iDreamPost

కళాశాలలు కావవి కారాగారాలు

కళాశాలలు కావవి కారాగారాలు

సంగారెడ్డి నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న సంధ్యారాణి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. హాస్పిటల్ నుండి కుమార్తె మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించిన తండ్రిపై పోలీసులు దాడి చేసి కాళ్లతో తన్నుతున్న దృశ్యాలు బయటకు రావడంతో పోలీసుల తీరుపై విమర్శలు ఎదురవుతున్నాయి. తన కుమార్తెను హత్య చేసారని,ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం తన కుమార్తెకు లేదని మీడియా ముందు మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా అనంతపురం‌ జిల్లాలో‌ ఆకాశాన్నంటుతున్న ఫీజులు తగ్గించమని అడిగిన విద్యార్థి సంఘాలపై నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ తన ప్రైవేటు సైన్యంతో దాడి చేయించిన ఘటన కలకలం‌ రేపింది. ఈ నేపథ్యంలో నారాయణ కాలేజీలోని వసతులు, సౌకర్యాలపై విద్యార్థుల తల్లితండ్రులలో తీవ్రమైన చర్చ నడుస్తోంది.

తమ పిల్లలను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలని ఆశతో తల్లిదండ్రులు నారాయణ కార్పొరేట్ కాలేజీల్లో చేరుస్తుంటే సదరు కళాశాలల యాజమాన్యం పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.నారాయణ ధన దాహానికి గత ఐదు సంవత్సరాల కాలంలో‌ సుమారు 150 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే యాజమాన్యం వేధింపులు, ఒత్తిడులు ఏ రకంగా ఉంటాయోనని భయాందోళనలకు గురి అయ్యే పరిస్థితి నెలకొని ఉంది. లక్షల రూపాయలు ఫీజులు చెల్లిస్తున్నా పిచుక గూళ్ళ లాంటి భవనాలలో సరియైన గాలి వెలుతురు లేక, సరిపడా బాత్రూంలు లేక,క్రీడా ప్రాంగణాలు లేక విద్యార్థులు తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉన్నారు. తల్లితండ్రులకున్న ర్యాంకులు,మార్కుల పట్ల వ్యామోహాన్ని , బలహీనతలను ఆసరాగా చేసుకుని తప్పుడు ప్రకటనలతో మభ్యపెట్టి మోసం చేస్తున్నారు.

ఇంటర్ మీడియట్ బోర్డు నుండి ఇంటర్ విద్యను మాత్రమే బోధించడానికి అనుమతి పొంది నియో, జీ స్పార్క్,ఎమ్ సెట్, ఐఐటీ లాంటి పేర్లతో లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ సరికొత్త దందాకు నాంది పలికింది నారాయణ విద్యా సంస్థలు. కళాశాలలకు అనుబంధంగా నిర్వహించే హాస్టళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. స్నానాల గదుల దగ్గర నుండి డైనింగ్ హాళ్ళ వరకు సౌకర్యాలు అంతంత మాత్రమే. గ్రామీణ,పట్టణ ప్రాంతాలలో ఏ ఇతర చిన్న విద్యాసంస్థలను మనుగడ లేకుండా వారిని పూర్తిగా కబళించేసి ఇంటర్ విద్యను ఆసాంతం తన గుప్పెట్లో పెట్టుకున్నాడు నారాయణ. అడ్మిషన్ల కోసం పీఆర్వో వ్యవస్థకు తెరలేపిన ఘనత మాత్రం నారాయణదే.

అడ్మిషన్ల సమయంలో తల్లితండ్రులను మభ్యపెట్టి తీరా చేరిన తర్వాత చుక్కలు చూపించడం నారాయణకే చెల్లు. విద్యార్థి నారాయణ విద్యా సంస్థలోకి ప్రవేశించింది మొదలు బయటకు వచ్చేంతవరకు ఫీజుల రూపంలో వారి రక్తాన్ని జలగల్లాగా పీల్చడమేనని‌ విద్యార్థుల తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు మొదలైన తరగతులు సాయంకాలం ఎనిమిది గంటలకు ముగిస్తే విద్యార్థికి మానసిక ప్రశాంతత అనేది ఎండమావులే తప్ప మరొక్కటి కాదు. ప్రత్యేకించి నారాయణ కాలేజీలలో ల్యాబొరేటరీలు ఉండవు. ప్రాక్టికల్స్ చేయించరు. ప్రయోగ పరీక్షల సమయంలో ఇంటర్ మీడియట్ బోర్డు జంబ్లింగ్ విధానాన్ని అనుసరించాలని ప్రయత్నించిన ప్రతీసారి నారాయణ తెర వెనుక చక్రం తిప్పి ఆ విధానం లేకుండా చూసుకుని తన కాలేజీల్లోని విద్యార్థులకు 120 కి120 మార్కులు వేసుకునే పరిస్థితి. ఐఐటీ జిప్మర్ ల పేర్లతో విద్యార్థులను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తూ విద్యార్థుల శారీరక విశ్రాంతి కోసం ఆటస్థలాలు లేకుండా వారిని హింసిస్తున్నారు. వేల మంది విద్యార్థులకు నాలుగో, ఐదో బాత్రూంలు ఉంటే వారికి కనీసం లఘుశంఖ తీర్చుకునే అవకాశం కూడా లేకపోవడంతో చిన్న వయస్సులోనే మూత్రపిండాల వ్యాధిబారిన పడుతున్నారు.

అగ్గిపెట్టెలలాంటి తరగతి గదులలో కళాశాలలు నిర్వహిస్తున్న నారాయణ నడుపుతున్న ఏ కళాశాలకూ అగ్నిమాపక శాఖ అనుమతి ఉండదు. ఇటీవల పూనేలోని ఓ కోచింగ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగితే విద్యార్థులు తప్పించుకోడానికి వీలులేక సుమారు 27మంది అగ్నికి ఆహుతయ్యారు. ఈ రకంగా ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేకుండా కళాశాలలు నడపడానికి ప్రాంతీయ పర్యవేక్షణాధికారులకు ఎంతమొత్తం‌ ముడుతోందో భగవంతుడికెరుక! ఏదైనా ఒక కళాశాల స్థాపన‌కొరకు 8,000 చదరపు అడుగులు ,అదనంగా సైన్స్ సెక్షన్ ప్రారంభించినపుడు 2000చదరపు అడుగులు, ఆర్ట్స్ సెక్షన్ ప్రారంభించినపుడు 1200 చదరపు అడుగులు తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి.అనుకోని ప్రమాదం జరిగినపుడు విద్యార్థులు తప్పించుకోడానికి వీలుగా మున్సిపాలిటీ ‌నుండి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఉండాలి.

ఒక్కో బ్రాంచ్ లో సుమారు 2000 మంది విద్యార్థులుంటున్న ప్రతీ కళాశాలలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా వ్యాపారమే ధ్యేయంగా కాలేజీలను కారాగారాలుగా మారుస్తున్నాడు. నారాయణ పురపాలక శాఖా మంత్రిగా ఉండగా ఆయా కళాశాలలోని దందాలను, అక్రమాలను,తతంగాలను విద్యార్థి సంఘాలు ప్రశ్నించినపుడల్లా వారి మీద అక్రమ‌కేసులు బనాయించి జైళ్ళకు పంపించారని నాయకులు తమ ఆక్రోషం వెళ్ళగక్కుతున్నారు. తన కోట్ల రూపాయల అక్రమార్జనను రాజకీయాలలో పెట్టుబడిగా పెట్టి తన పరపతిని పెంచుకొని మంత్రిగా స్థానం సంపాదించుకుని మరింతగా విద్యార్థుల తల్లితండ్రులనుండి ఫీజుల దోపిడీకి తెగబడ్డారని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. వందల‌మంది విద్యార్థుల ఉసురు తీసుకున్న పాపం ఊరికే పోదని కడుపు కోతకు గురైన తల్లులు నారాయణకు శాపనార్థాలు పెడుతున్నారు. ట్యుటోరియల్స్ చెప్పుకునే స్థాయినుండి వేలకోట్ల రూపాయలు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించేదాకా ఎదిగిన నారాయణ చంద్రబాబు కు బినామీ అని కూడా అప్పట్లో జోరుగా గుసగుసలు వినిపించాయి.

విద్యార్థులను పశువుల కంటే హీనంగా చూస్తూ వారిని జైళ్ళ‌లాంటి కళాశాలల్లో బంధించినట్లు వారి బాల్యాన్ని చిదిమేస్తూ,హక్కులను హరిస్తున్న నారాయణను జనం మధ్య కాకుండా జైలులో ఉంచినపుడు ఆ తీవ్రత తెలుస్తుందని మానవ హక్కుల ఉద్యమకారులు,బాలల హక్కుల పరిరక్షణ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలపై 2001లో ప్రొఫెసర్ నీరదా రెడ్డి కమిటీ సిఫారసులు కానీ, 2017 లో నియమించిన ద్విసభ్య కమీషన్ సిపారసులు కానీ అమలు చేయకుండా వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకునేలా చేసిన అప్పటి ప్రభుత్వాలు బాధ్యత వహించవలసిన అవసరమున్నది. ఇంటర్ మీడియట్ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి, మౌలిక సౌకర్యాల కల్పనలోనూ,ఫీజుల వసూలు విషయంలో నిబంధనలు అమలుజరిగేలా కఠినంగా వ్యవహరిస్తే తప్ప నారాయణ విద్యాసంస్థల దోపిడీ ఆగదని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి