iDreamPost

దేశానికి ఊపిరి పోస్తున్న విశాఖ ఉక్కు

దేశానికి ఊపిరి పోస్తున్న విశాఖ ఉక్కు

బంగారు బాతు లాంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తెగనమ్మి ఒకేసారి ఖజానా నింపుకోవాలని కేంద్రం పావులు కదుపుతోంది. దీన్ని అడ్డుకోవడానికి ఉద్యోగ, కార్మిక, రాజకీయ పక్షాలు గత మూడు నెలలుగా ఉద్యమాలతో హోరెత్తిస్తున్నారు. అయినా ఖాతరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు అదే ఉక్కు కర్మాగారం మరో రూపంలో అక్కరకొచ్చింది. దేశం యావత్తు స్టీల్ ప్లాంట్ వైపే ఆశగా చూస్తోంది. కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ.. ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తున్న మెడికల్ ఆక్సిజన్ అందరికీ ప్రాణావసరంగా మారింది.

దేశంలో ఆక్సిజన్ కు తీవ్ర కొరత

దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ ముట్టడిలో చిక్కుకొని విలవిల్లాడుతోంది. కేసుల సంఖ్య రోజుకు మూడు లక్షలకు చేరువలో నమోదవుతోంది. మరణాలు రెండువేలకు దగ్గర్లో ఉన్నాయి. ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కు తీవ్ర కొరత ఏర్పడింది. అందుబాటులో ఉన్న నిల్వలు, ఉత్పత్తి.. పెరుగుతున్న అవసరాలకు ఏమాత్రం సరిపోవడంలేదు. దీంతో కేంద్రం దృష్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్న ఇండస్ట్రియల్ ఆక్సిజన్ యూనిట్ పై పడింది. ఇక్కడ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి పెంచి దేశాన్ని ఆదుకోవాలని కోరింది.

రోజుకు 150 టన్నులు

స్టీల్ ప్లాంట్ తన అవసరాల కోసం సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ ఉత్పత్తి చేసే ఆక్సిజన్ ను తన అవరసరాలకు పోగా మిగిలిన దాన్ని బయట సంస్థలకు విక్రయిస్తుంటుంది. గత ఏడాది కరోనా కాలంలోనూ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేసి ఆదుకుంది. అయితే అప్పటికంటే ఇప్పుడు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. కొన్నిరెట్లు అధికంగా కేసులు నమోదవుతుండటంతో మెడికల్ ఆక్సిజన్ కు డిమాండ్ అమాంతం పెరిగింది. ఈ పరిస్థితుల్లో దేశం మొత్తం తనవైపే చేస్తుండటంతో విశాఖ స్టీల్ ప్లాంట్ తన వంతు సాయానికి నడుం కట్టింది. ఉత్పత్తిని రోజుకు 150 టన్నులకు పెంచింది.

రవాణాకు రైల్వే ఏర్పాట్లు

విశాఖ ఉక్కు ఉత్పత్తి చేస్తున్న మెడికల్ ఆక్సిజన్ ను ఎప్పటికప్పుడు దేశంలో అవసరమున్న ప్రాంతాలకు రవాణా చేసేందుకు రైల్వేశాఖ ముందుకొచ్చింది. ఇందుకోసం ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలును సిద్ధం చేసింది. మహారాష్ట్రలో కరోనా పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్నందున విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మొదట ముంబైకి మెడికల్ ఆక్సిజన్ పంపాలని నిర్ణయించారు. ఆ మేరకు ముంబైలోని కంబోలీ యార్డు నుంచి ఏడు ఖాళీ కంటైనర్లతో ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ఇప్పటికే విశాఖకు బయలుదేరింది. అది మంగళవారం రాత్రికి విశాఖ చేరుకుంటుంది. స్టీల్ ప్లాంట్లో ఆక్సిజన్ నింపుకొని వెంటనే తిరుగు ప్రయాణమవుతుంది.

Also Read : కేజ్రీవాల్ కూడా అంతేనా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి