iDreamPost

టీకా ఎంచుకునే అవకాశం.. నేటి నుంచి రిజిస్ట్రేషన్లు

టీకా ఎంచుకునే అవకాశం.. నేటి నుంచి రిజిస్ట్రేషన్లు

దేశంలో తొలిదశ కోవిడ్ టీకా కార్యక్రమానికి తెర లేచింది. ఈ విడతలో 18 ఏళ్ళు దాటినవారికి టీకాలు వేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. టీకా వేసుకోదలచినవారు కోవిన్ వెబ్ పోర్టల్లో ఈ రోజు నుంచి పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం cowin.gov.in వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ప్రైవేట్ కేంద్రాల్లో టీకా ఛాయిస్

టీకా కార్యక్రమం ముమ్మరం చేయాలన్న లక్ష్యంతో ప్రైవేట్ సెంటర్లలోను వ్యాక్సిన్ వేసే వెసులుబాటు కల్పించారు. టీకా ఉత్పత్తిదారుల నుంచి నేరుగా డోసులు కొనుగోలు చేసే అవకాశం కల్పించిన ప్రభుత్వం.. వాటికి టీకా డోసు ధరను కూడా ఖరారు చేసింది. అలాగే ప్రైవేట్ కేంద్రాల్లో టీకా వేసుకునే పౌరులు తమకు ఏ టీకా కావాలో ఎంచుకునే సౌలభ్యం కూడా కల్పించింది. ఈ మేరకు కోవిన్ వెబ్ సైట్ లో ఈ టీకా ఎన్ని డోసులు అందుబాటులో ఉన్నాయి.. వాటి ధర వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరచాలని ఆదేశించింది. దాంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ లలో తమకు నచ్చిన టీకా ఎంచుకొని.. వేయించుకుని అవకాశం పౌరులకు లభించింది. ప్రైవేట్ కేంద్రాలకే ఇది పరిమితం. ప్రభుత్వ ఆస్పత్రులు, కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సిన్ వేయించుకునే వారికి ఈ వెసులుబాటు లేదు. అక్కడ అందుబాటులో ఉన్న టీకాయే వేసుకోవాల్సి ఉంటుంది.

టీకా సరఫరాపైనే అనుమానాలు

ప్రస్తుతం 45 ఏళ్ళు దాటిన వారికి టీకాలు వేస్తున్నారు. వీరంతా యథావిధిగా నేరుగా కేంద్రాలకు వెళ్లి అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని టీకా వేసుకోవచ్చు. ఈ ఏజ్ గ్రూప్ వారికే టీకా సరిపడినంత సరఫరా కాక పూర్తిస్థాయిలో వేయలేకపోతున్నారు. ఒకటో తేదీ నుంచి వీరితో పాటు 18 ఏళ్ళు దాటినవారికి కూడా వేయాల్సి ఉంటుంది. టీకా డోసులను కేంద్రం అవసరమైన మేరకు సరఫరా చేయలేకపోతోంది. సీరం, బయోటెక్ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న టీకాల్లో సగం కేంద్రమే అట్టిపెట్టుకుంటోంది. మిగతా సగం ఉత్పత్తులనే అన్ని రాష్ట్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులు పోటీ పడి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 18 ఏళ్ళు దాటినవారు సుమారు 2.04 కోట్ల వరకు ఉన్నారు. వీరందరికీ సాధ్యమైనంత త్వరగా టీకాలు వేయించాలన్న కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని నిల్వలు తెప్పించుకునేందుకు అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు చేస్తోంది. ఐదు రోజుల క్రితమే సీఎం జగన్ స్వయంగా సీరం, బయోటెక్ సంస్థల ఎండీ లతో ఫోనులో మాట్లాడారు. ఏపీకి అవసరమైనన్ని నిల్వలు పంపేందుకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఆయన ప్రయత్నాలు ఫలిస్తే అందరికీ టీకా లక్ష్యం తొందరలోనే సాకారమవుతుంది.

Also Read : మీకు18 ఏళ్ళు దాటిందా.. టీకా రిజిస్ట్రేషన్ ఇలా!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి