iDreamPost

నింగికేగిన నిత్య కళాజీవి ‘విసు’

నింగికేగిన నిత్య కళాజీవి ‘విసు’

1987లో వచ్చిన ఆడదే ఆధారం అప్పట్లో పెద్ద హిట్టు. స్టార్లు లేకుండా కేవలం ఫ్యామిలీ ఎమోషన్స్, మధ్యతరగతి కష్టాలను ఆధారంగా తీసిన ఆ సినిమా కొన్నిసెంటర్లలో వంద రోజులు ఆడింది. సగటు మిడిల్ క్లాస్ క్లాస్ వాడిగా కాపురాలు తీర్చిదిద్దే వాడిగా అందులో నటించిన విసు గారు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత శ్రీమతి ఒక బహుమతి, ఇల్లు ఇల్లాలు పిల్లలు లాంటి మంచి హిట్స్ ఈయన ఖాతాలో ఉన్నాయి. విసు గారి గురించి ఇప్పుడు ప్రస్తావనకు తేవడానికి కారణం ఉంది.

అనారోగ్యం కారణంగా నిన్న ఈయన పరమపదించారు. ఇవాళ అంత్యక్రియలు జరగబోతున్నాయి. జనతా కర్ఫ్యూ ప్రభావం వల్ల ఆయనతో ఎంతో గొప్ప అనుబంధం ఉన్న వాళ్ళు సైతం విసు గారి పార్ధీవ దేహ సందర్శనకు వెళ్లలేకపోయారు. విసు గారి పూర్తి పేరు మీనాక్షి సుందరం రామస్వామి విశ్వనాథన్. మరీ పొడుగ్గా ఉండటంతో విసుగా పాపులారిటీ తెచ్చుకున్నారు. రంగస్థల నటుడిగా అపార అనుభవం ఉన్న విసు 1977లో సినిమా రంగప్రవేశం చేశారు.

రజనీకాంత్ అరుణాచలంలో రంభ తండ్రిగా, హీరో ఆస్తులను కాపాడే గార్డియన్ గా విసు గారు పోషించిన పాత్ర ఇప్పటి తరానికి కూడా బాగా కనెక్ట్ అవ్వడానికి కారణం ఆయన చూపించిన నట ప్రతిభే. తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంసారం ఒక చదరంగం ఒరిజినల్ తమిళ్ వెర్షన్ కు ఈయనే దర్శకుడు.తమిళంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు రూపొందించిన విసు లేకపోవడం పరిశ్రమకు తీరని లోటు. కరోనా భయంతో లాక్ డౌన్ జరిగిన పరిస్థితిలో ఇలాంటి వార్త వినాల్సి రావడం విషాదం. సౌత్ లో అందరు స్టార్లతో మంచి అనుబంధం కలిగిన విసు గారిని కోల్పోవడం నిజంగా ఆ లోటు ఎవరూ తీర్చలేనిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి