iDreamPost

గన్నవరం వంశీ పార్టీ మార్పు ఎందుకు?

గన్నవరం వంశీ పార్టీ మార్పు ఎందుకు?

తుఫాను తరువాత ప్రశాంత వాతావరణం నెలకొంటుంది కానీ గత మే నెలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ సునామి సృష్టించిన తరువాత తెలుగుదేశం పార్టీలో తుఫాను మొదలయ్యింది . 

ఎన్నికల తరువాత గడచిన దశాబ్ద కాలంగా చంద్రబాబుకు కుడి,ఎడమ భుజాలుగా వ్యవహరించిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి,సీఎం రమేష్ టీడీపీని వీడి బీజేపీలో చేరారు. టీడిపి తరుపున తెలిచిన 23 మంది శాసనసభ సభ్యులలో 13 మంది గంటా శ్రీనివాస రావ్ నాయకత్వంలో పార్టీని వీడుతారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం సర్దుమణుగుతున్న సమయంలో గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించి బాంబు పేల్చారు. 

సుజనా,సీఎం రమేష్ లను టీడీపీలో కొనసాగించటానికి పెద్దగా ప్రయత్నం చెయ్యని చంద్రబాబు వంశీని నిలువరించటానికి శాయశక్తుల ప్రయత్నం చేశారు.లోక్ సభలో టీడీపీ విప్ పదవిని తిరస్కరించి ,అసంతృప్త నేతగా ముద్రపడ్డ విజయవాడ లోక్ సభసభ్యుడు కేశినేని నానీకి వంశీ పార్టీ వీడకుండా చూసే బాధ్యత అప్పగించారు. చాలా చర్చల తరువాత కూడా వంశీ మెత్తపడకపోవటంతో స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగారు. నిన్న వంశీ లేకుండానే గన్నవరం టీడీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. 

చంద్రబాబుతో సమావేశం ముగిసిన తరువాత కొందరు నాయకులు తిరిగి వంశీ వద్దకు వెళ్లగా విజయ డైరి చైర్మన్ చలసాని ఆంజనేయులు,ఆళ్ల గోపాలకృష్ణ లాంటి నాయకులు టీడీపీతోనే  కొనసాగుతామని ప్రకటించారు. 

వంశీ రాజకీయం 

రాజకీయాల్లో తరచుగా వినిపించే మాట “గుడివాడ నాని ,బెజవాడ రాధ,గన్నవరం వంశీ” ,ఇదో ముగ్గురు మిత్రుల కథ. 

వంశీ రాజకీయప్రవేశం జూనియర్ ఎన్టీఆర్ సహాయ సహాకారాలతో జరిగింది. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ మద్దతుతో 2004లో గుడివాడ టీడీపీ టికెట్ సాధించి గెలిచారు. కొడాలి నాని,వల్లభనేని వంశీ ,వంగవీటి రాధ కృష్ణ, నిర్మాత నల్లమల్లబుజ్జి సన్నిహిత మిత్రులు. 

2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రత్యక్షం ప్రచారం చేశారు. గన్నవరం టికెట్టును తన మితుడైన వంశీకి ఇవ్వాలని జూనియర్ ఎన్టీఆర్ కోరగా ఆయన తండ్రి హరికృష్ణ మాత్రం ఆ టికెట్ దాసరి బాలవర్ధన్ రావుకు ఇవ్వాలని పట్టుపట్టారు. చంద్రబాబు వంశీకి విజయవాడ లోక్ సభ  సీటు, దాసరి బాలవర్ధన్ రావుకు గన్నవరం సీటు ఇచ్చి ఇద్దరికి సర్దుబాటు చేశారు. ఆ ఎన్నికల్లో వంశీ ఓడిపోగా  దాసరి బాలవర్ధన్ రావు గెలిచారు. కానీ వంశీ గన్నవరం మీదనే దృష్టిపెట్టి పనిచేశారు. 

వైసీపీ ఏర్పాటు తరువాత కృష్ణా జిల్లా రాజకీయాల్లో టీడీపీ వర్గ పోరులో నష్టపోయిన కొడాలి నాని  టీడీపీని వీడి వైసీపీ లో చేరారు. వంగవీటి రాధా కూడా వైసీపీలో చేరాడు. వీరిద్దరి మిత్రుడైన వంశీ కూడా వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి బలం ఇస్తూ ఓదార్పు యాత్రలో భాగంగా విజయవాడ వొచ్చిన జగన్ మోహన్ రెడ్డిని బెంజి సర్కిల్ సెంటర్లో వంశి కారు దిగొచ్చి ఆలింగనం చేసుకున్నారు. 

2014 ఎన్నికలను Do or Die అన్నట్లు పోరాడిన చంద్రబాబు వంశీ పార్టీ మారకుండా జాగ్రత్త  తీసుకొని గన్నవరం  MLA టికెట్ వంశీకి  ఇచ్చారు .టీడీపీ అధికారంలోకి వచ్చింది, వంశీ కూడా గెలిచారు కానీ రాజకీయంగా లబ్ధిపొందింది లేదు. గొల్లపూడి మార్కెట్ యార్డ్ తదితర పదవులు కూడా తన అనుచరులకు ఇప్పించుకోలేకపోయారు. 2019 ఎన్నికల ముందు కూడా వంశీ వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఒక దశలో దేవినేని అవినాష్ కు గన్నవరం టికెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది .

2019 ఎన్నికల్లో తిరిగి టీడీపీ గెలుస్తుందన్న నమ్మకమో లేక మరో కారణంతోనే వంశీ టీడీపీలోనే కొనసాగి మొన్న జరిగిన హోరాహోరీ పోరులో 820 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచాడు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి కూడా వంశీ టీడీపీలో కొనసాగుతాడా?అని  గన్నవరం టీడీపీ కార్యకర్తల్లో అనుమానం ఉండేది. 

నకిలీ పట్టాల కేసుకు భయపడకుంటే మరి వంశీ ఎందుకు పార్టీ ఫిరాయిస్తున్నాడు?

వంశీ మీద నకిలీ పట్టాలు పంచారని గత నెలలో కేసు నమోదయ్యింది. వంశీ అది తప్పుడు కేసని,అలాంటి వాటికి భయపడనని ప్రకటించారు.పరిటాల రవి అనుచరుడిగా గుర్తింపున్న వంశీ కేసులకు భయపడతారని అనుకోలేము. వంశీ మీద గతంలో నమోదయిన కేసులు తక్కువే కానీ ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. రాయలసీమకు సంబంధించిన ఒక నాయకుడి హత్యలో వంశీ సహకారం ఉందన్న ప్రచారం ఉంది,గత వారంగా సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త చక్కర్లు కొడుతోంది. 

2014లో వైసీపీ తరుపున గన్నవరం నుంచి పోటీచేసి ఓడిపోయిన దుట్టా రామచంద్ర రావ్ రాజశేఖర్ రెడ్డి కి మెడికల్ కాలేజీ లో సహాధ్యాయి. 2004లో వైస్సార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత హాజరైన తోలి ప్రైవైట్ కార్యక్రమము దుట్టా రామచంద్ర రావు ఆసుపత్రి ప్రారంభోత్సం. దట్టు రామచంద్ర రావు వైసీపీ ఏర్పడ్డప్పటి నుంచి “నా మిత్రుడి కొడుకు” జగన్ అంటూ గన్నవరం బాధ్యతలు తీసుకున్నారు. 2014 ముందు  దుట్టా రామచంద్ర రావు  బావ అయిన మండలి బుద్ధ ప్రసాద్ కాంగ్రెస్ ను వీడి టీడీపీలోకి వెళ్లినా రామచంద్ర రావు వైసీపీ లోనే కొనసాగారు. 

2018లో వయసు రీత్యా క్రియాశీలకంగా వ్యవహరించలేకపోతున్నాని రామచంద్ర రావు బాధ్యతల నుంచి తప్పుకొని కొడాలి నాని ప్రతిపాదించిన యార్లగడ్డ వెంకట్ రావ్ కు వైసీపీ నియోజకవర్గ బాధ్యతలు ఇప్పించారు. యార్లగడ్డ వెంకట రావు గుడివాడ నియోజకవర్గానికి చెందిన వారు. అమెరికాలో సాఫ్ట్వేర్ వ్యాపారం ఉంది. అనేక సంవత్సరాల నుంచి కొడాలి నాని మరొకొందరికి ఆర్ధికంగా సహాయపడుతుండేవాడు. గుడివాడ ప్రాంతంలో ఎడ్ల పోటీలు నిర్వహించటం ఆయనకు హాబీ. 

గన్నవరం నుంచి వంశీ గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు కానీ దాసరి జయరామేష్ సోదరులు, యార్లగడ్డ  వెంకట్ రావు కలిసి వంశీకి చుక్కలు చూపించారు. సహనం కోల్పోయిన వంశీ యార్లగడ్డ వెంకట్ రావ్ కు ఫోన్ చేసి బెదిరించే ధోరణలు మాట్లాడాడు. కౌంటింగ్ రోజు యార్లగడ్డ వెంకట్ రావ్ మీద దాడి జరుగుతుందన్న ప్రచారం కూడా జరిగింది. 

స్థూలంగా వంశీ గన్నవరం పెట్టని కోట కాదు,ఆకోటకు బీటలు వారాయి అని వంశీకి అర్ధమయ్యింది.తన సామాజికవర్గం కూడా మొత్తంగా తనవైపు లేదు,ముఖ్యంగా బాపులపాడు మండలంలో చౌదర్లు వైసీపీ కి మద్దత్తు ఇవ్వటం వలెనే ఎన్నిక ఇంత పోటా పోటీగా జరిగింది. 

వైసీపీ అధికారంలోకి వొచ్చింది కాబట్టి తన ప్రత్యర్థి యార్లగడ్డ గన్నవరంలో పాతుకుపోతారని వంశీకి అర్ధమయ్యింది. మరోవైపు చంద్రబాబు నుంచి తనకు అవసరమైన మద్దతు దక్కదన్న అంచనా వంశీకి ఉంది.రాజకీయంగా నిలబడాలంటే టీడీపీ ని వీడటం అనివార్యం అని వంశీకి అవగతం అయ్యింది. 

 నకిలీ పట్టాల కేసు చాలా చిన్నది,వంశీ దానికి భయపడే పరిస్థితి లేదు. కానీ వంశీకి హైద్రాబాద్ శంకరపల్లి ఏరియాలో ఉన్న 42 ఎకరాల భూమిలో కొంత వివాదంలో ఉంది. వంశీ అఫిడివిట్ ప్రాకారం 42 ఎకరాల భూమి విలువ 76 కోట్లు. అనధికారికంగా వంశీకి ఇక్కడ మరి కొన్ని ఎకరాల  భూమి ఉంది. సుమారుగా 150 కోట్ల విలువైన భూములు ఇక్కడ ఉన్నాయి. వీటిని కాపాడుకోవటానికి తెలంగాణా ముఖ్యమంత్రి సహాయం అవసరం,కెసిఆర్ మద్దతు జగన్ ద్వారానే లభిస్తుందని వంశీ నమ్మినట్లున్నారు. 

ఈ గొడవలతో సంబంధం లేకుండ ,మే 23 న కౌంటింగ్ కొనసాగుతుండగానే “తెలుగు దేశాన్ని కాపాడుకోండన్న”  కొడాలి నాని “మిషన్ టీడీపీ”ని నిర్వహిస్తున్నారా?టీడీపీ లోని తన మిత్రులందరిని వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే వంశీ టీడీపీని వీడాడా?

వంశీ అనుచరులు రెండు రోజుల్లో వైసీపీ లో వంశీ చేరుతాడని చెప్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా వంశీని తమవైపు లాక్కునే ప్రయత్నం చేస్తుందన్న ప్రచారం జరుగుతుంది. 

వంశీ వైసీపీ లో చేరితే జగన్ నిబంధన ప్రకారం ముందు MLA పదవికి రాజీనామా చెయ్యాలి. ఉప ఎన్నికలో వంశీకి వైసీపీ టిక్కెట్ ఇస్తుందా?ఇదే వెయ్యి డాలర్ల ప్రశ్న .  

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి