iDreamPost

అమ్మోరు, అంజిలు ఇప్పుడొచ్చి ఉంటే ?

అమ్మోరు, అంజిలు ఇప్పుడొచ్చి ఉంటే ?

కార్తికేయ 2కు నార్త్ లో దక్కుతున్న ఆదరణ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అక్కడ ఎలాంటి గుర్తింపు లేని నిఖిల్ లాంటి చిన్న హీరో ఏకంగా అమీర్ ఖాన్ అక్షయ్ కుమార్ లను దాటేసే రేంజ్ లో కలెక్షన్లు రాబట్టడం చిన్న విషయం కాదు. సినిమాలో చూపించిన శ్రీకృష్ణ తత్వం అక్కడి ఆడియెన్స్ కి విపరీతంగా ఎక్కేస్తోంది. ముఖ్యంగా ఆయన గొప్పదనాన్ని అనుపమ్ ఖేర్ తో చెప్పించిన తీరు, పలు సంఘటనలను ముడిపెడుతూ లోక కళ్యాణానికి కృష్ణపరమాత్మ ఆశీసులు కావాలనేలా చూపించిన వైనం బాగా కనెక్ట్ అవుతోంది. ఇదే తరహాలో ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ ని అల్లూరి గెటప్ లో శ్రీరాముడిగా భావించి వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారో సోషల్ మీడియాలో చూశాం.

ఇక్కడే దర్శకులు కోడి రామకృష్ణ గారు గుర్తొస్తున్నారు. ఒకప్పుడు ఆయన తీసిన అమ్మోరు, అంజి, దేవిపుత్రుడులు కనక ఇప్పుడు రిలీజై ఉంటే ప్యాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్లయ్యేవన్న మాట వాస్తవం. అమ్మోరులో చూపించింది గ్రామ దేవతలనే అయినా మహిళలకు పూనకం వచ్చేలా విజువల్ ఎఫెక్ట్స్ ని చూపించిన విధానం ఇప్పటికీ అబ్బురపరుస్తుంది. ఇక మహాశివుడి ఆత్మలింగం కాన్సెప్ట్ తో తెరకెక్కిన అంజి సైతం ఉత్తరాది జనాన్ని మెప్పించేదే. క్లైమాక్స్ లో విఎఫ్ఎక్స్ ఇన్నేళ్ల తర్వాత కూడా హై స్టాండర్డ్ అనిపిస్తుందంటే దానికి కారణం నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి రాజీ పడని తత్వం, కోడి రామకృష్ణ గారు కథను విజువలైజ్ చేసిన తీరు గొప్పగా నిలబెట్టాయి.

అమ్మోరు ఘనవిజయం సాధించినా, అంజి అంచనాలు అందుకోలేకపోయినా బెస్ట్ వర్క్స్ లో ఒకటిగా నిలిచిపోయాయి. శ్రీకృష్ణుడి బ్యాక్ డ్రాప్ లోనే కోడి రామకృష్ణ వెంకటేష్ హీరోగా దేవిపుత్రుడు తీశాడు. నరసింహనాయుడు పోటీకి నిలవలేక స్థాయికి తగ్గట్టు ఆడలేదు కానీ ఇప్పటికీ టీవీలో వచ్చినప్పుడు ఇష్టపడుతూ చూసే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. అందుకే ఇవి ఈ టైంలో వచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హిందుత్వానికి సంబంధించిన కథలు ఈ మధ్య కాలంలో బాగా వర్కౌట్ అవుతున్నాయి. ప్రభాస్ ఆది పురుష్ కు సైతం ఇది చాలా పెద్ద ప్లస్ కానుంది. అయోధ్య రామాలయం నిర్మాణం జరుగుతున్న టైంలో రావడానికి మించిన టైమింగ్ ఏముంటుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి