iDreamPost

టైల్స్ బ్రేక్ నామినేషన్ – బిగ్ బాస్ ఫన్

టైల్స్ బ్రేక్ నామినేషన్ – బిగ్ బాస్ ఫన్

దిగ్విజయంగా యాభై ఎపిసోడ్లతో సగం ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది బిగ్ బాస్ 4. దసరా రోజు నాగార్జున లేని లోటుని తీరుస్తూ సమంతా మూడు గంటల పాటు ప్రేక్షకులను మెప్పించేలా యాంకరింగ్ చేయడంతో ఇంకో రెండు వారాల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా తననే కంటిన్యూ చేయనుండటం పట్ల నిర్వాహకులు సంతోషంగా ఉన్నారు. ఇంకో ఫిఫ్టీ డేస్ షోని నడపాల్సి ఉంది. ఇక ఫ్రెష్ వీక్ కాబట్టి కొత్తగా ఎలిమినేషన్ల ప్రక్రియ మొదలయ్యింది. యధావిధిగా ఎప్పటిలాగే పరిచయమున్న పాత ప్లస్ కొత్త టాస్కులతో ఎవరిని బయటికి పంపాలనే ప్లాన్స్ తో బిగ్ బాస్ ఆటలు ఆడించాడు. దివి వెళ్తూ వెళ్తూ వేసిన బాంబు ప్రకారం లాస్య వంటగదికే పరిమితమయ్యింది. అభిజిత్ అసిస్టెంట్ కాగా అఖిల్ హెల్ప్ చేస్తూ కనిపించాడు.

ఇక మార్నింగ్ మస్తీ తతంగంతో ఎపిసోడ్ మొదలయ్యింది. తమ తోటి హౌస్ మేట్స్ లో నచ్చిన వాళ్ళలో పాజిటివ్ నెగటివ్ పాయింట్లుగా రాసుకుని చదివి వినిపించాలని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎక్కువ సుత్తి లేకుండా అందరూ పాజిటివ్ గానే చెప్పుకున్నారు. ఇక సీజన్ కాబట్టి పనిలో పనిగా బతుకమ్మ కూడా ఆడేశారు. లాస్య, మోనాల్, అరియనాలు ఆడుతుంటే అవినాష్ జత కలిసి కాసేపు హడావిడి చేశాడు. ఇదంతా ప్లాస్టిక్ పువ్వులతో కానిచ్చేశారు. దుప్పట్లు మడిచే విషయంలో అభి-మోనాల్-లాస్య మధ్య కాసేపు డ్రామా నడిచింది. ఇలాంటివి ఎన్నో చూసినవే కాబట్టి ఇదేమంత ప్రత్యేకంగా అనిపించలేదు. ఇక ఆ తర్వాత అసలైన ఎలిమినేషన్ల తతంగం మొదలయ్యింది.

మొత్తం బాలన్స్ ఉన్న పదకొండు సభ్యులు నామినేషన్లలో పాల్గొన్నారు. దీని కోసం గార్డెన్ ఏరియాలో నిలువుగా పేర్చిన టైల్స్ మీద పార్టిసిపెంట్ ఫోటోలను పేర్చారు. ఒక్కొక్కరు వచ్చి తాము అవతలి వాళ్ళను ఎందుకు నామినేట్ చేస్తున్నామో చెప్పి ఆ పలకను పగలగొట్టాలి. ఇందులో భాగంగా తలా ఇద్దరినీ ఎంచుకున్నారు సభ్యులు. దానికి కారణాలు కూడా గట్టిగానే చెప్పుకున్నారు. దీంతోనే ఎక్కువ సమయం గడిచిపోయింది. అమ్మ రాజశేఖర్ అఖిల్ ని నామినేట్ చేస్తూ మోనాల్ ని కారణంగా చెప్పడంతో కాసేపు వేడి చర్చ జరిగింది. గట్టిగా ఫైర్ అయ్యాడు. దీనికి ఆయనా ఘాటుగా బదులిచ్చాడు. మోనాల్ మరోసారి ఏడ్చి ఏడ్చి వెగటు పుట్టించింది. ఫైనల్ గా అమ్మ రాజశేఖర్, అరియనా, మెహబూబ్, లాస్య, అఖిల్, మోనాల్ లు లిస్ట్ లో మిగిలారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి