iDreamPost

మూసివేస్తాం – ట్విట్టర్‌కు ట్రంప్ బెదిరింపు…కౌంటర్ ఇచ్చిన ట్విట్టర్ సీఈవో

మూసివేస్తాం – ట్విట్టర్‌కు ట్రంప్ బెదిరింపు…కౌంటర్ ఇచ్చిన ట్విట్టర్ సీఈవో

సోషల్‌ మీడియా దిగ్గజ సంస్థలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరింపులకు దిగారు. తాను ట్విట్టర్‌లో పెట్టిన ఒక పోస్టును ట్విట్టర్‌ సంస్థ మొదటి సారిగా ఫాస్ట్‌చెక్‌ చేసిన నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యానిస్తూ ‘ సోషల్‌ మీడియా సంస్థలను గట్టిగా నియంత్రిస్తాం లేదా మూతపడేలా చేస్తాం’ అని అన్నారు. సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాంలు కన్సర్వేటివ్‌ల గొంతులను పూర్తిగా నొక్కేస్తున్నాయని రిపబ్లికన్లు అనుకుంటున్నారని, దీన్ని భవిష్యత్తులో కొనసాగేందుకు అనుమతించేది లేదని ట్రంప్‌ బెదిరించారు.

ఇటీవలి ట్రంప్‌ చేసిన ఒక పోస్టుకు ట్విట్టర్‌ సంస్థ ‘వార్నింగ్‌ లేబుల్‌’ను జతచేసింది. పోలింగ్‌ సమయంలో మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్ల ద్వారా ఓటర్లకు మోసం జరుగుతుందంటూ ట్రంప్‌ నిరాధారమైన ఆరోపణలు చేస్త్తున్నారని పాఠకులను హెచ్చరించింది. సోషల్‌ మీడియా సంస్థలను మూసివేస్తామని ట్రంప్‌ ఏ అధికారంతో చెబుతున్నారో స్పష్టత లేదని స్థానిక మీడియా పేర్కొంది. ట్రంప్‌ ఆరోపణలను ట్విట్టర్‌ సంస్థ ఒక ప్రకటనలో తోసిపుచ్చింది. ట్రంప్‌ వ్యాఖ్యలను యథాతథంగా ఇచ్చామని అది పేర్కొంది.

ట్రంప్‌కు ట్విట్టర్‌ సిఇవో కౌంటర్‌

ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమలు చేస్తున్న మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌ ప్రక్రియపై ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోపంగా ఉన్నారు. ఈ ప్రక్రియ ఎన్నికల రిగ్గింగ్‌కు దారితీస్తుందంటూ ఆయన చేసిన ట్వీట్‌ దుమారం రేపుతోంది. ఈ ట్వీట్‌ను ట్యాగ్‌ చేసిన ట్విట్టర్‌ మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌కు సంబంధించిన వాస్తవాలు అంటూ ఓ లింక్‌ను ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్‌ తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ట్విట్టర్‌ లాంటి సామాజిక మాధ్యమాలను నిషేధిస్తాం అంటూ ప్రకటించారు.

దీనిపై ట్విట్టర్‌ సిఇవో జాక్‌ డొర్సి స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా జరిగే చర్యలకు కంపెనీగా ఎవరైనా బాధ్యత వహించాల్సి వస్తే అది తాను మాత్రమేనని అన్నారు. తమ కంపెనీ ఉద్యోగుల జోలికి మాత్రం రావద్దని ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థలో అసత్యాలు, వివాదస్పద సమాచారంపై తమ పోరాటం కొనసాగుతుందని ట్రంప్‌ కు ఘాటుగా సమాధానమిచ్చారు. ఒకవేళ తాము ఏమైనా తప్పు చేసి ఉంటే దాన్ని అంగీకరిస్తామని ట్వీట్‌ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి