iDreamPost

సచివాలయ పోస్టుల రాతపరీక్షకు సన్నాహాలు

సచివాలయ పోస్టుల రాతపరీక్షకు సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ,వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టులకు ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణ పురపాలక శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్‌లు జారీ చేశాయి. మొత్తం 19 రకాల పోస్టులకు 11.06 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే నిర్వహించాలని అప్పట్లో భావించగా.. కరోనా కారణంగా జరగలేదు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌ ఎత్తివేత కొనసాగుతుండగా.. అన్ని కార్యకలాపాలు తిరిగి పునఃప్రారంభం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషనర్, యూపీపీఎస్సీ పరీక్షలకు కూడా తేదీలు ప్రకటించడంతో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గ్రూప్‌ 1 పరీక్షలకు సంబంధించిన తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది.

ఏపీలో వైసీపీ సర్కార్‌ వచ్చిన మొదట్లోనే పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేర్చేందుకు గ్రామాల్లో ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయం, పట్టణాల్లో ప్రతి నాలుగువేల మందికి ఒక వార్డు సచివాలయం చొప్పున దాదాపు 14 వేల సచివాలయాలు ఏర్పాటు చేసింది. వీటిలో 19 విభాగాల్లో దాదాపు 1.30 లక్షల ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసింది. అయితే వీటిలో ఇంకా ఖాళీ ఉన్నా పోస్టులను కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే తాజా ఏర్పాట్లు చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి