iDreamPost

పనబాక లక్ష్మి అభ్యర్థిత్వం బాబుకి బూమరాంగ్ అవుతుందా..?

పనబాక లక్ష్మి అభ్యర్థిత్వం బాబుకి బూమరాంగ్ అవుతుందా..?

కాలం కలిసిరానప్పుడు ఎంతగా కష్టపడినా అన్నీ బెడిసికొడుతూనే ఉంటాయి. ప్రయత్నాలన్నీ విఫలమవుతూనే ఉంటాయి. అందులోనూ చేజేతులా పరిస్థితులని పీకల మీదకు తెచ్చుకున్నప్పుడు మరింత సమస్యగా మారుతుంది. సరిగ్గా ఇప్పుడు చంద్రబాబుది అలాంటి పరిస్థితే. ఆయన ఏం చేసినా చెల్లుబాటు కావడం లేదు. సామాన్యులు స్వీకరించడం లేదు. చివరకు పార్టీ శ్రేణులకు రుచించడం లేదు. దాంతో బాబుకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా తిరుపతి ఉప ఎన్నికల వ్యవహారం ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎట్టకేలకు పనబాక లక్ష్మి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పటికీ వస్తున్న స్పందనలతో టీడీపీ కార్యకర్తల నైరాశ్యం బయటపడుతోంది. గట్టి పోటీ ఇవ్వగలమా అనే సందేహాలు చుట్టుముడుతున్నాయి.

తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రభావం చూపాలని టీడీపీ ఆశిస్తోంది. మొన్నటి సాధారణ ఎన్నికల ఓటమి నుంచి బయటపడేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడాలని భావిస్తోంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావిస్తున్న టీడీపీకి అది కఠిన పరీక్ష కాబోతోంది. ఇప్పటికే 80 శాతం మంది జగన్ కి దూరమయ్యారని బాబు లెక్కలు వేస్తున్న నేపథ్యంలో వాటిని పరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది. అందులోనూ చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన నియోజకవర్గం కావడంతో మరింత కీలకంగా మారింది. ఈ పరిస్థితుల్లో తొలుత పోటీ నుంచి ఉపసంహరించుకోవాలనే ఆలోచన వచ్చినప్పటికీ బీజేపీ కారణంగా మళ్లీ బరిలో దిగినట్టు భావిస్తున్నారు. పోటీ నుంచి తప్పుకుంటే బీజేపీ వర్సెస్ వైఎస్సార్సీపీగా మారిపోయే రాజకీయాల్లో తాము కార్నర్ అయిపోతామని కలత చెందడంతో కష్టంగానయినా రంగంలో దిగే యోచన చేసినట్టు కనిపిస్తోంది.

మొన్నటి సాధారణ ఎన్నికల్లో భారీ తేడాతో ఓటమి పాలయిన పనబాక లక్ష్మిని చంద్రబాబు తమ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ టీడీపీ శ్రేణులకు ఈ నిర్ణయం అంగీకారయోగ్యంగా కనిపించడం లేదు. ఇప్పటికే అనేక మంది పెదవి విరుస్తున్నారు. బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత కనీసం పనబాక లక్ష్మి ఒక్క ప్రకటన కూడా చేసిన దాఖలాలు లేవు. టీడీపీ నేతలు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న తరుణంలో అండగా నిలిచే ప్రయత్నాలు చేయలేదు. పట్టనట్టే దూరంగా జరగడంతో టీడీపీ శ్రేణులకు ఆమె పట్ల వ్యతిరేకత కనిపిస్తోంది. అలాంటి వారిని ఏరి కోరి చంద్రబాబు మళ్లీ తమ నెత్తిన పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఈసారి ఆమెకు సహకరించేందుకు ఉన్న కొద్ది పాటి నేతలు కూడా సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ పరిస్థితిని పనబాక లక్ష్మి కూడా గుర్తించారని సమాచారం

ఏపీలో అధికార పార్టీ దూకుడుని గ్రహించిన ఆమె ఆచితూచి ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తన అభ్యర్థిత్వం ఖరారయ్యి నాలుగు రోజులు గడిచినా ఆమెలో కదలిక లేదు. తిరుపతి ఎన్నికల్లో ఎంతగా శ్రమించినా మొన్నటి సాధారణ ఎన్నికల నాటి ఓట్లనయినా దక్కించుకోవడం సాధ్యమా అన్నది ఆమెకి అనుమానంగా ఉంది. దాంతో గట్టి ప్రయత్నాలు చేయడం కన్నా నామమాత్రపు పోటీగా మిగిలిపోతే పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే కనీసం తనను ఎంపిక చేసిన అధినేతకు కృతజ్ఞతలుగా ఓ ప్రకటన కూడా ఆమె చేయలేదు. ఆమె అనుచరులు తిరుపతిలో ఎటువంటి హంగామా చేయలేదు. టీడీపీ నైరాశ్యం రాజ్యమేలుతున్న సమయంలో పనబాక కూడా స్తబ్దుగా సాగుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికల వైఎస్సార్సీపీకి నల్లేరు మీద నడకలా కనిపిస్తున్న సమయంలో అనవసరపు హడావిడికి దూరంగా ఉండే యోచనలో పనబాక ఉన్నారు. ఇది కూడా టీడీపీకి కొత్త చిక్కుగా మారింది. చంద్రబాబు ప్రయత్నాలు మళ్లీ బెడిసికొడుతున్నట్టు కనిపిస్తోంది. పనబాక లక్ష్మిని ఎంపికి చేసి పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఆమె నుంచి సహకారం అంతంతమాత్రంగా ఉన్నట్టు కనిపిస్తున్న నేపథ్యం ఆపార్టీలో కలకలం రేపుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి