iDreamPost

1987 నుంచే హైదరాబాద్‌లో ఐటీ ఉంది.. చంద్రబాబుపై కేటీఆర్‌ సెటైర్లు!

  • Published Aug 04, 2023 | 4:00 PMUpdated Aug 04, 2023 | 4:00 PM
  • Published Aug 04, 2023 | 4:00 PMUpdated Aug 04, 2023 | 4:00 PM
1987 నుంచే హైదరాబాద్‌లో ఐటీ ఉంది.. చంద్రబాబుపై కేటీఆర్‌ సెటైర్లు!

రాష్ట్రం విడిపోయి పదేళ్లు అవుతున్నా సరే ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి హైదరాబాద్‌ మీద ప్రేమ తగ్గడం లేదు. సందర్భం దొరికిన ప్రతి సారి..హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని.. తన కృషి వల్లే భాగ్యనగరంలో ఐటీ రంగం అభివృద్ధి చెందింది అంటూ డబ్బా కొట్టుకుంటారు. ఆఖరికి ఏపీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో కూడా హైదరాబాద్‌ ప్రస్తావన లేకుండా మాట్లాడరు. సైబరాబాద్‌ను, హైటెక్ సిటీని తానే డెవలప్ చేశానని.. హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీది కీలక పాత్ర పోషించాయని పదే పదే డబ్బు కొట్టుకుంటారు.

ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. చంద్రబాబుపై సెటైర్లు వేశారు. చాలా కాలం క్రితమే హైదరాబాద్‌లో ఐటీ రంగానికి పునాదులు పడ్డాయన్నారు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల రెండో రోజున కేటీఆర్‌ సభలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. 27 ఏళ్లల్లో సాధించిన ఐటీ వృద్ధిని.. తాము ఒక్క ఏడాదిలోనే చేసి చూపామని తెలిపారు కేటీఆర్‌.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌లో ఐటీ మేమే తెచ్చాం అని కొందరు నిత్యం డబ్బా కొట్టుకుంటారు. కానీ వారు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే.. 1987లోనే హైదరాబాద్‌లో తొలి ఐటీ బిల్డింగ్ వచ్చింది. అప్పటి నుంచే హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి జరిగింది. 1987లోనే బేగంపేటలో ఇంటర్ గ్రాఫ్ అనే ఐటీ సంస్థ ఏర్పాటయ్యింది. ఈ విషయం గుర్తిస్తే మంచిది. ఇక బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఐటీ ఎగుమతులు భారీగా పెరిగాయి. కానీ మేం దీని గురించి పెద్దగా ప్రచారం చేసుకోము’’ అంటూ పరోక్షంగా చంద్రబాబు నాయుడి మీద కేటీఆర్‌ సెటైర్లు వేశారు.

‘‘1987 నుంచి 2014 వరకు 27 ఏళ్లలో హైదరాబాద్ ఐటీ ఎగుమతుల పరిమాణం రూ.56 వేల కోట్లు. తెలంగాణ ఏర్పాటైనప్పుడు హైదరాబాద్ ఐటీ ఎగుమతుల విలువ సుమారు రూ.56 వేల కోట్లు. కానీ 2022-23లో ఒక్క ఏడాదిలోనే రూ.57,707 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులను తెలంగాణ సాధించింది. 27 ఏళ్లలో చేసింది.. కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే చేసి చూపించింది. అయినా మేం దీని గురించి ప్రచారం చేసుకోము’’ అన్నారు కేటీఆర్‌.

బెల్లంపల్లిలోనూ ఐటీ కంపెనీలు..

బెల్లంపల్లిలో కూడా రెండు ఐటీ కంపెనీలు ఉన్నాయని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనతో చెప్పారని కేటీఆర్ వెల్లడించారు. ‘‘బెల్లంపల్లి హైదరాబాద్ నుంచి 250 కి.మీ. దూరంలో ఉంటుంది. అక్కడ ఒక్క ఇంజినీరింగ్ కాలేజీ కూడా లేదు. అలాంటి బెల్లంపల్లిలో స్థానికులు.. సనాతన అనలిటిక్స్, వాల్యూ పిచ్ అనే రెండు ఐటీ కంపెనీలను ఏర్పాటు చేశారు. ఈరెండు కంపెనీలు సుమారు 300 మందికి ఐటీ ఉద్యోగాలు కల్పిస్తున్నాయి’’ అని తెలిపారు కేటీఆర్‌.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి