iDreamPost

టాలీవుడ్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి?

టాలీవుడ్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి?

ఆగస్ట్ 1 నుంచి షూటింగులు ఆపేయబోతున్నట్టు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం తీసుకోవడం పెద్ద సంచలనమే అయ్యింది. అందులోని సభ్యులకు మాత్రమే ఇది వర్తిస్తుందని అందరూ ఫాలో అవ్వాల్సిన రూల్ లేదని కొందరు అంటున్నప్పటికీ మొత్తంగా చూస్తే ఇది తీవ్ర ప్రభావం చూపించే పరిణామమే. ఎందుకంటే చాలా సినిమాల చిత్రీకరణలు కీలక దశలో ఉన్నాయి. అవి టైంకి పూర్తి చేస్తే కానీ ఆల్రెడీ ప్రకటించిన రిలీజ్ డేట్లను అందుకోలేవు. ఏజెంట్, గాడ్ ఫాదర్ లాంటి భారీ చిత్రాలతో మొదలుపెట్టి నేను మీకు బాగా కావాల్సిన వాడిని లాంటి బడ్జెట్ మూవీస్ దాకా చాలా మటుకు ఇబ్బందుల్లో ఇరుక్కుంటాయి. అందులోనూ బంద్ ఎప్పటిదాకో చెప్పలేదు.

ఈ నేపథ్యంలో సుమారు 78 ప్రొడ్యూసర్లు బంద్ కు అంగీకారం తెలిపారట. అయితే అది ఎన్ని రోజులు అనే క్లారిటీ మాత్రం రాలేదు. టికెట్ రేట్లకు సంబంధించి ముఖ్యంగా నైజామ్ లో అడ్డుఅదుపు లేకుండా పోవడాన్ని కీలకంగా గుర్తించిన సభ్యులు మల్టీప్లెక్సుల్లోనూ ఇకపై 150 రూపాయల లోపే ఉండేలా పలు సవరణలు తీసుకురాబోతున్నారు. అంతే కాదు ఆరుగురు స్టార్ హీరోలను మినహాయించి మిగిలిన వాళ్ళ పారితోషికాలు, స్టాఫ్ పేరుతో సిబ్బంది ఖర్చులన్నీ నిర్మాతల తలమీద వేయడాలు లాంటి వాటికి బ్రేక్ వేయబోతున్నట్టుగా తెలిసింది. పెట్టేవాడు ఉన్నాడు కదాని క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం ఈ మధ్య వ్యయాన్ని విపరీతంగా పెంచేస్తున్నారట.

ఇంకో వారం పది రోజులు ఆగితే తప్ప దీనికి సంబంధించిన క్లియర్ పిక్చర్ వచ్చేలా లేదు. అయినా రిలీజులు ఆపితే ఫలితం ఉంటుంది కానీ ఇలా షూటింగులు బంద్ చేస్తే ఏంటి ప్రయోజనమని అడుగుతున్న వాళ్ళు లేకపోలేదు. కొన్ని అంశాల పట్ల సభ్యులకే ఇంకా ఏకాభిప్రాయం రాలేదని అంటున్నారు. థియేటర్లకు జనం ఎందుకు రావడం లేదనే విషయం మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరాన్ని ఇండస్ట్రీ పెద్దలు గుర్తించిన మాట వాస్తవం. నాలుగు నుంచి పది వారాల ఓటిటి నిబంధనను సైతం ఎంతమేరకు కఠినంగా అమలు చేస్తారనేది వేచి చూడాలి. ఆగస్ట్ నెల పరిశ్రమకు చాలా కీలకం కానున్న మాట వాస్తవం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి