iDreamPost

నితీశ్‌ కుమార్‌ వర్సెస్ ప్రశాంత్‌ కిశోర్‌

నితీశ్‌ కుమార్‌ వర్సెస్ ప్రశాంత్‌ కిశోర్‌

వచ్చే అక్టోబర్-నవంబర్‌లలో ఎన్నికలు జరగబోయే బీహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తన విమర్శలకు పదును పెడుతున్నాడు. బీహార్‌లో కరోనా వైరస్‌ నియంత్రణ కంటే అసెంబ్లీ ఎన్నికలే సీఎం నితీశ్‌కు ప్రధాన అజెండాగా ఉందని ఆరోపించాడు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరు రోజుల పాటు నిర్వహించిన తన పార్టీ యొక్క డిజిటల్ సమావేశాన్ని నితీశ్‌ కుమార్‌ ముగించారు. ఇందులో భాగంగా ఆయన వీడియో-కాన్ఫరెన్స్ ద్వారా క్రింది స్థాయి కార్యకర్తలతో సంభాషించాడు. ఈ నేపథ్యంలో వివిధ అంశాలపై నితీశ్‌ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రశాంత్‌ కిశోర్‌ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడు. ముఖ్యంగా కోవిడ్ నియంత్రణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. అలాగే ఇటీవల కేంద్రం నుంచి 1.25 లక్షల కోట్ల సహాయాన్ని రాష్ట్రం పొందిన విషయాన్ని బీహార్ ప్రజలకు బహిరంగంగా చెప్పాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు.
సీఎం నితీశ్‌ కుమార్ కరోనా వైరస్ నియంత్రణ చర్యలకు బదులు అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల నిష్పత్తి అత్యల్పంగా ఉన్నప్పటికీ దాదాపు పరీక్షించిన నమూనాలో 7-9 శాతం పాజిటివ్ కేసుల రేటుతో 6000 పైగా కేసులు నమోదయ్యాయి. గత మూడు నెలలుగా కోవిడ్ భయంతో తన నివాసం నుండి బయటకు అడుగు పెట్టని నితీశ్‌కుమార్‌ సాధారణ ప్రజలు ఓటు వేయడానికి బయటకొస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని భావిస్తున్నారని’ ప్రశాంత్‌ కిశోర్‌ హిందీలో వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

రెండేళ్ల క్రితం నితీశ్‌ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్)లో ప్రశాంత్‌ కిశోర్‌ చేరి జాతీయ ఉపాధ్యక్ష పదవి చేపట్టాడు. కానీ ఎన్‌పిఆర్,సిఎఎ లకు వ్యతిరేకంగా ఎన్డీయే భాగస్వామ్య పార్టీ అయిన జెడియు నాయకుడుగా ఉన్న సమయంలో ప్రశాంత్‌ కిశోర్‌ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై నిరసన గళం వినిపించాడు. దీంతో గత జనవరిలో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కారణంగా ఆయనని జెడియు నుండి బహిష్కరించారు.

లాలూ ప్రసాద్‌తో సత్సంబంధాలు సంబంధాలున్న ప్రశాంత్‌ కిశోర్‌ జెడి (యు) తో సంబంధాలు తెగిపోయిన తరువాత బీహార్‌లోని ఏ పార్టీతోనూ సంబంధం పెట్టుకోలేదు. ‘బాత్ బీహార్ కి’ అనే రాజకీయ వేదికను ఏర్పాటు చేసి తనదైన స్టైల్‌లో బీహార్ రాజకీయాలలో జోక్యం చేసుకుంటున్నాడు. నితీశ్‌ కుమార్‌ పాలనా కాలంలో సాధించిన అభివృద్ధిపై సంతృప్తి చెందలేదని చెబుతున్న రాష్ట్ర యువకులను ప్రోత్సహించడానికి ఈ వేదిక ప్రయత్నిస్తుంది. అలాగే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ( ఐపిఎసి) వ్యవస్థాపకుడుగా ఉన్న ప్రశాంత్‌ కిశోర్‌ ఎన్డీఏ యేతర ప్రముఖ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కు చెందిన అరవింద్ కేజ్రీవాల్, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కు చెందిన మమతా బెనర్జీ వంటి నాయకులతో కలిసి దేశవ్యాప్తంగా ఎన్డీయే వ్యతిరేక ప్రచారంలో పాల్గొంటున్నాడు.

2015 అసెంబ్లీ ఎన్నికలలో జనతాదళ్ (యునైటెడ్),రాష్ట్రీయ జనతా దళ్ మరియు కాంగ్రెస్‌లతో కూడిన గ్రాండ్ అలయన్స్ అద్భుత విజయం సాధించడానికి ప్రచారంలో ఎన్నికల వ్యూహకర్త కిశోర్‌ కీలక పాత్ర పోషించారు. అయితే జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తన పాత మిత్రుడు నితీశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రతిపక్ష కూటమి తరపున ప్రస్తుతం తన స్వరం వినిపిస్తున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి