iDreamPost

ఏంది సామి ఆ గుండె ధైర్యం జగన్

ఏంది సామి ఆ గుండె ధైర్యం జగన్

‘‘నిండా వయస్సులేదు.. మూతి మీద మీసం పూరా మొలవలేదు.. ఆడి దూకుడేంది.. ఆ కత్తితిప్పుడేంది.. మహామహుల్నే మూడు కడవల నీళ్ళు తాగించేత్తున్నాడ్రా ఆడు’’.. ఈతరం ఫిలింమ్స్‌ బ్యానర్‌పై వచ్చిన ‘యజ్ఞం’ సినిమాలో అప్పుడే చావుతప్పిన విలన్‌.. హీరోను ఉద్దేశించి చెప్పే డైలాగ్‌.

ఈ డైలాగ్‌ని ప్రస్తుత రాజకీయాలకు అన్వయించుకుంటే..  ఏంది సామీ నీ గుండె.. ఆ దూకుడేంది.. పథకాలు ప్రకటించడమేంది.. ఎప్పుడిస్తావో ముందే చెప్పడమేంది.. ఆ తేదీకంటే ముందే అర్హులెవరైనా ఉండే మళ్ళీ దరకాస్తు చేసుకోండి అంటూ అవకాశం ఇవ్వడమేంది.. ఏ పార్టీ వారైనా అర్హత ఉంటే సంక్షేమ పథకం ఇవ్వాల్సిందే అంటూ చెప్పడమేంది.. ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీకి గుక్కతిప్పుకోవడానిక్కూడా అవకాశం ఇవ్వకుండా ఈ సంక్షేమమేంది.. సీయం జగన్‌.. నీకు నువ్వే సాటి అంటున్నారు ఏపీ ప్రజలు. చెప్పినవే కాకుండా, చెప్పనివి కూడా అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న పాలనకు పేరు పెట్టేందుకు అవకాశం లేక ‘రంధ్రాన్వేషణ’లో పడిపోతున్నాయి ప్రతిపక్షాలు.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. డబ్బుల్లేవు. ఉత్త చేతుల్లో మనల్ని బైటకు గెంటేసారు. టెంట్లు వేసుకుని పాలన చేస్తున్నాం. అన్నీ సెట్రైట్‌ చెయ్యాలి. నా అనుభవం చూసే ప్రజలు అవకాశం ఇచ్చారు. నేనే మీకు పెన్షన్‌ ఇచ్చాను, నేనే రోడ్లేసాను. నాకేదైనా వస్తే మీరే నన్ను కాపాడుకోవాలి.. ఇటువంటి మాటలను గత ఐదేళ్ళుగా విన్న రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు యువ సీయం వైఎస్‌ జగన్‌ చేస్తున్న పాలన నిజంగానే కొత్తగా ఉంది. అధికారం చేపట్టింది మొదలు నవశకం మొదలైందని ప్రకటించిందే తడవుగా సంక్షేమ పథకాల అమలులో దూకుడు పెంచడం ప్రతి లబ్దిదారుడికి అనుభవంలోకొచ్చింది.

రాష్ట్రానికి ఆర్ధిక ఇబ్బందులున్నాయని చెప్పుకుంటూ కూర్చుంటే ప్రజలనెవరు పట్టించుకుంటారు. సరిగ్గా ఇదే విషయం మీద వైఎస్‌ జగన్‌ దృష్టి సారించారు. రాష్ట్రంలో ప్రజల ఆర్ధిక స్థితిని కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా వైద్యం, విద్య, మౌలిక వసతుల కల్పనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారు. అదే సమయంలో ఆయా పథకాల అమలులో లోటు పాట్లు కూడా సమీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు సవరించుకుంటూ నేరుగా లబ్దిదారులకే ప్రయోజనం చేకూరేవిధంగా కార్యాచరణతో ముందుకు వెళుతున్నారు. అక్కడక్కడా కొందరు నాయకులు తప్ప రాష్ట్రంతోపాటు దేశం మొత్తం జగన్‌ గురించే చర్చ. ‘ఏంది సామీ నీగుండె..!’

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి