iDreamPost

మూడు రాజధానుల బాటలో మరో రాష్ట్రం

మూడు రాజధానుల బాటలో మరో రాష్ట్రం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో.. తాజాగా జగన్ బాట లోనే ఉత్తరాఖండ్ లోని బిజెపి ప్రభుత్వం కూడా మూడు రాజధానుల ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా “గెర్సాయిన్” ని ఎంపిక చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ బుధవారం శాసనసభలో ప్రకటించారు. ఇప్పటికే ఉత్తరాఖండ్ హై కోర్ట్ నైనిటాల్ లో కొనసాగుతుంది. దీనితో ఆంధ్రప్రదేశ్ తరహాలో ఉత్తరాఖండ్ కు కూడా పరిపాలన రాజధానిగా డెహ్రాడున్.. శాసన సభ తో కూడిన మరో రాజధానిగా గెర్సాయిన్.. న్యాయ రాజధాని గా నైనిటాల్.. కొనసాగనున్నాయి.

రాజధాని డెహ్రాడున్ నుండి 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న “గెర్సాయిన్” ప్రాంతం ఛమోలీ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇది ప్రముఖ పర్యాటక స్థలం. రాష్ట్ర రాజధాని అయిన డెహ్రాడూన్ నుండి 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న గెర్సాయిన్ ను రాజధానిగా చెయ్యాలని స్థానికుల డిమాండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడక ముందు నుండే ఉంది. అయితే 2000 సంవత్సరం నవంబర్ లో రాష్ట్రం ఏర్పడిన తరువాత, డెహ్రాడూన్ రాష్ట్ర రాజధానిగా మారింది. మరో నగరమైన నైనిటాల్ లో హైకోర్టు ని ఏర్పాటు చేశారు. గెర్సాయిన్ లో 2016 లోనే వేసవి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చెయ్యడానికి తాత్కాలిక శాసనసభని నిర్మించారు. అప్పటినుండి అసెంబ్లీ పలు సెషన్ లు అక్కడే జరుగుతున్నాయి.

2017 లో గెర్సాయిన్ ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా ప్రకటిస్తామని బిజెపి తన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బిజెపికి 57 సీట్లు ఇచ్చి బంపర్ మెజారిటీతో గెలిపించారు. ఉత్తరాఖండ్ రాజకీయ చరిత్రలో మరే ఇతర రాజకీయ పార్టీకి ఇన్ని సీట్లు లభించలేదు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో గెర్సాయిన్ ను శాశ్వత వేసవి రాజధానిగా చేస్తున్నామని ముఖ్యమంత్రి రావత్ ప్రకటించాడు.

ఒకపక్క ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులను ప్రతిపక్షాలు, కొందరు మేధావులు వ్యతిరేకిస్తున్న తరుణంలోనే ఇటీవల కాలంలో జగన్ వాదనకు బలం చేకూర్చేవిధంగా, దేశవ్యాప్తంగా జరుగుతున్నా పలు పరిణామాలు చూస్తే పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అధికార వికేంధ్రీకరణలో భాగంగా ప్రభుత్వానికి సంబందించిన కొన్ని కీలక కార్యాలయాలను ‘బెళగావి’ కి తరలిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప నిర్ణయం తీసుకున్నాడు. మరోవైప జార్ఖండ్ రాష్ట్రం కూడా ఇదే బాటలో పయనించడానికి సిద్ధమైంది. ఈ తరుణంలో బిజెపి పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ కూడా మూడు రాజధానులు ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకోవడంతో.. పరిపాలన, న్యాయపరమైన అంశాలలో జగన్ ప్రభుత్వానికి నైతిక మద్దతు లభించిందని చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి