iDreamPost

శ్రీశైలంలో అర్ధరాత్రి వివాదం.. చిలికి చిలికి గాలివానగా మారి!

శ్రీశైలంలో అర్ధరాత్రి వివాదం.. చిలికి చిలికి గాలివానగా మారి!

శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువైన శ్రీశైల క్షేత్రానికి కన్నడ, మహారాష్ట్ర భక్తులు పోటెత్తారు. బుధవారం నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభం కాగా అంతకన్నా ముందే కన్నడిగులతో దేవస్థానం కిటకిటలాడుతున్నది. గత రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి నేపథ్యంలో కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున రాలేకపోయారు. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి ఆంక్షలు సడలించడంతో ఇంటి దైవాన్ని దర్శించుకునేందుకు కాలినడకన క్షేత్రానికి తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఉగాది పర్వదినం కోసం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి శివ భక్తులు పాదయాత్ర చేస్తూ వస్తారు. ఆయా రాష్ట్రాలను కలుపుతూ ఉండే నల్లమల అడవుల గుండా శ్రీశైలం వైపు వీరు ప్రయాణిస్తారు.

ఈ క్రమంలో ఉగాది సమయంలో నల్లమల అడవులు ఈ పాదయాత్ర చేసే భక్తులతో నిండిపోయి కనిపిస్తుంటుంది. దేవస్థానం అధికారులు నెలరోజుల క్రితం నుంచి కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి అక్కడి దేవాలయాలు, మఠాల వద్ద శ్రీశైల క్షేత్ర దర్శన సమయాలు, ఆలయ నిబంధనలు వివరించి వచ్చారు. అయితే అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో చిన్న గొడవ చినికి చినికి గాలివానగా మారింది. ఓ టీ షాప్ వద్ద కన్నడ భక్తులు, స్థానికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షాపులు , కార్లు, వాహనాల మీద దాడి చేశారు. పాతాళగంగ రోడ్ బీరప్ప సదం వద్ద టీ కొట్టు వద్ద ఘర్షణతో అల్లరి మూకలు రెచ్చిపోయి ఆలయ పరిసరాల్లో, ఈఓ ఆఫీస్ కు వెళ్లే మార్గంలో ఫుట్ పాత్ లపై ఉన్న షాపులు ధ్వంసం చేసి తగులబెట్టారు.

ఈ సమయంలో స్థానికులు చేసిన దాడిలో కన్నడ భక్తుడికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి అదుపు చేశారు. ఆ గాయపడిన భక్తుడిని శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి శ్రీ చెన్న సిద్దరామ శివాచార్య స్వామీజీ పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ పెద్దగా మారిందని, ఇద్దరి భాషలు వేరు అని అందుకే ఇంత తప్పు జరిగిందని అన్నారు. ఇటువంటి సమయంలో ఇరు రాష్ట్రాల వారు కలసి మెలసి ఉండాలని అన్నారు. ఇద్దరు వ్యక్తుల గొడవను ఇరు రాష్ట్రాల గొడవ అనే విధంగా తీసుకురావద్దని , భక్తులందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు. గొడవలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, గొడవల వల్ల పవిత్ర శ్రీశైలానికి చెడ్డ పేరు తీసుకుని రావద్దని ఇరు పక్షాల వారిని కోరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి