iDreamPost

ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి గా మేకపాటి విక్రంరెడ్డి

ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి గా మేకపాటి విక్రంరెడ్డి

మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అకాల మరణంతో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన ఆత్మకూరు నియోజకవర్గానికి ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తి పోటీచేసే అవకాశముంది అని మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. అయితే.. ఎవరు పోటీ చేయాలనేది మేకపాటి కుటుంబం తాజాగా నిర్ణయించినట్లు తెలిసింది. గౌతంరెడ్డి సోదరుడు విక్రంరెడ్డి తో పోటీ చేయించాలని ఆయన కుటుంబం భావిస్తోంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ద్వారా మేకపాటి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన సూత్ర ప్రాయంగా అంగీకరీంచినట్లు తెలిసింది.

కే ఎం సీ మేనేజింగ్ డైరెక్టర్ గా..

మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి రెండో కుమారుడు విక్రంరెడ్డి. ఊటీలోని గుడ్ షెఫర్డ్ పబ్లిక్ స్కూల్ లో విద్యాభ్యాసం కొనసాగింది. ఐఐటీ చెన్నైలో సివిల్ సబ్జెక్టులో బీ.టెక్ పూర్తిచేసిన అనంతరం అమెరికాలో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చదివారు మేకపాటి విక్రమ్ రెడ్డి. రూపం లో స్వర్గీయ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని తలిపించేలా ఉండడం విశేషం. గౌతంరెడ్డి రాజకీయాల్లో ఉంటే ఆయన సొంత కంపెనీ భాద్యతలు చూసుకునేవారు. అంతర్జాతీయ సంస్థ ‘కేఎంసీ’కి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించే వారు.

సౌమ్యుడు, మృధుస్వభావి, సహనం, క్లుప్తత, స్పష్టత మేకపాటి విక్రమ్ రెడ్డి బలాబలాలు. తండ్రి రాజమోహన్ రెడ్డి నుంచి వారసత్వ రాజకీయం సహజంగానే అబ్బినా.. గౌతమ్ రెడ్డి రాజకీయ అరంగేట్రం తో ఆయన వ్యాపారరంగం వైపు మొగ్గుచూపారు.గౌతమ్ రెడ్డి మృతి తో రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. తొలుత దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి బరిలో ఉంటారని మీడియాలో ప్రచారం జరిగినా.. కుటుంబ సభ్యులందరి అభిప్రాయాలు, చర్చల అనంతరం మేకపాటి విక్రమ్ రెడ్డిని ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బరిలోకి దింపేందుకు ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. అంతిమంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా మేకపాటి కుటుంబసభ్యులు పోటీ చేస్తే ప్రతిపక్ష టీడీపీ పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉపఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ఈసీ ఇప్పటివరకు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి