iDreamPost

ఈసారి ఆకాశాన్ని అంటుతున్న వినాయకుడి విగ్రహాల ధరలు!

ఈసారి ఆకాశాన్ని అంటుతున్న వినాయకుడి విగ్రహాల ధరలు!

మన దేశంలో జరుపుకునే అతి పెద్ద పండుగుల్లో వినాయక చవితి ఒకటి. భాద్రపద మాసం శుక్ల పక్షంలో వచ్చే చతుర్ధి నాడు గణపతి జన్మించిన రోజును వినాయక చవితిగా జరుపుకుంటారు. విఘ్నాలను తొలగించే దేవుడిగా పేరుగాంచిన విఘ్నేశ్వరుడికి తొలి పూజ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏదైనా పని చేపడితే ఎటువంటి ఆటంకాలు కలుగకుండా విజయం సిద్ధిస్తుందని, కష్టాలు తొలగిపోయి ఇంట సుఖ, సంతోషాలు వెల్లువిరుస్తాయని పురాణాలు చెబుతున్నాయి. శివ, పార్వతుల కుమారుడైన గణేశుడికి.. వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. వినాయక విగ్రహాన్ని తీసుకువచ్చి, పలు ఆకులు, పూలు, పళ్లతో మండపాన్ని అలంకరిస్తారు. మూషిక వాహనుడైన వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు, కుడుములు, పాయసం, పాలతాళికలు వంటి ప్రసాదాలను సమర్పించి, వినాయక వ్రత కల్పం చదువుతారు.

కాగా, ఈ ఏడాది పండుగలన్నీ తగులు, మిగులు వచ్చినట్లే.. వినాయక చవితి కూడా వచ్చింది. ఈ నెల 18, 19వ తేదీల్లో చవిత ఘడియలు ఉండటం వల్ల పండుగ ఎప్పుడు చేసుకోవాలో అని భక్తులు తర్జన భర్జన పడుతున్నారు. అయితే 18వ తేదీన మధ్యాహ్నానికే చవిత ఘడియలు వస్తున్నాయని, ఆ రోజే విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజలు చేయాలని పండితులు సూచించారు. దీంతో చాలా మంది 18న పండుగ చేసుకునేందుకు సిద్దమయ్యారు. పండుగ సోమవారం కాబట్టి ముందు నుండి మండపాలను సిద్ధం చేసుకుని, విద్యుదీపాలను అలకరించి, డీజే బాక్సులు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ సారి వినూత్న రూపాల్లో వినాయక విగ్రహాలు రూపుదిద్దుకున్నాయి. ప్రతి సందుకు మండపాలు ఏర్పాటు చేయడంతో ఈసారి వినాయక విగ్రహాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక వినాయక విగ్రహాలను కొనేందుకు వెళ్లగా.. ఆ ధరలు చూసి భయపడిపోతున్నారు నిర్వాహకులు.

తెలుగు రాష్ట్రాల్లో మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత పెరగడంతో.. వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు భక్తులు. అయితే ఈసారి పెద్ద పెద్ద విగ్రహాల నుండి చిన్న విగ్రహాల వరకు రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. మంట ఉన్నప్పుడు చలికాచుకోవాలన్న చందంగా.. డిమాండ్ ఉన్నప్పుడు సంపాదించుకోవాలన్న అభిప్రాయంలో ఉన్నారు వ్యాపారస్థులు. గతంలో చిన్న విగ్రహం రూ. 20 ధర పలుకుతుండగా.. అది ఇప్పుడు  50 రూపాయలుయ్యి కూర్చుంది. ఇక పెద్ద విగ్రహాల సంగతి చెప్పనక్కర్లేదు. ఐదు వేల నుండి లక్ష వరకు ధర పలికే వినాయకుడి బొమ్మలు.. ఇప్పుడు ఆ ధర కన్నా రెండు, మూడు వేలను మించి ఎక్కువగా పలుకుతున్నాయి. అలాగే మోడల్‌ను బట్టి కూడా విగ్రహాల ధరలు ఉంటున్నాయి. దీంతో కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు గణేష్ ఉత్సవ కమిటీల సభ్యులు. ఇవే కాకుండా ఆయనకు అలకరించే పత్రాలు, పూలు, పళ్ల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. అయినా ఏడాదికి ఒకసారే చేసుకునే పండుగ కాబట్టి.. తమకు నచ్చిన విగ్రహాలను ఎక్కువ వెచ్చించి కొంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి