iDreamPost

చంద్రబాబు అధికారంలోకి వస్తే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా?

చంద్రబాబు అధికారంలోకి వస్తే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా?

చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే వైఎస్సార్‌ సీపీ నేతల ఇళ్లకు వెళ్లి బడిత పూజ చేస్తామని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలను అధికార పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. బుధవారం ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తన గురించి అబద్ధపు ప్రచారం చేయడం అపకపోతే ఆయన ఇంటికి వెళ్లి తాట తీస్తానని అన్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చట్టాన్ని చేతిలోకి తీసుకుని రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తారా? అంటే వారు అధికారాన్ని ప్రజా సంక్షేమం కోసం కాక స్వీయ ప్రయోజనాలకు వినియోగిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని బడిత పూజ చేస్తాం, తాట తీస్తాం వంటి మాటల ద్వారా అనిత అదుపు తప్పి మాట్లాతున్నారని వైఎస్సార్‌ సీపీ నేతలు అంటున్నారు. తాము ఎవరినైనా నోటికొచ్చినట్టు దూషిస్తాం.. తమను ఎవరూ ఏమీ అనకూడదు అంటే ఎలా? ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలపై నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేయడం, దానికి వారు బదులిస్తే వ్యక్తిగత దూషణలకు దిగడం ఏం పద్ధతి? అని ప్రశ్నిస్తున్నారు.

అంత సీన్‌ ఉందా?

టీడీపీ నాయకులు తరచు తాము అధికారంలోకి రాగానే పోలీసుల అంతు చూస్తాం. అధికారుల పనిపడతాం. వైఎస్సార్‌ సీపీ నేతల తాట తీస్తాం అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తున్నారు. అయితే వారికి ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి వచ్చేంత సీన్‌ లేదని వైఎస్సార్‌ సీపీ నేతలు అంటున్నారు. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ కుదేలైపోయింది. 2019 నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో గెలవలేదు. మరి ఏ ప్రాతిపదికన మళ్లీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే అసెంబ్లీపై అలిగి బయటకు వచ్చేయడమే కాక ముఖ్యమంత్రి అయ్యాకే సభలో అడుగుపెడతానని శపథం కూడా చేసేశారు. ఆవేశంలో అలా అనేశారు కాని తమ పార్టీకి జనంలో ఆదరణ లేదన్న సంగతి చంద్రబాబుకు కూడా అర్థమైంది. అనితకే ఇంకా వాస్తవం బోధ పడలేదని అంటున్నారు. చంద్రబాబు తన శపథానికి కట్టుబడితే ఇక ఎప్పటికీ అసెంబ్లీలో అడుగుపెట్టలేరన్న సంగతి గ్రహించాలని సూచిస్తున్నారు.

మరి మీరెందుకు గెలవలేదు అనిత?

ప్రసన్నకుమార్‌రెడ్డి టీడీపీ భిక్షతో మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారని, వైఎస్సార్‌ సీపీలో గుర్తింపు కోసం ఇప్పుడు టీడీపీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తున్న అనిత అదే టీడీపీ భిక్షతో ఆమె రెండోసారి ఎందుకు ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేకపోయారని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డి గెలిచింది తన వ్యక్తిగత సత్తాతోనే తప్ప టీడీపీ పెట్టిన భిక్ష వల్ల కాదని గ్రహించాలి. ఎమ్మెల్యే రోజా నగరిలో పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోగలరా? అని ప్రశ్నిస్తున్న అనిత.. పాయకరావుపేటలో తాను డిపాజిట్‌ కోల్పోకుండా చూసుకోవాలి. రోజా ఇప్పటికి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, మళ్లీ గెలుస్తారన్న విషయంలో తమకు సందేహం లేదని అధికార పార్టీ నాయకులు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి