iDreamPost

సంపూర్ణంగా టీడీపీ చేతుల్లోకి టీవీ5!

సంపూర్ణంగా టీడీపీ చేతుల్లోకి టీవీ5!

తెలుగు మీడియాలో టీడీపీకి తిర‌గులేని ఆధిక్యం ఉండేది ఒక‌నాడు. కానీ రానురాను ప‌రిస్థితి మారుతోంది. సాక్షి రాక‌తో ప్రింట్ మీడియాలోనూ, టీవీ9 చేతులు మార‌డంతో ఎల‌క్ట్రానిక్ మీడియాలోను మార్పులు స్ప‌ష్టం అవుతున్నాయి. అదే స‌మ‌యంలో టీడీపీ రాజ‌కీయంగా ప‌ట్టు కోల్పోతుండ‌డం కూడా మ‌రో కార‌ణంగా మారుతోంది. ఈ ప‌రిణామాల‌తో మీడియా ప‌రంగా త‌మ‌కు బ‌ల‌మైన ఆయుధంగా ఉన్న విష‌యంలో ప‌ట్టు కోసం చంద్ర‌బాబు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకు అనుగుణంగా గ‌తంలో ఏబీఎన్ పోషించిన పాత్ర‌ను ఇప్పుడు టీవీ5 అందుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

అయితే అది టీడీపీ వ్యూహాత్మ‌క వైఖ‌రి మూలంగానే జ‌రిగింద‌ని కొంద‌రి అభిప్రాయం. ముఖ్యంగా ఏబీఎన్ చానెల్ క్రెడిబులిటీ పూర్తిగా కోల్పోయింది. దాంతో రాధాకృష్ణ చానెల్ ఎన్ని రంకెలు వేసినా జ‌నం ఖాత‌రు చేయ‌డం లేదు. ఆయ‌న ప‌త్రిక‌లో రాత‌ను కూడా ప‌ట్టించుకుంటున్న పాపాన పోవ‌డం లేదు. ఈ విష‌యాన్ని టీడీపీ కూడా గుర్తించింది. అందులో భాగంగానే ఏబీఎన్ కి బ‌దులుగా టీవీ5 దూకుడు పెంచాల‌ని నిర్ణ‌యించారు. అందుకు అనుగుణంగానే చిత్తూరు జిల్లాకు చెందిన బీఆర్ నాయుడి యాజ‌మాన్యంలోని టీవీ5 స్వ‌రం పెంచింది. నేరుగా జ‌గ‌న్ పై విమ‌ర్శ‌ల జ‌డివాన గుప్పిస్తోంది. అమ‌రావ‌తి వంటి విష‌యాల్లో నేరుగా ఉద్య‌మ భాగ‌స్వామి అవుతోంది.

అదే స‌మ‌యంలో టీవీ5 నిర్వహ‌ణ‌లో కూడా మార్పులు జ‌రుగుతున్నాయి. తాజాగా చానెల్ ఎడిట‌ర్ గా ఉన్న ఆకుల దినేష్ రాజీనామా చేశారు. యాజ‌మాన్యం వైఖ‌రితో పాటుగా ఇత‌ర కార‌ణాలు కూడా క‌లిసి రావ‌డంతో ఆయ‌న టీవీ5కి గుడ్ బై చెప్పేశారు. దాంతో ఆయ‌న స్థానంలో కొత్త ఎడిట‌ర్ ని నియ‌మించుకోవాల్సిన ప‌రిస్థితి ఉత్ప‌న్నం కావ‌డంతో ఇప్ప‌టికే ఎగ్జిక్యూటివ్ ఎడిట‌ర్ గా ఉన్న రావిపాటి విజ‌య్ కి ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించింది యాజ‌మాన్యం. త‌ద్వారా టీడీపీ స్వ‌రం మ‌రింత బ‌లంగా వినిపించే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టు సంకేతాలు ఇస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన విజ‌య్ తొలుత ఈటీవీలోనూ త‌ర్వాత టీవీ5లో బాధ్య‌త‌ల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తార‌ని పేరుంది. ఉద‌యం పూట ఆ చానెల్ చ‌ర్చ‌ల్లో విజ‌య్ ధోర‌ణి మీద ఇత‌ర పార్టీల నేత‌లు ప‌లుమార్లు విమ‌ర్శ‌లు కూడా గుప్పించారు.

ఇక ఇప్పుడు విజ‌య్ క‌నుస‌న్న‌ల్లో టీవీ5 ఎడిటోరియ‌ల్ వ్య‌వ‌హారాలు సాగ‌బోతున్న నేప‌థ్యంలో టీడీపీకి మ‌రింత అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు అంతా భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబుతో విజ‌య్ కి ఉన్న బంధం కూడా దానికి తోడ్ప‌డుతుంద‌ని అంచ‌నాలు వేస్తున్నారు. ఇప్ప‌టికే దుందుడుకుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు పేరున్న ఈ చానెల్ ఇక ఇప్పుడు ఇంకెంత‌గా విజృంభిస్తుంద‌న్న‌ది చూడాల్సి ఉంది. అయితే చానెల్ తీరుని జ‌నం మాత్రం హ‌ర్షించే అవ‌కాశం ఉందా అంటే సందేహంగానే క‌నిపిస్తోందని చెప్ప‌వ‌చ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి