iDreamPost

నెరవేరుతున్న ఎగువ పెన్నా రైతుల కలలు – నీటి ప్రాజెక్టులు

నెరవేరుతున్న ఎగువ పెన్నా రైతుల కలలు – నీటి ప్రాజెక్టులు

ఎడారి అవుతున్న అనంతపురం జిల్లాలో, పశ్చిమ అనంతపురం ప్రాంతంలో నీటి ఎద్దడి మరీ ఎక్కువ.. అనంతపురం హంద్రీ – నీవా పథకం ద్వారా వచ్చే కొద్దిపాటి నీళ్లు కూడా దిగువకు పోవడమే కానీ ఎగువన ఉన్న పేరూరు డ్యామ్ ఆయకట్టుకు చుక్క నీరు దక్కదు. HLC కాలువ ద్వారా వచ్చే నీళ్లు కూడా దిగువన ఉన్న PABR కి వెళ్తాయి తప్ప ఎగువన ఉన్న పేరూరు డ్యామ్(upper penna dam)కి నీరు రాదు. ఆ ప్రాంతంలో పెన్నా అంటేనే పీనుగుల పెన్నా అంటారు. ఆ ప్రాంతం వారు డ్యామ్ లో నీళ్లు చూసి రెండు దశాబ్దాలు దాటిపోయింది.

ఈ క్రమంలో పేరూరు డ్యామ్ కు నీరు తీసుకురావడం కోసం తోపుదర్తి ప్రకాష్ రెడ్డి(ప్రస్తుత రాప్తాడు ఎమ్మెల్యే) గత 12 సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. ఆయన కృషి ఫలించి ఒక టీఎంసీ నీటిని ప్రభుత్వం పేరూరు డ్యామ్ కు నిన్న కేటాయించింది.

2008 ఏప్రిల్ 28 న పేరూరు డ్యామ్ జలసాధన సమితి పేరుతో 10,000 మంది రైతులతో సభ నిర్వహించి హంద్రి – నీవా నుంచి పేరూరు డ్యామ్ కు నీళ్లు ఇవ్వాలన్న డిమాండుని ఉద్యమ రూపంగా తోపుదర్తి ప్రకాష్ రెడ్డి మార్చారు. ప్రకాష్ రెడ్డి ప్రయత్నాలు, విజ్ఞప్తులు ఫలించి 20 ఏప్రిల్ 2009 న రాప్తాడులో జరిగిన బహిరంగ సభలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంగీకరించారు.

పేరూరు డ్యామ్ హంద్రి – నీవా నీరిచ్చే పథకం

జీడిపల్లి రిజర్వాయర్ నుండి పేరూరు బ్రాంచ్ కెనాల్ పై బోరంపల్లి లిఫ్ట్ నుండి కళ్యాణదుర్గం, కంబదూరు మండలాలలోని ఆయకట్టుకు నీరిస్తూ, ఐపార్స్ పల్లి వద్ద లిఫ్టును ఏర్పాటు చేసి అక్కడి నుండి 20 కిలోమీటర్లు గ్రావిటీ కాలువ ద్వారా పేరూరు డ్యామ్ కి నీరివ్వాలని ప్రతిపాదిస్తూ ప్రకాష్ రెడ్డి సొంత ఖర్చుతో సర్వే చేయించి ప్రభుత్వానికి సమర్పించారు. హంద్రి – నీవా ఏడవ డివిజన్ అధికారులు ప్రకాష్ రెడ్డి ఇచ్చిన ప్రతిపాదనను పరిశీలించి 85 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు.

పేరూరు డ్యామ్ కి నీళ్లు తీసుకురావాలన్న ప్రకాష్ రెడ్డి కలకు వైస్సార్ అకాల మరణంతో గండి పడింది. అయినా పట్టు విడవని ప్రకాష్ రెడ్డి రోశయ్య, కిరణ్, చంద్రబాబు ప్రభుత్వాల్లో ప్రాజెక్టు పూర్తికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 2012 అక్టోబర్ లో పాదయాత్రలో భాగంగా చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే ఒక సంవత్సరం లోపు పేరూరు డ్యామ్ కి నీళ్లిస్తానని హామీ ఇచ్చారు.

Read Also: తుంగభద్ర డ్యామ్

బాబు అధికారంలోకి వచ్చారు. రెండున్నర సంవత్సరాలు పేరూరు డ్యామ్ ను మర్చిపోయారు. చివరికి 2016 ఇండిపెండెన్స్ డే ని అనంతపురంలో జరుపుకున్న సందర్భంలో పేరూరు డ్యామ్ కి నీళ్లిచ్చే పథకానికి 850 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అంటే 7 సంవత్సరాలలో 85 కోట్ల బడ్జెట్ 850 కోట్లు పెరిగింది. అవినీతి ఆరోపణలు పట్టించుకోక పోయినా ఇంత చిన్న పథకానికి 850 కోట్లు ఎందుకవుతుంది అన్న ఆలోచన అటు అధికారులు, ఇటు ప్రజల్లో తలెత్తింది.

పేరూరు డ్యామ్ కి హంద్రీ – నీవా నీరు ఇవ్వడం కోసం మొదటిసారి సర్వే జరిగింది 2009 లో. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 2012లో జీడిపల్లి వరకూ నీళ్లు వచ్చాయి. మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులు కూడా చాలావరకు పూర్తి అయ్యాయి. దీంతో ప్రకాష్ రెడ్డి తక్కువ ఖర్చుతో కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు.

ప్రకాష్ రెడ్డి కొత్త ప్రతిపాదన ప్రకారం మడకశిర బ్రాంచ్ కాలువ మీద 26వ కిలోమీటర్ వద్ద ఉన్న బొక్సంపల్లి నుండి తురకలాపట్నం,పెదకోడిపల్లి చెరువులను నింపే వంకలోకి హంద్రీ – నీవా నీళ్లు వదిలితే అవి పెన్నా నదిలోకి చేరి అక్కడనుండి 25 కిలోమీటర్ల దిగువన ఉన్న పేరూరు డ్యామ్ కు 12 నుండి 14 గంటల్లో చేరుతుంది. దీనివలన రొద్దం, రామగిరి మండలాలు ఎం.సీ.పల్లి,కొండాపురం పంచాయితీ పరిధిలో భూగర్భ జలాలు పెరగడంతో పాటు పేరూరు డ్యామ్ కింద ఉన్న పదివేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

Read Also: నీటి కలల సాకారం దిశగా- మూడు శంకుస్థాపనలు

సహజంగానే వైసీపీకి చెందిన ప్రకాష్ రెడ్డి ప్రతిపాదనను ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం ముఖ్యంగా ప్రకాష్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి పరిటాల సునీత బుట్టదాఖలు చేసారు. ప్రకాష్ రెడ్డి చేసిన ప్రతిపాదన కేవలం 20 నుండి 25 కోట్లతో పూర్తవుతుంది. అయినాకూడా ప్రభుత్వం 850 కోట్ల ఖర్చయ్యే ప్రతిపాదనను అమలు పరుస్తూ 2017 ఆగష్టు 30 తారీఖున అంటే హామీ ఇచ్చిన సంవత్సరం తర్వాత ఈ పథకానికి అనుమతులు ఇచ్చింది. చంద్రబాబు ఇచ్చిన హామీలు, శంకుస్థాపనలు లాగే ఎన్నికల పథకంగా మిగిలిపోయింది. 2019 ఎన్నికల నాటికి ఈ పథకం మీద పెట్టిన ఖర్చు శూన్యం, జరిగిన పనులు శూన్యం..

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకాష్ రెడ్డి తన పేరూరు డ్యామ్ కు నీళ్లిచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లారు. ఆయన కృషితో నిన్న అనగా జనవరి 23,2020 న హంద్రీ – నీవా నుండి పేరూరు డ్యామ్ కి ఒక టీఎంసీ నీటిని కేటాయిస్తూ G.O #36 విడుదల చేసింది. ఈ పథకానికి కావాల్సిన నిధులు ఇవ్వడానికి జపాన్ కు చెందిన JICA సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ పథకానికి 25 నుండి 30 కోట్ల నిధులు అవసరమని అంచనా..

Read Also: నీటి వాడకం మీద ఆంధ్రజ్యోతి విష ప్రచారం ఎందుకు? అనంతపురం రైతుల మీద కోపమా?

12 సంవత్సరాల ప్రకాష్ రెడ్డి కల పేరూరు డ్యామ్ ఆయకట్టు దారుల ఆశ, మూడు నియోజక వర్గాల ప్రజల కోరిక నెరవేరడానికి నిజమైన, బలమైన అడుగు పడింది. తక్కువ బడ్జెట్, తక్కువ భూసేకరణ కావడం వలన ఈ ప్రాజెక్టు అతి త్వరలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి అవుతుందని ఆశిస్తున్నారు.

హంద్రీ-నీవా నుండి పేరూరు డ్యాముకు నీళ్లు రావలసిన మార్గంలో కొంత కర్ణాటక ప్రాంతం ఉంది. హంద్రీ-నీవా నీరు కర్ణాటక కు చెందిన నాగలమడక వద్ద నిర్మించిన ఆనకట్ట దాటుకొని పెన్నానదిలో కలిసి అక్కడి నుంచి పేరూరు డ్యాముకు చేరాలి. కర్ణాటక రైతులు ఈ నీటిని వాడుకోకుండా చట్టపరమైన రక్షణ కోసం ప్రకాష్ రెడ్డి ఆప్రాంత ఎంపీ (చిత్రదుర్గ) సహాయంతో కర్ణాటక ముఖ్యమంత్రి యడుయూరప్పతో చర్చించి పేరూరు డ్యాము నిండేవరకూ ఎటువంటి పంపింగ్ చేయకుండా,డ్యాము నిండిన తరువాత నాగలమడక డ్యాములో నీరు నిలుపుకునేలాగా అంగీకరింపచేశారు. ఈమేరకు ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది .

నాయకుల కలలు “డైరీలలో” సంవత్సరాల పాటు నిక్షిప్తం కావడంవల్ల ప్రజలకు కానీ, ఆ ప్రాంతానికి కానీ ఉపయోగం లేదు.. సమస్యల పరిష్కారానికి కమిట్మెంట్ ఉన్న ప్రకాష్ రెడ్డి లాంటి నాయకులు కావాలి..ఆలోచనలు అందరికీ వస్తాయి, పనిచేయాలని కూడా చాలామందికి ఉంటుంది కానీ లక్ష్య సాధన కోసం నిరంతర కృషి కొందరే చేయగలుగుతారు. ప్రకాష్ రెడ్డి ఆ కోవకు చెందిన నాయకుడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి