iDreamPost

తిరుమలలో ప్రారంభమైన శ్రీవారి దర్శనం

తిరుమలలో ప్రారంభమైన శ్రీవారి దర్శనం

లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ మూతపడ్డాయి. జూన్ 8 నుండి ఆలయాలను తెరవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో పుణ్యక్షేత్రం అయిన తిరుమలలో శ్రీవారి దర్శనాలను పునరుద్ధరించారు. దర్శనాలను పునరుద్ధరించిన క్రమంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

మార్చ్ 20 తరువాత తిరుమలలో దర్శనాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దాదాపు 79 రోజుల అనంతరం తిరిగి శ్రీవారి దర్శనాలను ప్రారంభించారు. కాగా ప్రయోగాత్మకంగా దర్శనాలను మొదలుపెట్టారు. మొదటి రెండురోజులు తితిదే ఉద్యోగులకు, 10వ తేదీన స్థానికులకు,11వ తేదీ నుంచి భక్తులందకీ దర్శనం కల్పించేందుకు తితిదే ఏర్పాట్లు పూర్తిచేసింది. గంటకు 500 మంది చొప్పున రోజుకు 6 వేల మందికి శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.

కాగా తిరుమల వెళ్లే యాత్రికులకు తితిదే కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సందర్శకులు ఆ మార్గదర్శకాలు తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు.

నిబంధనలు

తిరుమలకు వచ్చే భక్తులకు కరెంట్ బుకింగ్, ఆన్‌‌లైన్ ద్వారా టైమ్ స్లాట్ టిక్కెట్లు జారీచేయనున్నారు. తిరుమలకు వచ్చేవారికి తప్పనిసరిగా మాస్క్‌లు, గ్లౌజులు ధరించాలి.దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు తన వెంట ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. నిత్య కళ్యాణం, రాహు, కేతు పూజలు, వ్రతాలు, హోమాలు తదితర క్రతువులకు సంబంధించి గతంలో అనుమతించే భక్తుల సంఖ్యలో 30 శాతం మందినే అనుమతించాలి.

కాటేజీల్లోని ఒక గదిలో ఇద్దరు బస చేసేందుకు మాత్రమే అనుమతివ్వాలి. ఒకదాన్ని వదిలి మరొకటి చొప్పున ఉన్నవాటిలో మొత్తం 50 శాతం గదులనే భక్తులకు కేటాయించాలి. కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించే దగ్గర క్షురకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయ ప్రాంగణంలోని దుకాణాలను ఒకదాన్ని విడిచి మరోటి తెరిచేందుకు అనుమతివ్వాలి. అన్నదానం, నిత్యాన్నప్రసాదం ఉండదు. ఆలయాల సమీపంలోని పుష్కరిణి, నదులు, చెరువుల్లో స్నానానికి అనుమతించకూడదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి