iDreamPost

SIM Swapping సిమ్ స్వాపింగ్ అంటే ఏంటి? నేర‌గాళ్లు ఎలా మీ సిమ్ ను దొంగిలిస్తారు?

SIM Swapping  సిమ్ స్వాపింగ్ అంటే ఏంటి? నేర‌గాళ్లు ఎలా మీ సిమ్ ను దొంగిలిస్తారు?

ఒకప్పుడు ఫోన్ కాల్స్, టెక్ట్స్ మెసేజెస్ కోసమే ఉపయోగపడిన మొబైల్ ఫోన్ ఇప్పుడు ఆల్-ఇన్-వన్ గా మారిపోయింది. బ్యాంకు లావాదేవీలు, బిల్ పేమెంట్స్, షాపింగ్, సోషల్ మీడియా అకౌంట్స్, న్యూస్, ఎంటర్టైన్ మెంట్, గేమింగ్ – ఇలా ఒకటేంటి అన్నిఅవసరాలనూ తీరుస్తోంది. ఈ సౌకర్యాల మాటునే ఘరానా మోసాలూ మన కోసం పొంచి ఉన్నాయి. ఈ మోసాల్లో చాలా డేంజ‌ర్ సిమ్ స్వాపింగ్ స్కామ్.

సిమ్ స్వాపింగ్ వల్ల మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకు అకౌంట్ వివరాలు సైబ‌ర్ నేర‌గాళ్ల‌ చేతుల్లో పడొచ్చని అమెరికన్ దర్యాప్తు సంస్థ FBI హెచ్చరిస్తోంది. ఈ టెక్నిక్ తో సైబర్ నేరగాళ్ళు కోట్లకు కోట్లు లాగేస్తున్న ఉదంతాలు ఈమధ్య కాలంలో చాలా బయటపడ్డాయి. సింపుల్ గా పని కానిచ్చేది కావడం వల్ల సిమ్ స్వాపింగ్ టెక్నిక్ సైబర్ నేరగాళ్ళ పాలిట వరంగా మారింది.

అసలు సిమ్ స్వాపింగ్ అంటే ఏంటి?
సబ్ స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ నే (Subscriber Identity Module) SIM అంటారు. మన ఫోనుల్లో వాడే చిన్న డిటాచబుల్ చిప్ ఇది. ప్రతి ఫోనుకి ఒక సిమ్ కార్డు ఉంటుంది. అది సంబంధిత మొబైల్ అకౌంటుకి కనెక్టై ఉంటుంది. సిమ్ ని ఇంకో ఫోన్ లోకి మార్చితే దాంతో పాటే ఫోన్ నంబర్, అకౌంట్ సమాచారం షిఫ్ట్ అయిపోతుంది.

సిమ్ స్వాపింగ్ (SIM swapping) లేదా SIM jacking (సిమ్ జాకింగ్) లేదా సిమ్ హైజాకింగ్ (SIM hijacking)కి నంబర్ పోర్టబలిటీ కీలకం. ముందుగా నేరస్తుడు ఫిషింగ్ టెక్నిక్ ద్వారానో లేక ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ కి డబ్బులిచ్చో మీ పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ లాంటి వ్యక్తిగత వివరాలు సేకరిస్తాడు. ఆ తర్వాత మీ మొబైల్ ప్రొవైడర్ కి ఫోన్ చేసి ఫోన్ పోయిందని నమ్మించి నంబర్ పోర్టబులిటీ రిక్వెస్ట్ పెడతాడు. చాలా చోట్ల టెలికాం కంపెనీ సిబ్బందికి డబ్బులిచ్చి కూడా నంబర్ పోర్ట్ చేయించుకుంటున్నారు.

ఒకసారి నంబర్ పోర్ట్ అయితే అసలు వ్యక్తి సిమ్ పని చేయడం మానేస్తుంది. అతని కాల్స్ మెసేజెస్ నేరస్థుల సిమ్ కి వెళ్ళిపోతుంటాయి. రకరకాల అకౌంట్లు, మెయిల్ బాక్స్, డిజిటల్ పేమెంట్ యాప్స్, సోషల్ మీడియా అకౌంట్లు, షాపింగ్ అన్నింటి మీదా క్రిమినల్స్ కి గ్రిప్ వచ్చేస్తుంది. అన్ని ఓటీపీలు, వెరిఫికేషన్ లింక్స్ నేరస్థుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. దీంతో అసలు వ్యక్తికి తెలియకుండానే ఎంత డబ్బైనా డ్రా చేసుకోవచ్చు. ఇంకే కార్యకలాపాలైనా చేయవచ్చు.

సిమ్ స్వాప్ అయినట్లు ఎలా తెలుస్తుంది?

సిమ్ స్వాప్ అయినప్పుడు మీ ఫోన్ లో అర్థం పర్థం లేని మార్పులు వస్తాయి. ఫోన్ కాల్స్, మెసేజెస్ పని చేయవు. అకౌంట్ లో మార్పుల గురించి ఈ-మెయిల్స్ వస్తాయి. మీకు తెలియకుండానే బ్యాంకు లావాదేవీలు జరిగిపోతుంటాయి. సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయిపోయిందని మీ ఫ్రెండ్స్ చెబుతుంటారు. ఇలాంటివి ఏవి జరిగినా మీరు వెంటనే మొబైల్ ప్రొవైడర్ కి ఫిర్యాదు చేస్తే మంచిది.

అడ్డుకోవడం ఎలా?

సిమ్ స్వాపింగ్ ఫ్రాడ్ ని అడ్డుకోవడం కష్టమే. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పరిస్థితి చేయి దాటకుండా చూసుకోవచ్చు. 2-లెవల్ అథెంటికేషన్ ప్రాసెస్ ఉన్న యాప్స్ ని డౌన్ లోడ్ చేసుకోవడం అత్యుత్తమ మార్గం. దీంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు కూడా పాటిస్తే మేలు. మీ మొబైల్ అకౌంట్ PIN రీసెట్ చేసుకోండి. ఎవరూ గెస్ చేయలేని PIN అయితే బెటర్. మీ అడ్రెస్, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ లాంటివి PINలో వాడకపోవడమే మంచిది. సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకోండి. ఆ తర్వాత అన్ని ప్రొఫైల్స్ లో లాగిన్ అవండి. వీలైనంత వరకు మీ ఇన్ఫో ప్రైవేటుగా ఉండేలా చూసుకోండి.

మీ మొబైల్ ప్రొవైడర్ కి ఫోన్ చేసి సిమ్ స్వాపింగ్ కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కనుక్కోండి. వాళ్ళు ముందే జాగ్రత్తలు తీసుకుని ఉంటే సరి, లేదంటే మీలాంటి నలుగురు అడిగితే అప్పుడైనా వాళ్ళలో కదలిక రావచ్చు.

కొన్నేళ్ళుగా జరుగుతున్న లెక్కలేనన్ని కోట్ల కొద్దీ అకౌంట్లు హ్యాకయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 21న జరిగిన ఫేస్ బుక్ డేటా లీక్ ఉదంతంలో 53 కోట్ల మందికి పైగా యూజర్లకు నష్టం వాటిల్లింది. మీకు తెలియకుండానే మీకూ ఎంతోకొంత నష్టం జరిగే ఉంటుంది. మీకు తెలియలేదు కాబట్టి మీరు సేఫ్ అనుకోవడానికి వీల్లేదు. డేటా బ్రీచ్, సిమ్ స్వాపింగ్ లాంటివి ఎప్పటికైనా ప్రమాదకరమే. వీటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం బెట‌ర్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి