iDreamPost

ఏపీలో ఏం జ‌రుగుతోంది..?

ఏపీలో ఏం జ‌రుగుతోంది..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు.. ప్ర‌తిప‌క్షాల చేష్ట‌లు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. ఒక‌వైపు ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూ ఉంటే.. మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాలు రెచ్చ‌గొట్టే ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. అంతర్వేది నుంచి రామతీర్థం వరకు ద్వేష దాడులు.. విద్వేష కార్య‌క్ర‌మాలు అమ‌ల‌వుతున్న తీరు అనుమానాల‌కు దారి తీస్తోంది. ప్ర‌జ‌లు అందరూ తమ రక్షణ కోసం, తమ కష్టాలు తీరేందు కోసం దేవుడి వ‌ద్ద‌కు వెళ్తుంటారు. తెలుగుదేశం నాయ‌కులు మాత్రం ప్ర‌భుత్వంపై త‌మ ప‌గ తీర్చుకునేందుకు, విద్వేషాలు రెచ్చ‌గొట్టేందుకు వెళ్తున్నార‌నే అప‌వాదు మూట‌గ‌ట్టుకుంటున్నారు. రాష్ట్రంలో గతంలోనూ ప్రాచీన దేవాలయాలు, పవిత్ర విగ్రహాలకు అపచారం వాటిల్లింది. దుండ‌గులు నిధుల కోస‌మో.. విక్ర‌త చేష్ట‌ల‌లో భాగంగానే అటువంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డేవారు. జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌ల‌కు విచారం వ్య‌క్తం చేస్తూ వేద పండితులు త‌గిన ప‌రిహారం చేప‌ట్టి పునః ప్ర‌తిష్ట చేసేవారు. ఎటువంటి అల్ల‌ర్లు, రాజ‌కీయ వివాదాలు త‌లెత్త‌కుండా ఆయా ప‌నులు పూర్త‌య్యేవి. కానీ ఇప్పుడు ఎందుకు అలా జ‌ర‌గ‌డం లేదు. ప్ర‌తీది ఇప్పుడే ఎందుకు ఇంత‌లా వివాదాస్ప‌ద మ‌వుతుంది..? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

సంక్షేమ సంద‌డిని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకేనా..?

ప్రశాంత వాతావరణం, మత సామరస్యం నిండుగా ఉండే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 0సాధారణంగా విద్వేషాలకు చోటిచ్చే ఘటనలు జ‌రిగినా ఇంత‌లా వెలుగులోకి రావ‌డం తక్కువే. మతం పేరిట విద్వేషం అన్నది లేదు. కానీ ఇటీవల కాలంలో వరుసపెట్టి దేవాలయాలు, రథాలు, విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయి. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. రథాలను తగలబెట్టారు. కొత్త ఏడాది తొలి రోజునే తూర్పుగోదావరి జిల్లా రామమహేంద్రవరంలోని శ్రీరాంనగర్‌లోని విఘ్నేశ్వర ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం రెండు చేతులు విరిచేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏడాది కాలంగా ఇలాంటివే ప‌లు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆయా ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు ప్ర‌భుత్వం స‌త్వ‌రం స్పందిస్తోంది. త‌గిన చ‌ర్య‌లు చేప‌డుతోంది. అంత‌ర్వేది విష‌యంలో సీఎం జ‌గ‌న్ చూపిన చొర‌వ తెలిసిందే. సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించి శ‌భాష్ అనిపించుకున్నారు. నూత‌న ర‌థ నిర్మాణానికి త‌క్ష‌ణ‌మే రూ. 90 ల‌క్ష‌లు కేటాయించి ఆధ్యాత్మిక వేత్త‌ల అభినంద‌న‌లు అందుకున్నారు. అయిన‌ప్ప‌టికీ తెలుగుదేశం నేత‌లు మాత్రం దానిపై ర‌చ్చ కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా జ‌గ‌న్ విజ‌య‌న‌గ‌రం జిల్లా ప‌ర్య‌ట‌న రోజే జిల్లాలోని ప్రఖ్యాత రామతీర్థం ఆలయంలో కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరాముడి విగ్రహానికి అప‌చారం జ‌రిగింది. పెద్ద ఎత్తున ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మం రోజునే ఈ త‌ర‌హా ఘ‌ట‌న చోటుచేసుకోడంతో దాని వెనుక చంద్ర‌బాబు పాత్ర ఉంద‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి లాంటి నేత‌లు బ‌హిరంగంగానే ఆరోపించారు. కోర్టు కేసుల ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కూ ఆపాల‌ని చూసినా ఇళ్ల స్థ‌లాల పంపిణీ కొన‌సాగుతుండ‌డంతో దాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే ఈ ఘ‌ట‌న వెలుగులోకి తెచ్చార‌న్న అనుమానాలూ వ్య‌క్తం అవుతున్నాయి.

ఏ మత‌మైనా స‌రే.. దేవాల‌యాల జోలికెళ్తే ఊరుకునేది లేద‌ని సీఎం జ‌గ‌న్ గ‌ట్టిగానే హెచ్చ‌రించారు. మరోవైపు శ్రీరాముడి విగ్రహ ధ్వంసంపై కూడా తీవ్రంగా స్పందించారు. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశారు. అధికారులు కూడా ఆ దిశ‌గా ద‌ర్యాప్తు వేగ‌వంతం చేశారు. ఇప్ప‌టికే కొంద‌రి క‌ద‌లిక‌ల‌ను గుర్తించారు. వారిని క‌నుగొనేప‌నిలో ఉన్నారు. ఇలా ప్రభుత్వం వైపు నుంచి రాగద్వేషాలకు అతీతంగా చర్యలు కొన‌సాగుతున్నాయి. కుట్రతో చేస్తున్న ఈ ఘటనలకు చెక్ పెట్టే నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ టీడీపీ నేత‌ల యాత్ర‌లు, వ్యాఖ్య‌లు కావాల‌నే రెచ్చ‌గొట్ట‌డానికేన‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఆ పార్టీ తీరును అంద‌రూ గ‌మ‌నిస్తూనే ఉన్నారు. ఇప్ప‌టికైనా ఇటువంటి క‌వ్వింపు కార్య‌క్ర‌మాలు మానుకోక‌పోతే టీడీపీకి భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌క‌మే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి