iDreamPost

వేల కోట్ల ఆస్తుల‌పై అప్ర‌మ‌త్త‌మైన టిటిడి

వేల కోట్ల ఆస్తుల‌పై అప్ర‌మ‌త్త‌మైన టిటిడి

కోట్ల విలువ చేసే ఆస్తులు ప‌రిర‌క్షించుకునేందుకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అప్ర‌మ‌త్త‌మైంది. ఇప్ప‌టికీ మేల్కోక‌పోతే వేలాది కోట్ల టిడిపి ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవ‌కాశం ఉండ‌టంతో ఇప్పుడు ప‌రుగులుపెడుతోంది.

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంకు చెందిన ఆస్తులు తిరుప‌తిలో ఉంటాయి. అయితే ద‌శాబ్దాల క్రితం శ్రీ‌స్వామి అమ్మ‌వార్ల సేవ‌లో ఉన్న ఆచార్యుల‌కు ఇనాం కింద ఇస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే వేంక‌టేశ్వ‌ర‌స్వామి కీర్తన‌లు ఆల‌పిస్తున్న అన్న‌మాచార్యుల వంశ‌స్తుల‌కు 1865లో తిరుప‌తిలోని కొంత భూమిని ఇనాం కింద ఇచ్చారు. ద‌శాబ్దాల పాటు వీరు, వీరి వంశ‌స్తులు సాగుచేసుకుంటూ వ‌చ్చారు. ఆ త‌ర్వాత వీరు 1927లో వేరే వ్య‌క్తుల‌కు శాశ్వ‌త లీజు కింద ఇచ్చారు.

ఇక్క‌డే స‌మ‌స్య మొద‌లైంది. ఇలా శాశ్వ‌త లీజు పొందిన వారు రెవెన్యూ శాఖ నుంచి రైత్వారీ ప‌ట్టా పొందారు. ఆ త‌ర్వాత ఆ భూములు ఒక‌రి నుంచి ఒక‌రికి మారుతూ వ‌స్తున్నాయి. అయితే కొన్నేళ్ల త‌ర్వాత ఈ భూముల విష‌యంలో టిటిడి విచార‌ణ చేసింది. ఇనాం భూముల‌కు రైత్వారీ ప‌ట్టాలు ఇవ్వ‌డంపై 1945లో చంద్ర‌గిరి క‌లెక్ట‌ర్‌ను ఆశ్ర‌యించింది. 2002లో ఇది సీసీఎల్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డంతో.. చిత్తూరు ఇనాం డిప్యూటీ త‌హ‌శీల్దార్‌కు విచార‌ణకు విచార‌ణ‌కు ఇచ్చారు. అప్ప‌టి నుంచి దీనిపై పూర్తి స్థాయిలో ప‌రిశీల‌న త‌ర్వాత తిరుప‌తిలోని 188.32 ఎక‌రాల భూమి టిటిడికి చెందిందంటూ 2019 ఆగ‌ష్టులో తీర్పు వ‌చ్చింది.

ప్ర‌స్తుతం దీన్ని పూర్తి స్థాయిలో ఆదీనంలోకి తీసుకునేందుకు టిటిడి చ‌ర్య‌లు చేప‌ట్టింది. భూమిలో 81.86 ఎక‌రాలు ఖాలీగా ఉండ‌టంతో వీటిలో ఎలాంటి నిర్మాణాలు జ‌ర‌గ‌కుండా నిషేధించాల‌ని కార్పోరేష‌న్‌, తుడా అధికారుల‌కు వివ‌రాలు అంద‌జేసింది. టిటిడి భూములు 6, 8ఏ1, 8ఏ2, 9, 12, 623, 4073 స‌ర్వేనంబ‌ర్ల‌లో 188.32 ఎక‌రాలుండ‌గా.. ఇందులో 81.86 ఎక‌రాల భూమి ఖాలీగా ఉంది. ఈ ఖాలీగా ఉన్న భూమికి కంచె వేసేందుకు ఇప్ప‌టికే అధికారులు చ‌ర్య‌లు ప్రారంభించారు. దీంతో పాటు ఈ భూమికి సంబంధించి కార్పోరేష‌న్‌కు చెల్లించే ప‌న్నులు కూడా తితిదే పేరుతోనే ఇవ్వాల‌ని అధికారుల‌ను తితిదే కోరింది. ఖాలీగా ఉన్న భూములు వేల కోట్ల విలువ చేసే నేప‌థ్యంలో వీటిని ప‌రిర‌క్షించుకునేందుకు అధికారులు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఇక రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో తితిదేకు సంబంధించిన కొన్ని స‌ర్వే నంబ‌ర్లు మాత్ర‌మే ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించిన మరికొన్ని స‌ర్వే నంబర్లు కూడా రిజిస్ట్రేష‌న్ శాఖ‌కు ఇచ్చి నిషేదిత జాబితాలో చేర్చాల‌ని కోరింది. ఇందుకోసం ఇప్ప‌టికే దేవాదాయ‌శాఖ నుంచి రిజ‌స్ట్రేష‌న్ శాఖ‌కు నిషేధిత జాబితాలో చేర్చాలని ఆదేశాలు ఇచ్చారు. మొత్తం మీద వేలాది కోట్ల టిటిడి విలువైన ఆస్తులు కాపాడుకునేందుకు ప‌నులు వేగ‌వంతం అయ్యాయ‌ని చెప్పొచ్చు. ఖాలీగా ఉన్న భూములపై యాజ‌మాన్య హ‌క్కులు పొందేందుకు సాంకేతికంగా అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టింది టిటిడి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి