iDreamPost

కమల్ లైకాల మధ్య యాక్సిడెంట్ వార్

కమల్ లైకాల మధ్య యాక్సిడెంట్ వార్

ఇటీవలే ఇండియన్ 2 షూటింగ్ లో జరిగిన క్రేన్ ప్రమాదంలో ముగ్గురు టెక్నీషియన్లు మరణించిన విషాదం యావత్ దక్షిణాది సినీ పరిశ్రమను షాక్ కు గురి చేసింది. హీరో కమల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తృటిలో తప్పించుకున్నారు కానీ దర్శకుడు శంకర్ స్వల్ప గాయాలతో బయట పడటం అదృష్టంగానే భావించవచ్చు. ఇక ఇది జరిగి వారం అవుతోంది. నిర్మాత లైకా సంస్ధను ప్రశ్నిస్తూ కమల్ హాసన్ ఇటీవలే వాళ్ళకో ఓపెన్ లెటర్ రాశాడు. చాలా ఎమోషనల్ గా బాధితుల రక్షణతో పాటు రాబోయే రోజుల్లో ప్రమాదాలు ఎదురు కాకుండా తీసుకోబోయే జాగ్రత్తలు చెప్పాలని డిమాండ్ చేస్తూ అవి నెరవేరే దాకా షూటింగ్ కు రాను అనే తరహాలో కాస్త ఘాటుగానే ప్రశ్నించాడు.

తాజాగా లైకా సంస్థ తరఫున దాని డైరెక్టర్ నీల్ కాంత్ నారాయణ్ పూర్ ఓ లేఖను విడుదల చేశారు. అందులో మాటకు మాటా తరహాలో జబాబు ఉండటంతో కమల్ ఫ్యాన్స్ భగ్గుమంటుండగా ఇతర హీరోల అభిమానులు అందులో లాజిక్ ఉందిగా అంటూ వాదిస్తున్నారు. తమ సంస్థ యూనిట్ సభ్యుల భద్రత, క్షేమం గురించి కట్టుబడి ఉందని సంఘటన జరిగిన కొద్దిగంటల్లో తమ అధినేత సుభాస్కరన్ తో సహా టాప్ మేనేజ్ మెంట్ చెన్నై కు ఫ్లైట్ లో వచ్చిందని అందులో పేర్కొన్నారు. మీరు పరామర్శించి వెళ్లిన పావు గంటకే తమ టీమ్ ఆసుపత్రికి చేరుకొని బాధ్యతలు నిర్వర్తించిందని మార్చురీకి దగ్గరకు వెళ్లిన ఉదంతాన్ని కూడా అందులో పేర్కొన్నారు.

చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు రెండు కోట్ల నష్టపరిహారంతో పాటు గాయపడిన వారి పూర్తి చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేశామని అందులో చెప్పారు. అంతేకాదు మొత్తం యూనిట్ కు ఇప్పటికే పేరుపొందిన జాతీయ ఇన్సురెన్స్ కంపెనీతో భీమా చేయించడాన్ని కూడా ప్రస్తావించారు. ఒకరికొకరు మద్దతుగా నిలబడి పని చేద్దామని, కలిగిన లోటు ఎవరూ పూడ్చలేనిదైనా లైకా తరఫున ఇప్పటిదాకా జరిగిన వాటి గురించి సెట్ లో నిత్యం ప్రత్యక్షంగా ఉండే మీకు, శంకర్ గారికి తెలియకుండా ఉండదని మేము అనుకోవడం లేదని కూడా అందులో చురక వేశారు. మొత్తానికి కమల్ లేఖకు అంతకు రెట్టింపు తీవ్రతతో బదులు ఇచ్చిన లైకా తిరిగి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతుందన్నది సస్పెన్సుగా మారింది. దీనికి సంబంధించి కమల్ స్పందన ఇంకా రాలేదు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి