పార్టీ అధినేత కూడా కాపులు అధిక సంఖ్య‌లో ఉండే రెండు స్థానాల‌ను ఎంపిక చేసుకున్నారు. ఇలా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరు సాగుతున్న దశ‌లో చివ‌ర‌కు పార్టీ కొన‌సాగించాల‌నే ఆలోచ‌న‌లో లేద‌నే అభిప్రాయం చాలామందిలో క‌లిగించారు. ముఖ్యంగా సినిమాల విష‌యంలోనూ, బీజేపీతో బంధం విష‌యంలో ఎంతో ఆతృత ప్ర‌ద‌ర్శించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షంలో ప్ర‌ధాన పాత్ర పోషించే అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు.

బీజేపీలో జ‌న‌సేన‌ను విలీనం చేయాల‌ని అమిత్ షా స్వ‌యంగా త‌న‌ను కోరిన‌ట్టు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌లుమార్లు చెప్పుకున్నారు. అయినా తాను దానికి నిరాక‌రించి పార్టీని న‌డుపుతున్న‌ట్టు వెల్ల‌డించారు. కానీ అంతిమంగా ఇప్పుడు ఆయ‌న అమిత్ షా అవ‌కాశం ఇవ్వ‌క‌పోయినా న‌డ్డాతో చేతులు క‌లిపి, సునీల్ దేవ‌ధ‌ర్ తో చ‌ర్చ‌లు జ‌రిపి పార్టీని క‌మ‌లం గూటికి చేర్చేశారు. ఒక‌సారి పార్టీ విలీనం చేస్తే వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను గ‌మ‌నంలో ఉంచుకుని ఆయ‌న ఆచితూచి అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం క‌లిగించారు. గ‌తంలో ప్ర‌జారాజ్యం అనుభ‌వాల‌తో తొలుత పొత్తు, ఆ త‌ర్వాతే విలీనం దిశ‌గా అన్న‌ట్టుగా సాగుతున్న‌ట్టు సంకేతాలు ఇస్తున్నారు. ఒకేసారి విలీనం చేస్తే అభిమానుల నుంచి ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని జాగ్ర‌త్తలు పాటిస్తున్న‌ట్టు క‌నిపిస్తున్నారు. అంతిమంగా జ‌న‌సేన‌ను బీజేపీలో విలీనం చేసే దిశ‌లో అడుగులు వేస్తున్న‌ట్టు అంతా భావించాల్సి వ‌స్తోంది.

వాస్త‌వానికి ఏ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా ఉమ్మ‌డిగా రాష్ట్ర‌స్థాయిలో స‌మన్వ‌యం కోసం ప్ర‌య‌త్నిస్తారు గానీ కింది వ‌ర‌కూ ఉమ్మ‌డి క‌మిటీలు వేయాల‌నే ఆలోచ‌న ఉండ‌దు. కానీ ఇప్పుడు బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య అందుకు భిన్నంగా ఉమ్మ‌డి క‌మిటీల కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. అంతేగాకుండా పొత్తు పెట్టుకున్న‌ప్ప‌టికీ త‌న విధానాల‌కు విరుద్ధంగా మిత్ర‌ప‌క్షం చేస్తున్న అన్నింటినీ స‌మ‌ర్థించ‌డానికి సిద్ధ‌ప‌డ‌రు. ముఖ్యంగా త‌న వ‌ర్గం ఓట్ల‌ను కాపాడుకునేందుకు కొన్ని జాగ్ర‌త్తలు పాటిస్తారు. కానీ ప‌వ‌న్ మాత్రం త‌ద్విరుద్ధంగా బీజేపీ సిద్ధాంతాల‌ను వంట‌బ‌ట్టించుకున్న నేత‌గా మాట్లాడుతున్నారు. ప్ర‌స్తుతం దేశ‌మంతా చ‌ర్చ జ‌రుగుతున్న సీఏఏ, ఎన్నార్సీ విష‌యంలో ప‌వ‌న్ కామెంట్స్ దానికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి. ఇలాంటివ‌న్నీ గ‌మ‌నిస్తున్న ప‌రిశీల‌కులు అంతిమంగా ప‌వ‌న్ ప‌వ‌న్ విలీనం చేయాల‌నే ల‌క్ష్యంతో ఉన్న‌ట్టుగా అంచ‌నాలు వేస్తున్నారు. ఏపీలో బ‌ల‌ప‌డేందుకు అటు టీడీపీని ఇటు జ‌న‌సేన‌ను త‌న పార్టీలో విలీనం చేసుకోవాల‌నే ల‌క్ష్యంతో అడుగులు వేస్తున్న బీజేపీకి ప‌వ‌న్ కార‌ణంగా ఒక ప‌ని పూర్త‌వుతున్న‌ట్టేన‌ని లెక్క‌లు వేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి