iDreamPost

ట్రంప్ సందేశాన్ని తొల‌గించిన ట్విట‌ర్

ట్రంప్ సందేశాన్ని తొల‌గించిన ట్విట‌ర్

ట్రంప్ వ‌ర్సెస్ ట్విట‌ర్ః ప‌ర‌స్ప‌ర మాట‌ల యుద్ధం

అమెరికాలో న‌ల్ల జాతీయుడు, ఆఫ్రికన్‌- అమెరికన్‌ జార్జ్ ఫ్లాయిడ్ ఘ‌ట‌న త‌రువాత డొనాల్డ్‌ ట్రంప్ వ్య‌వహారిక శైలిపై అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేకత వ్య‌క్తం అవుతుంది. మేథావులు, పారిశ్రామిక వేత్త‌లు, ప్ర‌తిప‌క్ష నేత‌లు, పోలీసులు, మాజీ సైనికాధిప‌తులు, సామాజిక మాధ్య‌మాలు ఇలా ప్ర‌ముఖ‌ల నుంచి సాధార‌ణ ప్ర‌జ‌ల వ‌ర‌కు తీవ్ర స్థాయిలో ట్రంప్‌పై మండిప‌డుతున్నారు. ఆయ‌న నోటి దురుసు వ‌ల్ల‌నే ప‌రిస్థితులు చేయిదాటిపోయాయ‌ని విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతున్నాయి. ఒక‌ప‌క్క క‌రోనా స్వైర్య విహారం చేస్తుంటే…మ‌రోవైపు న‌ల్ల జాతీయుల ఉద్య‌మంతో అమెరికా అట్ట‌డుకుతుంది. మ‌రోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్ల మధ్య వార్‌ కొనసాగుతోంది.

ఇదిలా ఉండ‌గా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌, ట్విట్ట‌ర్ సిఈఓ జాక్‌ డోర్సే మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. జూన్‌ 3వ తేదీన జార్జ్ ఫ్లాయిడ్‌కు నివాళిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన తాజా ట్వీట్‌ను ట్విటర్‌ తొలగించింది. ఫ్లాయిడ్‌కు సంబంధించిన దృశ్యాలు, తన సందేశంతో కూడిన వీడియోను ట్రంప్‌ పోస్ట్‌ చేశారు. అందులోని దృశ్యాల కాపీరైట్‌ తనవేనంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ట్వీట్‌ను తొలగించినట్లు ట్విటర్‌ పేర్కొంది.

అయితే ట్విటర్‌ తీసుకునే నిర్ణయాలు త‌న‌కు వ్యతిరేకంగా ఉండటంతో ట్రంప్‌ మండిపడుతున్నారు. ట్రంప్‌ విడుదల చేసిన వీడియోను కాపీరైట్‌ సమస్య పేరిట ట్విటర్‌ తొలిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విటర్‌ నిర్ణయంపై ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ట్విటర్‌ చర్యలు ప్ర‌తిప‌క్ష డెమోక్రట్స్‌కు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయన్నారు. ‘‘శాంతి యుతంగా నిరసనలు తెలుపుతున్న వారికి ట్రంప్‌ సానుభూతి తెలుపుతున్నారు. వాళ్లు(ట్విటర్‌) రాడికల్‌ లెఫ్ట్‌ డెమోక్రట్స్‌ కోసం పోరాడుతున్నారు. ఒకరి పక్ష్యం వహిస్తున్నారు. సెక్షన్‌ 230 ప్రకారం ఇది అక్రమం’’ అంటూ ఓ పత్రిక ప్రచురించిన వార్తను ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. అనంతరం యుఎస్ చ‌ట్టం ‘‘ఇంటరాక్టివ్‌ కంప్యూటర్‌ సర్వీస్‌’’ను ట్రంప్ గుర్తు చేశారు.

అయితే దీనిపై ట్విటర్‌ వేదికగా స్పందించిన ట్విటర్ సిఈఓ జాక్‌ డోర్సే ‘‘ట్రంప్‌ ట్వీట్‌పై కాపీరైట్‌ సమస్య వచ్చింది. ఓ వ్యక్తి దానిపై ఫిర్యాదు చేశాడు. అందుకే దాన్ని తొలిగించాము. ఆయన ఆరోపణలు నిజం కాదు.. అక్రమం అంతకంటే కాదు’’ అని పేర్కొన్నారు.

న్యాయం జరగకుంటే శాంతి ఉండదు

పోలీసు అధికారి కర్కశానికి ఆఫ్రికన్‌-అమెరికన్‌ జాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ బలైన ఉదంతంపై… అగ్రరాజ్యంలో ఎగిసిన నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. న్యూయార్క్‌, వాషింగ్టన్‌, షికాగో, లాస్‌ ఏంజెలెస్‌లో తాజాగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ‘‘న్యాయం జరగకుంటే శాంతి ఉండదు’’ అని ఆందోళనకారులు నినదించడంతోపాటు ‘‘8.46’’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. మే 25న జార్జి ఫ్లాయిడ్‌ మెడపై పోలీసు అధికారి మోకాలితో 8.46 నిమిషాలపాటు బలంగా అదిమి అతని మృతికి కారణమైన సంగతి తెలిసిందే.

మినియా పోలిస్‌ నగరంలో జూన్ 4న‌ రాత్రి ఫ్లాయిడ్‌ సంస్మరణ కార్యక్రమం ఉద్విగ్నభరితంగా సాగింది. రెవరెండ్‌ షార్ప్‌టన్‌ మాట్లాడుతూ- ‘‘ఫ్లాయిడ్‌ కథ నల్ల జాతీయులందరిది. 401 సంవత్సరాలుగా…మన కలలన్నీ మోకాళ్ల కింద నలిగిపోతున్నాయి. మనం ఊపిరి పీల్చలేకపోతున్నాం. మా మెడల పైనుంచి మీ మోకాళ్లను తీసేయండని చెప్పాల్సిన తరుణం వచ్చింది’’ అని అన్నారు.

పోలీసు, న్యాయ వ్యవస్థల్లో తక్షణం సంస్కరణలు తీసుకురావాలంటూ వారంతా గొంతెత్తారు. నార్త్‌ కరోలినాలోని రీఫోర్డ్‌కు ఫ్లాయిడ్‌ శవపేటిక జూన్ 6న చేరింది. అక్కడ జరిగే జ్ఞాపకార్థ ప్రార్థనల్లో కుటుంబ సభ్యులు పాల్గొంటారు. ‘‘ఫ్లాయిడ్‌ కుటుంబానికి మరోసారి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. ఇలాంటి సంక్లిష్ట సమయం నుంచి బయటపడి శాంతి నెలకొనాలని ఆశిస్తున్నా’’ అని ప్రథమ మహిళ మెలనియా ట్రంప్‌ పేర్కొన్నారు.

మ‌రోవైపు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యోదంతాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో పాల్గొన్నారు. అంగరక్షకులు వెంటరాగా.. నలుపు రంగు మాస్కు ధరించి.. మోకాళ్లపై కూర్చుని జార్జ్‌కు న్యాయం జరగాలన్న నిరసనకారులకు సంఘీభావం ప్రకటించారు. పార్లమెంటు ఆవరణలో జరిగిన ‘‘నో జస్టిస్‌- నో పీస్‌’’(న్యాయం జరగకుంటే శాంతి ఉండదు) కార్యక్రమానికి హాజర‌య్యారు. అయితే జాతి వివక్షకు వ్యతిరేకంగా ఉపన్యసించిన పలువురు వక్తలను ఆయన ప్రశంసించినట్లు సిఎన్‌ఎన్‌ వెల్లడించింది.

మ‌రోవైపు వాషింగ్టన్‌లో ఆందోళనకారులపై బాష్పవాయువును ప్రయోగించడాన్ని ఆక్షేపిస్తూ… అమెరికా పౌర హక్కుల సమాఖ్య, మరికొన్ని సంస్థలు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు అటార్నీ జనరల్‌ విలియం బార్‌ తదితర ఉన్నతాధికారులపై కొలంబియా డిస్ట్రిక్ట్‌ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి