iDreamPost

వరల్డ్ కప్​ టీమ్​లోకి తిలక్​ వర్మను తీసుకోవద్దు.. మాజీ సెలెక్టర్ వార్నింగ్!

  • Author singhj Published - 12:48 PM, Fri - 18 August 23
  • Author singhj Published - 12:48 PM, Fri - 18 August 23
వరల్డ్ కప్​ టీమ్​లోకి తిలక్​ వర్మను తీసుకోవద్దు.. మాజీ సెలెక్టర్ వార్నింగ్!

భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకునేందుకు ఎంతో మంది యువ ఆటగాళ్లు ఎదురు చూస్తుంటారు. అయితే కొంతమందికి ఛాన్స్ ఇచ్చినా సరిగ్గా వినియోగించుకోరు. కానీ ఇంకొందరు ప్లేయర్లు మాత్రం దక్కిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టీమ్​లో సెటిల్ అవుతారు. యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ కూడా ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నాడు. రీసెంట్​గా ముగిసిన వెస్టిండీస్​ సిరీస్​లో ఈ తెలుగు కుర్రాడు అద్భుతంగా రాణించాడు. ఈ టోర్నీలో టాప్ స్కోరర్​గా నిలిచిన అతడు.. అందరి దృష్టినీ ఆకర్షించాడు. తొలి ఇంటర్నేషనల్ సిరీస్ అయినా ఎంతో మెచ్యూరిటీ ఉన్న ప్లేయర్​గా ఆడుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

తిలక్ వర్మ ఆటతీరుకు ఇంప్రెస్ అయిన మాజీలు, విమర్శకులు, అభిమానులు.. త్వరలో జరగనున్న వన్డే వరల్డ్ కప్​లో అతడ్ని ఆడించాలని అంటున్నారు. ఆసియా కప్, ప్రపంచ కప్ జట్లలో అతడ్ని తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మాజీ సెలెక్టర్ సబా కరీం మాత్రం ఈ డిమాండ్​ తప్పని అన్నాడు. తిలక్ వర్మ విషయంలో ఇంకొన్నాళ్లు ఓపిక పట్టాల్సిన అవసరం ఉందన్నాడు. టీ20ల్లో ఒక ఆటగాడు రాణించడం చూసి.. అతడ్ని వన్డేలకు సెలెక్ట్ చేయడం అన్యాయమని చెప్పాడు. ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి కీలక టోర్నీలకు జట్టును ఎంపిక చేసే సమయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దన్నాడు సబా కరీం.

ప్రపంచ కప్​లో కచ్చితంగా ఆడే 15 మంది బృందాన్ని ముందుగా సెలెక్టర్లు ఎంపిక చేయాలని సబా కరీం సూచించాడు. ఆ తర్వాతే బ్యాకప్ ప్లేయర్ల గురించి ఆలోచించాలన్నాడు. గతంలో ఇలాగే అంబటి రాయుడ్ని కాదని.. ఎక్స్​పర్ట్స్​ సలహా మేరకు విజయ్ శంకర్​ను తీసుకున్నారని చెప్పుకొచ్చాడు. ఆ వ్యూహం పూర్తిగా బెడిసికొట్టిందని సబా కరీం గుర్తుచేశాడు. అంతేగాక యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్​లో సెలెక్టర్లు తొందరపడి వరుణ్​ చక్రవర్తిని ఎంపిక చేశారని.. ఆ టోర్నీలో అతడు పూర్తిగా తేలిపోయాడని పేర్కొన్నాడు. ఇప్పుడు తిలక్​ వర్మను వన్డే జట్టులోకి తీసుకుంటే అలాంటి పరిస్థితే తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. ఒకవేళ కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్​లు ఫిట్​గా లేకపోతే.. వికెట్ కీపర్, మిడిలార్డర్ బ్యాటర్​ను కొత్తగా సెలెక్ట్ చేయాలని సబా కరీం సూచించాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి