iDreamPost

అనపర్తిలో వివాదం ఎందుకు ముదిరింది..

అనపర్తిలో వివాదం ఎందుకు ముదిరింది..

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ రాజకీయాలు సామరస్యంగా కనిపించేవి. సుదీర్ఘకాలంగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన వారంతా సామారస్యంగా వ్యవహరించిన చరిత్ర ఉంది. కానీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వైఎస్సార్సీపీ నేత సత్తి సూర్యనారాయణ రెడ్డి అఖండ మెజార్టీతో విజయం సాధించిన తీరుని టీడీపీ సహించలేకపోతున్నట్టు కనిపిస్తోంది. పలు అక్రమాలతో ప్రజలకు దూరమయిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కొత్త పంథాలో సాగడంతో హఠాత్తుగా అనపర్తి పతాక శీర్షికలకు వచ్చింది. విమర్శలు, ప్రతివిమర్శల దశ నుంచి ఆరోపణలు వాగ్వాదాల వరకూ వెళ్ళాయి. చివరకు సత్యప్రమాణాల స్థాయికి చేరడంతో అసలు వ్యవహారం పక్కకిపోయి, హైడ్రామా హైలెట్ అవుతోంది. టీడీపీ ఇలాంటి ఫలితాలను ఆశించడంతోనే దానికి అనుగుణంగా పచ్చ మీడియాలో ప్రచారానికి ప్రాధాన్యత దక్కినట్టు పలువురు భావిస్తున్నారు.

టీడీపీ హయంలో ఐదేళ్ల పాలనలో పలు అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోయిందన్నది అనపర్తి నియోజకవర్గంలో బహిరంగ రహస్యమే. ముఖ్యంగా గ్రావెల్ , నీరు-మట్టి మూలంగా కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఇప్పటికే వివిధ విచారణ కమిటీలు నిర్ధారించాయి. వాటికి అనుగుణంగా చర్యలకు పూనుకుంటున్నారు. త్వరలో ఈ వ్యవహారం సాధారణ టీడీపీ నేతలతో పాటుగా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంది. దాంతో ఆయన ప్రత్యారోపణలకు దిగారు. ఇప్పటిక పలు గ్రామాల్లో టీడీపీ నేతల అవినీతిని స్థానికులు నిలదీస్తుండడంతో తదుపరి తనవంతు అని గ్రహించిన ఆయన ప్రస్తుత ఎమ్మెల్యేపై తీవ్రమైన ఆరోపణలకు దిగారు. తన సచ్ఛీలత నిరూపించుకోవాల్సిన సమయంలో ఎదుటివారిపై బుదర జల్లే కళ తన నాయకుడి నుంచి వంటబట్టించుకున్నట్టుగా ఉందని పలువురు ఎద్దేవా చేసే పరిస్థితి వచ్చింది.

ఆ క్రమంలో వాదోపవాదనలకు ఆస్కారం ఏర్పడింది. చివరకు గణపతి ఆలయంలో సత్యప్రమాణాలకు సతీసమేతంగా సిద్ధపడే స్థాయికి చేరింది. రాజకీయాల్లో ఇదో కొత్త పోకడగా భావించాలి. అనపర్తి లో అందుకు ఆరంభం జరిగిందని కూడా చెప్పవచ్చు. అయితే తన హయంలో జరిగిన అవినీతిపై చర్చలకు పూనుకుంటున్న వేళ సీన్ మొత్తం మార్చేసి, చర్చను పక్కదారి పట్టించే ప్రక్రియలో టీడీపీ నేతలు వేసిన ఎత్తులు ఆశ్చర్యంగా కనిపిస్తున్నాయి. అయితే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మాత్రం ఇప్పటికే రూ. 10 డాక్టర్ అని గుర్తింపు ఉండడంతో ఆయన అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలను పెద్దగా పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు. అయితే అధికారులు మాత్రం ఈ విషయంలో అసలు విషయాన్ని విస్మరించకుండా ముందుకెళ్లాలని డిమాండ్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపై జరిపిన దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అక్కడి ప్రజలు సూచిస్తున్నారు. దానికి అనుగుణంగా ముందుకు వెళితే అసలు గట్టు రట్టవుతుందనే వాదన బలపడుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి