iDreamPost

వెంకీ మామ రివ్యూ

వెంకీ మామ రివ్యూ

వెంకీమామ జాతకం బాలేదు

వెంకీమామ‌లో స‌ర‌దా త‌క్కువ‌, సోది ఎక్కువ‌. సింపుల్‌గా చెప్పాలంటే పాత‌క‌థ‌నే , పాత సీన్ల‌తో చుట్టేశారు. మేన‌మామ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుంద‌నే భ‌రోసాతో క‌థ‌లో విష‌యం లేకుండా రెండున్న‌ర గంట‌లు సినిమా చూపించారు. క‌థ‌ల విష‌యంలో జాగ్ర‌త్తగా ఉంటాడ‌నే సురేష్‌బాబుకి ఈ క‌థ‌లో ఏం కొత్త‌ద‌నం క‌నిపించిందో మ‌రి!

మురారి సినిమాలో మ‌హేష్‌బాబుకి మేన‌మామ అనే ల‌గేజ్‌ని త‌గిలిస్తే వెంకీమామ అవుతాడు. రోజా సినిమా మామా అల్లుళ్ల మ‌ధ్య జ‌రిగితే కూడా ఇదే. సినిమా ప్రారంభంలోనే క‌థ ఎటుపోతుందో ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మైంది కానీ, ద‌ర్శ‌కుడికే అర్థం కాలేదు. సోష‌ల్‌మీడియా ఉదృతంగా ఉన్న ఈ రోజుల్లో ప్రేక్ష‌కులు సుల‌భంగా క‌థ‌ని ఊహించేస్తున్నారు. మ‌రి ఈ క‌థ‌ని ఊహ‌కంద‌ని స‌న్నివేశాల‌తో న‌డిపితే కొంచెం కిక్‌ ఉండేది. అదేమీ లేకుండా వెంక‌టేష్ కామెడీ , ఎమోష‌న‌ల్ యాక్టింగ్ సాయంతో లాగించేద్దామ‌ని డైరెక్ట‌ర్ బాబీ డిసైడ్ అయిపోయాడు. పోనీ ఆ కామెడీ అయినా కొత్త‌గా ఉందా అంటే ఛీప్ కామెడీ. వెంక‌టేష్ శాయ‌శ‌క్తులా న‌వ్వించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. కానీ F2లో లాగా క‌థ‌లో విష‌యంలో లేదు. ఈ సినిమా ఎంతోకొంత ఆడితే అది వెంక‌టేష్ వ‌ల్లే. చైత‌న్య చాలా సీన్స్‌లో తేలిపోయాడు. అది అత‌ని త‌ప్పు కాదు. క‌థంతా వెంక‌టేష్‌దే అయిన‌ప్పుడు ఇక చైత‌న్య చేసేదేముంది?

హీరోయిన్లు ఉండాలి కాబ‌ట్టి ఉన్నారు. వాళ్లుంటే పాట‌లుండాలి. ఇద్ద‌రు హీరోలుంటే ఫైట్స్ ఉండాలి. స్ట‌డీ స‌ర్టిఫికెట్ ఫారాన్ని ఫిల్ చేసిన‌ట్టు పాత ఫార్ములాలే నింపేశారు. మేన‌ల్లుడి కోసం మేన‌మామ సంఘ‌ర్ష‌ణ అనేది పాయింట్ మంచిదే. దాన్ని రొటీన్ సీన్స్‌తో నింప‌డం వ‌ల్ల ప్ర‌తి సీన్ ఎక్క‌డో చూసిన‌ట్టే ఉంటుంది. ఒక సీన్‌లో చెంబు ప‌ట్టుకుపోయే కామెడీ కూడా ఉంది. ఆ ఊళ్లో మ‌రుగుదొడ్ల నిధులని ఎమ్మెల్యే తినేశాడ‌ట‌.

ఇపుడు చెంబు ప‌ట్టుకుపోయే ప‌ల్లెటూళ్లు త‌గ్గిపోయాయి. మ‌న రాజ‌కీయాల పుణ్య‌మా అని మ‌రుగుదొడ్ల నిధులు తినే ఎమ్మెల్యేలు ఎవ‌రూ లేరు. పెద్ద‌పెద్ద కాంట్రాక్టులు , వ్యాపారాలు , రియ‌ల్ ఎస్టేట్ దందాలు చేస్తూ వంద‌ల‌కోట్లు సంపాదిస్తున్నారు. అనేక ఆఫ్రికా దేశాల్లో వీళ్ల‌కు వ్యాపారాలున్నాయి. మ‌రుగుదొడ్ల నిధులు తినే దుస్థితిలో వాళ్లు లేరు. మ‌న ర‌చ‌యిత‌లు ద‌ర్శ‌కులు క‌నీసం పేప‌ర్ కూడా చ‌ద‌వ‌రు. లేదంటే ఈ సినిమా క‌థ 1993లో Open అయిన‌ట్టు వాళ్లు కూడా అక్క‌డే ఆగిపోయారా?
స‌రే క‌థ గురించి కూడా చెప్పుకుందాం. నాజ‌ర్ జాత‌కాల‌ని న‌మ్ముతాడు. జాత‌కాలు క‌ల‌వ‌లేద‌ని కూతురి ప్రేమ‌ను తిర‌స్క‌రిస్తే, ఆయ‌న కొడుకు వెంక‌టేష్ అక్క పెళ్లి జ‌రిపిస్తాడు. నాజ‌ర్ న‌మ్మిన జాత‌కం ప్ర‌కారం ఆ కుర్రాడు త‌ల్లిదండ్రి ప్ర‌మాదంలో చ‌నిపోతారు. జాత‌క న‌ష్టంతో పుట్టిన మ‌న‌వ‌డు త‌న‌కి అవ‌స‌రం లేద‌ని నాజ‌ర్ అంటే మేన‌ల్లుడిని విడిచిపెట్ట‌న‌ని వెంక‌టేష్ అంటాడు.

ఆ త‌ర్వాత మామాఅల్లుళ్ల అనుబంధంపై పాట‌. త‌న కోసం పెళ్లి చేసుకోని మామ‌కు పాయ‌ల్‌రాజ్‌పుత్‌తో పెళ్లి చేయాల‌ని నాగ‌చైత‌న్య త‌లాతోకా లేని కామెడీ. రాశీసింగ్‌తో బ్రేక‌ప్ అయిన అల్లున్ని తిరిగి ఒక‌టి చేయాల‌ని వెంక‌టేష్ కామెడీ. ఇవ్వ‌న్నీ క‌థ‌లో భాగ‌మైతే Ok. కానీ ఎఫిసోడ్స్‌గా వ‌స్తుంటాయి. మ‌ధ్య‌లో రావు ర‌మేష్ విల‌నీ. పాఠ‌శాల కూల్చేసి బీరు ఫ్యాక్ట‌రీ పెట్టాల‌నుకుంటాడు. బీరు ఫ్యాక్ట‌రీకి వంద‌ల ఎక‌రాలు అవ‌స‌రం ఉండ‌దు. ప‌ల్లెటూళ్లో బోలెడు ఖాళీ స్థ‌లాలుంటాయి. దానికి స్కూల్ హాస్ట‌ల్‌ని కూల్చ‌డం ఎందుకో? (అందుకే పేప‌ర్ చ‌ద‌వ‌మ‌నేది!)

పిల్ల‌ల్ని వెంక‌టేష్ ర‌క్షించే ఫైట్ కోసం అనుకోవాలి. సంఘ‌ట‌న‌ల‌తో క‌థ ముందుకు పోతే అది మంచి సినిమా. డైరెక్ట‌ర్ త‌న‌కు అనుగుణంగా సంఘ‌ట‌న‌లు త‌యారు చేయ‌కూడ‌దు. అవి స‌హ‌జంగా జ‌రిగిన‌ట్టు ఉండాలి.

ఈ క‌థ‌ని రంగ‌స్థ‌లంలాగా గ్రామీణ నేప‌థ్యంలోనే తీసుంటే ఎలాగో భ‌రించ‌వ‌చ్చు. పాకిస్తాన్ మీద స‌ర్జిక‌ల్ స్ర్టైక్‌, ఆర్మీ నేప‌థ్యం, బ్రిగేడియ‌ర్‌గా ప్ర‌కాశ్‌రాజ్ ఇవ‌న్నీ క‌ల‌సి ఇంకో సినిమా చూసిన‌ట్టు ఉంటుంది. సినిమాటిక్ లిబ‌ర్టీకి కూడా ఒక హ‌ద్దు ఉంటుంది. క్లైమాక్స్ చూసిన త‌ర్వాత ఏంది మామా ఇది! అనిపిస్తుంది.

14 ఊళ్ల‌కి తెల‌సిన మిల్ట‌రీ నాయుడు , ఆ ఊరి ఎమ్మెల్యే కూతురికి తెలియ‌దు. స‌రే వ‌దిలేద్దాం. డాక్యుమెంట‌రీలు తీద్దామ‌ని వ‌చ్చిన రాశీఖ‌న్నాకి ప‌ల్లెటూళ్ల‌లో చెంబులు తీసుకుని మొక్క‌ల‌కు నీళ్లు పోయ‌ర‌ని తెలియ‌దు. లాజిక్‌లు అడ‌క్క‌పోవ‌డ‌మే క‌మ‌ర్షియ‌ల్ సినిమా ల‌క్ష‌ణ‌మేమో! కొత్త ఆలోచ‌న‌ల‌తో కొత్త ద‌ర్శ‌కులు వ‌స్తున్నారు. వాళ్ల‌ని సురేష్‌బాబే ప్రోత్స‌హిస్తున్నాడు కూడా. 55 ఏళ్ల అనుభ‌వం ఉన్న సంస్థ నుంచి ఏంటి సార్ ఈ అరిగిపోయిన క‌థ‌! స‌మీక్ష‌లు రాసేవాళ్ల‌కి యాజ‌మాన్యాలు డ‌బ్బులు చెల్లించేది రాసినందుకు కాదు, ఉద‌యాన్నే ఇవ‌న్నీ చూసినందుకు.

– Written By GR Maharshi

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి