iDreamPost

ముగ్గురు భారతీయ అమెరికన్లను కీలక పదవులకు ఎంపిక చేసిన ట్రంప్

ముగ్గురు భారతీయ అమెరికన్లను కీలక పదవులకు ఎంపిక చేసిన ట్రంప్

ఫెడరల్‌ కోర్టు జడ్జిగా సరిత కోమటిరెడ్డి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ముగ్గురు భారతీయ అమెరికన్లను కీలక పదవులకు నామినేట్‌ చేశారు. న్యూయార్క్‌లోని ఓ ఫెడరల్‌ కోర్టు జడ్జి పదవితో పాటుగా ప్రపంచ బ్యాంకులో రుణాలు అందించే విభాగమైన అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకుకు అమెరికా ప్రతినిధి పదవి మరియు పారిస్‌ కేంద్రంగా పనిచేసే ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ)కు తన రాయబారి పదవులకు భారతీయ అమెరికన్లను ట్రంప్ నామినేట్ చేశారు.

ప్రముఖ మహిళా న్యాయవాది సరిత కోమటిరెడ్డిని న్యూయార్క్‌లోని ఫెడరల్‌ కోర్టు జడ్జి పదవికి ట్రంప్ నామినేట్ చేశారు. హార్వర్డ్‌ లా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన సరిత కోమటిరెడ్డి ప్రస్తుతం న్యూయార్క్‌ ఈస్టర్న్‌ డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయంలో జనరల్‌ క్రైమ్స్‌ విభాగం డిప్యూటీ చీఫ్‌గా ఉన్నారు. గతంలో 2018 జూన్‌ నుంచి గత ఏడాది జనవరి వరకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు, నగదు అక్రమ చలామణీ నిరోధక సంస్థకు తాత్కాలిక డిప్యూటీ చీఫ్‌గా పనిచేశారు. ప్రతిష్ఠాత్మక కొలంబియా లా స్కూల్‌లో న్యాయశాస్త్ర పాఠాలను కూడా సరిత కోమటిరెడ్డి బోధిస్తుంటారు. అమెరికా డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఫర్‌ ది ఈస్టర్న్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌’కు జడ్జిగా ట్రంప్ సరితా కోమటిరెడ్డిని నామినేట్ చేయడం విశేషం.

కాగా మరో రెండు కీలకపదవులకు, భారతీయ అమెరికన్‌ న్యాయవాది అశోక్‌ మైఖేల్‌ పింటోను ప్రపంచ బ్యాంకులో రుణాలు అందించే విభాగమైన అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకుకు అమెరికా ప్రతినిధిగాను, భారతీయ అమెరికన్‌ సీనియర్‌ దౌత్యవేత్త మనీషాసింగ్‌ను పారిస్‌ కేంద్రంగా పనిచేసే ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ)కు తన రాయబారిగా ట్రంప్ నామినేట్ చేయడం గమనార్హం..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి