iDreamPost

టాలీవుడ్ మీటింగ్ లో ఏం జరిగింది

టాలీవుడ్ మీటింగ్ లో ఏం జరిగింది

ఇవాళ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇండస్ట్రీ పెద్దలు హాజరు కాగా రాబోయే రోజుల గురించి చర్చలు జరిగాయి. అక్కినేని నాగార్జున, రాజమౌళి, అల్లు అరవింద్, త్రివిక్రమ్, కొరటాల శివ, చినబాబు, దిల్ రాజు, సి కళ్యాణ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. షూటింగులు ఆగిపోవడం వల్ల 14 వేల కార్మికులు వీధిన పడే పరిస్థితి వచ్చిందనే దాని గురించి చిరంజీవి ప్రస్తావించగా గవర్నమెంట్ తరఫున చెప్పబట్టబోయే చర్యల మీద వీలైనంత త్వరగా సమాధానం ఇవ్వాలని కోరారు.

రాజమౌళి మాట్లాడుతూ షూటింగ్ అనగానే ఏదో వందల వేలు జనాలు గుమి కూడతారనే అభిప్రాయం బయట ఉందని, సీన్ డిమాండ్ చేస్తే తప్ప అలా ఎవరూ కావాలని ప్లాన్ చేయరని చెప్పారు. అందులోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుగా రిస్క్ లేకుండా ఆర్టిస్టులు తక్కువగా ఉండే సీన్లు మాత్రమే షూట్ చేసి ఆపై పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తూ పోతామని క్లారిటీ ఇచ్చారు. అందులోనూ జాగ్రత్త విషయంలో తమది మొదటి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఇలా పలురకాల కోణాల్లో వివిధ అంశాల మీద చర్చ జరిగినట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఓ డెమో షూట్ లాంటిది వీడియో రూపంలో తీసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

ఎలాంటి కేర్ తీసుకుని షూటింగులు చేయబోతున్నారో అందులో వివరంగా పొందుపరుస్తారట. అంతేకాకుండా ఎవరెవరి సినిమాలు ఏ ఏ దశలో ఉన్నాయి ఏ లొకేషన్లు కావాలనే దాని మీద పూర్తి వివరాలతో కూడిన ఓ మెమొరాండంను కూడా సమర్పించబోతున్నారు. ఇవన్నీ చిరంజీవితో పాటు ముఖ్య సభ్యుల ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇస్తూ జిఓ జారీ చేసినా ఇప్పటికిప్పుడు అక్కడికి వెళ్లే పరిస్థితి లేదని సి కళ్యాణ్ చెబుతున్నారు. సాయంత్రంలోగా ప్రభుత్వం తరఫున ఏదైనా ప్రకటన ఇచ్చేలా తాము చేసిన వినతిని తలసాని శ్రీనివాస యాదవ్ గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆ దిశగా స్పందించేలా చేస్తానని హామీ ఇచ్చారు. మొత్తానికి స్థబ్దుగా ఉన్న పరిశ్రమలో ఈ మీటింగ్ వల్ల కొంత కదలిక వచ్చిందనే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి