iDreamPost

కొత్త సినిమాల వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్..

కొత్త సినిమాల వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్..

చెప్పుకోవడానికేమో మొన్న తొమ్మిదేసి సినిమాలు రిలీజయ్యాయి కానీ ఒక్క ఊర్వశివో రాక్షసివోకు మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రివ్యూలతో అంతా సానుకూలంగానే కనిపించినా అది కలెక్షన్ల రూపంలోకి మారడం లేదు. రొమాంటిక్ కంటెంట్ ఎక్కువగా ఉందన్న టాక్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరం పెడితే శిరీష్ కోసం థియేటర్ కు ఏం వెళ్తామనే ఆలోచన యూత్ ని ఎక్కువగా లాగలేకపోతోంది. నిన్న బూస్టప్ కోసం అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా సక్సెస్ మీట్ చేశారు కానీ వేడుక మొత్తం పుష్ప 2 దాని మీద అంచనాలు బన్నీ భజనతోనే అధిక సమయం గడపడంతో శిరీష్ ని ప్రమోట్ చేసే అసలు ఉద్దేశం పూర్తిగా నెరవేరలేదని అర్థమవుతోంది.

Friday Box-Office Report : Poor openings for all releases

ట్రేడ్ లెక్కల విషయానికి వస్తే మూడు రోజుల వీకెండ్ కు గాను ఊర్వశివో రాక్షసివో కేవలం కోటిన్నర లోపే వరల్డ్ వైడ్ షేర్ తెచ్చినట్టు సమాచారం. ఇది చాలా తక్కువ. పాజిటివ్ వేవ్స్ వచ్చిన మూవీకి ఇలా జరగడం చాలా అరుదు. ఇక మిగిలిన వాటికి కనీసం థియేటర్ల అద్దెలు గిట్టుబాటు అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇవాళ్టి నుంచి పరిస్థితి ఇంకా కిందకు వెళ్లిపోయింది. శిరీష్ కూడా జనాన్ని వచ్చేలా చేయడంలో ఫెయిలవుతున్నాడు. అచ్చం గాడ్ ఫాదర్ తరహాలో ఆపరేషన్ సక్సెస్ రోగి మరణంలా అయిపోతోంది. ఈ శుక్రవారం సమంతా యశోదతో పాటు హాలీవుడ్ మూవీ వాకండ ఫరెవర్ వస్తుంది కాబట్టి ఇకపై పెద్దగా రన్ ఆశించడం కష్టమే.

శిరీష్ బాబే విన్నర్ గా కనిపిస్తున్నాడు కానీ...!

ఇక కాంతార దూకుడు మాత్రం అలాగే కొనసాగుతోంది. ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ కు దగ్గరలో ఉన్న ఈ శాండల్ వుడ్ బ్లాక్ బస్టర్ షేర్ రూపంలో 25 కోట్లను దాటేసింది. కెజిఎఫ్ తర్వాత అంత భారీ మొత్తం వసూలు చేసిన కన్నడ డబ్బింగ్ మూవీ ఇదే. నిన్నా మొన్నా దీనికే వసూళ్లు బాగున్నాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కొన్ని అంశాలున్నాయి. ఎంత కామెడీ ఉన్నా సరే జనం మాములు బడ్జెట్ లో రూపొందించే వాటిని థియేటర్లలో చూసే తీరాలన్న ఆలోచనలో లేరు. కంటెంట్ లో సంథింగ్ స్పెషల్ ఉందంటేనే హాలు దాకా వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. లేదంటే ఊర్వశివో ప్రేయసివో లాంటి వాటికీ ఓపెనింగ్స్ పరంగా ఇబ్బందులు తప్పవు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి