iDreamPost

బొబ్బిలి రాజావారి భవిష్యత్తేమిటో..?

బొబ్బిలి రాజావారి భవిష్యత్తేమిటో..?

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో విజయనగరం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఏ జిల్లాలో లేని విధంగా ఇక్కడ రెండు రాజవంశాలదే రాజకీయమన్నట్లు గత కొన్నేళ్లుగా నడిచింది. అయితే నాటి రాచరిక పాలనలాగే.. నేటి రాజుల రాజకీయానికి కాలం చెల్లినట్లు కనిపిస్తోంది. విజయనగరం కేంద్రంగా టీడీపీ రాజకీయాలను శాసించిన పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రభ ఇటీవలి కాలంలో మసకబారింది. అదే రీతిలో బొబ్బిలి రాజవంశీకుడైన సుజయకృష్ణ రంగారావు గత సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి తెరమరుగయ్యారు. దాంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న చర్చ జరుగుతోంది.

ఒక్క నిర్ణయంతో తారుమారు

కాంగ్రెస్ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన సుజయకృష్ణ రంగారావు ఆ పార్టీ తరఫున రెండు సార్లు బొబ్బిలి నుంచి పోటీచేసి ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం అనంతరం జగన్ వైఎస్సార్సీపీ పార్టీ ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ ను వీడి ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో ప్రతిపక్షంలో ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు లొంగిపోయి టీడీపీలో చేరిపోయారు. గనుల శాఖ మంత్రి పదవి కూడా చేపట్టారు. అయితే తానెంత తప్పు చేశారో.. పార్టీ మారడం రాజకీయంగా తనను ఎంత దెబ్బతీస్తుందో 2019లో ఆయనకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయనకు ఘోర పరాభవం ఎదురైంది. ఆ ఓటమి ఆయన్ను దాదాపు తెరమరుగు చేసింది.

సోదరుడికి ఇంఛార్జి బాధ్యతలు

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భారంతో ఉన్న సుజయకృష్ణ రంగారావును టీడీపీ అధిష్టానం తీరు మరింత కుంగదీసింది. ఆయన సోదరుడు బేబినాయనకు బొబ్బిలి ఇంఛార్జి బాధ్యతలు కట్టబెట్టింది. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో నియోజకవర్గంలో ఆయన ఆధ్వర్యంలోనే వ్యవహారాలు నడిపింది. అయినా ఏ ఎన్నికల్లోనూ విజయం సాధించలేకపోయింది. కాగా ఆ ఎన్నికల్లో సుజయకృష్ణ జాడ ఎక్కడా కనిపించలేదు. పార్టీ నాయకులు సైతం ఆయన గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు. ఈ పరిణామాలతో సుజయ్ రాజకీయ జీవితం ఇక ముగిసిపోయినట్లేనన్న చర్చ జరుగుతోంది.

Also Read : టీడీపీకి తిరుపతి ఫలితాల టెన్షన్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి