iDreamPost

అసెంబ్లీకి హాజరు కాకుండా టీడీపీ నష్టపోయిందేమిటి?

అసెంబ్లీకి హాజరు కాకుండా టీడీపీ నష్టపోయిందేమిటి?

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఒక పథకం ప్రకారం రచ్చచేసి సభ నుంచి కావాలనే సస్పెండ్‌ అయిన టీడీపీ సభ్యులు రాజకీయంగా నష్టపోయారని పరిశీలకులు భావిస్తున్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టనని చంద్రబాబు శపథంచేసిన నేపథ్యంలో అసలు సభకు వెళ్లాలా? వద్దా? అని తర్జనభర్జనలు పడ్డ టీడీపీ సభ్యులు ఎట్టకేలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే తమ వ్యూహాత్మక తప్పిదాలతో జనందృష్టిలో బాగా పలుచన అయ్యారు.ఒక ప్రధాన ప్రతిపక్షంగా జనంగొంతును వినిపించడంలో తెలుగుదేశం పార్టీ విఫలం అయింది అన్న అప్రఖ్యాతిని మూటగట్టుకుంది. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన అసెంబ్లీ, మండలి సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. అనేక అంశాలపై చర్చ చేసి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోగా, ప్రతిపక్ష టీడీపీ కేవలం ఉభయసభల్లోనూ అల్లరి చేయడానికే ప్రాధాన్యం ఇచ్చింది కాని తాను పట్టుబట్టిన అంశాలపై కూడా చర్చలో పాల్గొనలేదు.

చక్కటి అవకాశం దుర్వినియోగం

ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడానికి, ఎండగట్టడానికి అసెంబ్లీకి మించిన వేదిక ప్రతిపక్షాలకు ఉండదు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తమ సమస్యల పరిష్కారానికి చట్టసభల్లో సరిగా పనిచేస్తున్నారా? లేదా? అన్నది జనం నిశితంగా గమనిస్తారు. దాని ఆధారంగానే అధికార, ప్రతిపక్షాల పనితీరును లెక్కిస్తారు. అనుభవం ఉన్న చంద్రబాబు సభను బహిష్కరించడంతో ఆ లోపాన్ని అధిగమించి బాగా కసరత్తు చేసి వచ్చి ప్రతిపక్షం సభకు వస్తుందని అందరూ భావించారు. అయితే జనం అంచనాలను తల్లకిందులు చేస్తూ రాజకీయంగా ఆత్మహత్యా సదృశమైన వ్యూహంతో టీడీపీ సభ్యులు సభలో వ్యవహరించారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వివిధ అంశాలపై జరిగిన చర్చలో అధికారపక్షాన్ని ఇరుకున పెట్టే అవకాశాన్ని చేజేతులా వదిలేశారు. ఇళ్లపట్టాల మీద స్వల్పకాలిక చర్చపెడితే దానిపై మాట్లాడలేదు. పోలవరం ఎత్తు తగ్గించారంటూ తమ అనుంగు మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రజల్లో అపోహలు కలిగించిన టీడీపీ దానిపై చర్చలోనూ పాల్గొనలేదు. మద్యం పాలసీపై స్వల్పకాలిక చర్చ పెడితే.. అందులోనూ పాల్గొనలేదు. అసెంబ్లీ హక్కుల గురించి చర్చ నిర్వహించినా హాజరుకాలేదు. పెగాసెస్, పోలవరం సహా అనేక అంశాలపై చర్చ జరిగింది. ప్రతీ అంశంపై సీఎం జగన్‌, మంత్రులు  వివరణ ఇస్తున్నా అవేమీ తమకు పట్టనట్టు టీడీపీ వ్యవహరించింది. చర్చలపై పట్టుబట్టి.. తీరా చర్చ చేపడితే రాకుండా గొడవలు చేశారు అని జనం అనుకొనేలా వ్యవహరించారు. తాము ప్రధానంగా చర్చకు పట్టుబట్టిన జంగారెడ్డిగూడెం మరణాల వ్యవహారం, మద్యం పాలసీ మీద ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతున్నా టీడీపీ సభ్యులు అడ్డుకోవాలని చూడడం విచిత్రం.

ఆసాంతం పథకం ప్రకారం రచ్చ..

ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ చేసిన ప్రసంగాన్ని అడ్డుకోవడంతో ప్రారంభించి రోజుకో రీతిలో ఆందోళన చేస్తూ టీడీపీ సభ్యులు జనందృష్టిని ఆకర్షించాలని ప్రయత్నించారు. చైర్మన్‌, స్పీకర్‌లతో వాగ్వాదానికి దిగడం, కాగితాలు చించడం, విజిల్స్‌ ఊదడం, చిడతలు వాయించడం, సభలో మంగళసూత్రాలు ప్రదర్శించడం వంటి వింత పోకడలతో నిరసన వ్యక్తం చేశారు. ఎంతసేపూ మీడియాలో హైలైట్‌ కావడానికి ప్రాధాన్యం ఇచ్చారు తప్ప ముఖ్యమైన అంశాలపై సైతం చర్చల్లో పాల్గొనలేదు. వారి ధోరణి చూస్తే తాము లేవనెత్తిన సమస్యలపై ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడం కన్నా ఎలాగైనా సస్పెండ్‌ కావాలనే ఆత్రుత కనిపించింది. ఎక్కడా పట్టువిడుపు ధోరణి ప్రదర్శించకుండా పథకం ప్రకారం రచ్చ చేయడానికే టీడీపీ సభ్యులు సభలోకి వచ్చారా అన్న అనుమానం కలిగేలా ప్రవర్తించారు.

మైలేజీ కన్నా డ్యామేజీ ఎక్కువ

సభలో టీడీపీ అనుసరించిన వ్యూహంతో ఆ పార్టీకి రాజకీయంగా మైలేజీ కన్నా డ్యామేజీ ఎక్కువ జరిగింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సభలో అధికార పక్షాన్ని నిలదీయడంపై తమ సభ్యులకు డైరెక్షన్ ఇవ్వకుండా సభ బయట ఆందోళనలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇన్ని రోజులూ ప్రతిపక్షం.. సభలో అరుపులు, కేకలకు పరిమితమై బయట మీడియా వద్ద మాట్లాడమేమిటని జనం అనుకుంటున్నారు. అధికార పక్షం సమాధానం ఇస్తున్నా వినే ఓపిక లేని టీడీపీ సభ్యుల తీరును తప్పుబడుతున్నారు. స్పీకర్‌, సీఎం, మంత్రులు నచ్చజెపుతున్నా వినకుండా సభలో అల్లరి చేయడంతో టీడీపీ సభ్యులు అనవసరమైన పట్టుదలకు పోయి సభా సమయాన్ని వృథా చేశారు అన్న భావన కలిగింది. ఇన్నాళ్ల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఫలానా అంశంలో నిలదీశామని, దాని వైఫల్యాను ఎత్తి చూపామని ప్రజలకు చెప్పుకోవడానికి టీడీపీకి ఏమి లేకపోయింది. ఒక పార్టీగా టీడీపీకి ఇంత కన్నా నష్టం ఏముంటుంది?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి