iDreamPost

నందిగ్రామ్ లో మమత పరిస్థితి ఏమిటి?

నందిగ్రామ్ లో మమత పరిస్థితి ఏమిటి?

అనుక్షణం ఉత్కంఠకు గురి చేస్తూ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడోసారి విజయం దక్కించుకుని హ్యాట్రిక్ సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. అయితే ఆ రాష్ట్రంలో హాట్ సీటుగా మారిన నందిగ్రామ్ పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. దీనికి కారణం సీఎం మమతా బెనర్జీ స్వయంగా అక్కడ బరిలోకి దిగి.. తన మాజీ సహచరుడిని సవాల్ చేయడమే. వారిద్దరి మధ్య జరిగిన హోరాహోరీ పోరు ఎలా ఉన్నా.. ఇప్పుడు మమత విజయంపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతుండటం టీఎంసీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఆమె గెలుపు అంత ఈజీ కాదట!

పంతం నెగ్గించుకునేందుకు మమత కంచుకోటలాంటి తన సొంత నియోజకవర్గాన్ని వదిలి నందిగ్రామ్ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. తొలిదశలోనే మార్చి 27న అక్కడ పోలింగ్ జరిగింది. ఆ దశలో ఆమె మిగతా నియోజకవర్గాలను వదిలి నందిగ్రామ్ లోనే సర్వశక్తులు ఒడ్డారు. అక్కడ నామినేషన్ వేసిన సందర్భంలోనే తోపులాటలో కాలికి గాయం కాగా.. దానికి బీజేపీ నేతల దాడే కారణమని ఆరోపించారు. కాలి కట్టుతో వీల్ చైర్లోనే ప్రచారం చేశారు. అయితే అక్కడ మమత విజయం నల్లేరుపై నడక కాదని ఇండియాటీవీ-పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ఆరు ఏడు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించాయి. రెండు తప్ప మిగతావన్నీ తృణమూల్ కాంగ్రెస్ సాధారణ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని తేల్చాయి. అయితే నందిగ్రామ్ లో మమత విజయావకాశాలపై ఒక్క ఇండియాటీవీ-పీపుల్స్ పల్స్ మాత్రమే అంచనా వేసింది. దాని అంచనా ప్రకారం నందిగ్రామ్ లో పరిస్థితి అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే, మమత ప్రత్యర్థి సువేందు అధికారి గట్టి పోటీ ఇచ్చారట. ఈ నియోజకవర్గం మొదటి నుంచి టీఎంసీకి పెట్టని కోటగా ఉన్నప్పటికీ.. ఆ ఓటు బ్యాంకులో చీలిక వచ్చిందని అంచనా. సాక్షాత్తు తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి హోదాలో మమత పోటీ చేయడంతో ఓట్లు మమత, సువేందు మధ్య చీలిపోయాయి.ఈ పరిస్థితుల్లో ఆమె అత్తెసరు ఓట్లతోనే గెలుస్తారని ఇండియాటీవీ 
పేర్కొంది.

తృణమూల్ శ్రేణుల్లో టెన్షన్

ఇండియాటీవీ అంచనా నేపథ్యంలో ఇప్పుడు తృణమూల్ నేతలు, కార్యకర్త ఒత్తిడికి గురవుతున్నారు. మమత ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తారని.. మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని వారు బయటకు ధీమాగా చెబుతున్నా లోలోపల ఆందోళన పెరుగుతోంది. ఈ ఉత్కంఠ భరించలేక పలువురు మమత అనవసరంగా రిస్క్ చేశారని వాపోతున్నారు. తన అండతో పార్టీలో రెండో స్థానానికి ఎదిగిన సువేందు అధికారి.. తనకే వెన్నుపోటు పొడిచి బీజేపీలోకి ఫిరాయించడాన్ని మమత సహించలేకపోయారు. అతన్ని మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వనని శపథం చేశారు. దానికి కట్టుబడి సువేందును అతని సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్ కే వెళ్లి ప్రత్యర్థిగా నిలిచారు. పౌరుషంతో మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయలేదు. ఇక్కడే ఆమె అనవసర రిస్క్ చేశారని టీఎంసీ కార్యకర్తలు అంటున్నారు. కంచుకోటలాంటి సొంత నియోజకవర్గం భవానీపూర్ ను వదలకుండా ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. నందిగ్రామ్ తోపాటు భవానీపూర్ లోనూ పోటీ చేసి ఉంటే ఏ ఇబ్బంది ఉండేది కాదంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి